Share News

ZP Chairperson జడ్పీ పీఠం.. ఎస్టీలకే

ABN , Publish Date - Oct 14 , 2026 | 12:11 AM

ZP Chairperson Post Reserved for STs స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతోంది. దీనిలో భాగంగా సోమవారం మున్సిపాల్టీల రిజర్వేషన్లు ఖరారు చేయగా.. మంగళవారం రాత్రి జడ్పీ రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ మేరకు మన్యం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం గిరిజనులకు కేటాయించారు. జడ్పీ పీఠం ఎస్టీలకు రిజర్వ్‌ చేయడంతో మన్యంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. మరోవైపు ఆశావహుల్లో సందడి నెలకొంది.

ZP Chairperson   జడ్పీ పీఠం.. ఎస్టీలకే
మన్యంలో జడ్పీ కార్యాలయం

  • ఆశావహుల్లో సందడి

  • తొలి చైర్మన్‌గా గిరిపుత్రులకు అవకాశం

పార్వతీపురం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతమవుతోంది. దీనిలో భాగంగా సోమవారం మున్సిపాల్టీల రిజర్వేషన్లు ఖరారు చేయగా.. మంగళవారం రాత్రి జడ్పీ రిజర్వేషన్లను ప్రకటించారు. ఈ మేరకు మన్యం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం గిరిజనులకు కేటాయించారు. జడ్పీ పీఠం ఎస్టీలకు రిజర్వ్‌ చేయడంతో మన్యంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. మరోవైపు ఆశావహుల్లో సందడి నెలకొంది. అధిష్ఠానం ఆశీస్సులు పొంది.. మన్యం జిల్లా తొలి జడ్పీ పీఠం కైవసం చేసుకోవాలని పలువురు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీ సామాజికవర్గానికి చెందిన చెందిన టీడీపీ నాయకులు చైర్మన్‌ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా టీడీపీ రాష్ట్ర నాయకులు వీరేశ్‌చంద్రదేవ్‌, అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు తేజోవతి, పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి పడాల భూదేవి తదితరులతో మరికొంతమంది ఈ రేసులో ఉన్నారు. వైసీపీ నుంచి కూడా అనేక మంది ఎస్టీ సామాజిక వర్గం నేతలు బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వాటికి కూడా రిజర్వేషన్లు ఖరారు కావల్సి ఉంది.

అనుకున్నదే అయ్యింది..

పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠం ఎస్టీలకే కేటాయిస్తారని మంగళవారం ఉదయం నుంచి విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే అందరూ అనుకున్నట్టే ఆ పదవి గిరిజనులకు కేటాయించడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల అంచనాలు తలకిందులయ్యాయి. వాస్తవంగా జిల్లాలోని 15 మండలాల్లో సుమారు 6.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 1.98 లక్షల మంది ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు 77,412 మంది, బీసీలు 3.49 లక్షల మంది , ఇతరులు 19,091 మంది ఓటర్లు ఉన్నారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో జడ్పీ పీఠం కోసం ఆ సామాజికవర్గానికి చెందిన సుమారు పది మంది టీడీపీ నేతలు టికెట్‌ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే జడ్పీ పీఠం ఎస్టీలకు కేటాయించడంతో బీసీ నాయకులు పునరాలోచనలో పడ్డారు.

Updated Date - Oct 14 , 2026 | 12:11 AM