Share News

ZP Chairperson Post Goes to Sirisahasra సిరిసహస్రకే జడ్పీ పీఠం

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:53 AM

ZP Chairperson Post Goes to Sirisahasra

ZP Chairperson Post Goes to Sirisahasra సిరిసహస్రకే జడ్పీ పీఠం

సిరిసహస్రకే జడ్పీ పీఠం

చైర్‌పర్సన్‌గా చిన్నశ్రీను కుమార్తె ఖరారు

బొత్స హవాకు గండికొట్టే వ్యూహం

నేడు ఏకగ్రీవ ఎన్నిక.. ప్రమాణ స్వీకారం

వైస్‌ చైర్‌పర్సన్‌గా పాసాల నీరజకు అవకాశం

విజయనగరం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా మజ్జి సిరి సహస్ర ఎంపికయ్యారు. చివరి వరకు పోటీలో ఉన్న కర్రోతు చంద్రకళను కాదని టీడీపీ అధిష్ఠానం సిరి సహస్ర వైపు మొగ్గుచూపింది. శుక్రవారం కూటమి సభ్యులు ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. వైస్‌ చైర్‌పర్సన్‌గా పాసాల నీరజను ఎంపిక చేశారు. ఈమె బొండపల్లి జడ్పీటీసీగా ఎన్నికల బరిలో దిగి బొత్స సత్యన్నారాయణ కుమార్తె, వైసీపీ అభ్యర్థి బొత్స అనూషపై విజయం సాధించారు. పరిషత్‌ ఎన్నికల్లో మొత్తం 27 జడ్పీటీసీ స్థానాలకు గాను టీడీపీ కూటమి 22, వైసీపీ 5 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో జడ్పీ పీఠం టీడీపీకి దక్కింది. తెర్లాం నుంచి గెలిచిన సిరి సహస్ర, భోగాపురం నుంచి విజయం సాధించిన చంద్రకళ చైర్‌పర్సన్‌ పదవిని ఆశించారు. చివరకు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సిరి సహస్రకు అవకాశం దక్కింది.

చిన్నశ్రీను చేరికకు ప్రతిఫలం

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు తండ్రి చిన్నశ్రీనుతో కలిసి సిరి సహస్ర టీడీపీలో చేరారు. తెర్లాం జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన చిన్నశ్రీను, బొత్స సత్యనారాయణకు ముఖ్య సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. 2021 పరిషత్‌ ఎన్నికల్లో తెరపైకి వచ్చి జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత బొత్స, చిన్నశ్రీను మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. జడ్పీ చైర్మన్‌ పదవిని తన కుమార్తెకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్న చిన్నశ్రీను.. బొత్స తన కుమార్తె అనూష పోటీ చేస్తారని ప్రకటించడంతో అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సిరి సహస్రకు జడ్పీ పీఠం ఇస్తామన్న హామీతో టీడీపీలో చేరినట్టు ప్రచారం ఉంది. తాజాగా ఆమె ఎంపికతో ఆ హామీ నెరవేరినట్టయింది.

బొత్సకు చెక్‌ పెట్టే వ్యూహం

జిల్లాలో బొత్స కుటుంబానికి ఉన్న రాజకీయ పట్టును తగ్గించడంతోపాటు, చిన్నశ్రీను సేవలను వినియోగించుకోవాలన్న వ్యూహంతోనే టీడీపీ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. బొత్సకు జిల్లాలో పార్టీ యంత్రాంగంపై పట్టు ఉండగా, దాని నిర్వహణలో చిన్నశ్రీను కీలకంగా వ్యవహరించేవారు. ఆయన చేరికతో వైసీపీకి సంస్థాగతంగా దెబ్బ తగిలిందన్న అంచనాలున్నాయి. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చిన్నశ్రీను, సిరి సహస్రలకు జిల్లాలో పార్టీ బలోపేత బాధ్యతలు అప్పగించే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల బడ్డుకొండ అప్పలనాయుడు కూడా టీడీపీలో చేరిన నేపథ్యంలో జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

Updated Date - Nov 20 , 2026 | 12:53 AM