Share News

Zilla Parishad మన్యంలో జడ్పీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:07 AM

Zilla Parishad in the Agency జిల్లాలో జడ్పీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి పార్వతీపురం మండలం నర్సిపురం కేంద్రంగా విధులు ప్రారంభం కానున్నాయి. తాత్కాలికంగా డీఎల్‌పీవో కార్యాలయంలో జడ్పీని నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా జిల్లా ప్రజా పరిషత్‌కు సంబంధించి అధికారుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Zilla Parishad  మన్యంలో జడ్పీ
జడ్పీ కార్యాలయం ప్రారంభించేది ఈ భవనంలోనే..

  • తాత్కాలికంగా డీఎల్‌పీవో కార్యాలయంలో నిర్వహణ

  • ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌

  • ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం

పార్వతీపురం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి పార్వతీపురం మండలం నర్సిపురం కేంద్రంగా విధులు ప్రారంభం కానున్నాయి. తాత్కాలికంగా డీఎల్‌పీవో కార్యాలయంలో జడ్పీని నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా జిల్లా ప్రజా పరిషత్‌కు సంబంధించి అధికారుల నియామకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 24 తర్వాత జడ్పీ సీఈవోతో పాటు డిప్యూటీ సీఈవోల నియామకం జరగనుంది. అదే విధంగా కార్యాలయ అడ్మిని స్ర్టేటివ్‌ అధికారి , వివిధ హోదాల్లో కార్యాలయ సిబ్బంది నియామకం కానున్నారు. కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి జడ్పీ ప్రత్యేక అధికారిగా వ్యవహరించ నున్నారు. మొత్తంగా జిల్లా నుంచే జడ్పీ అధికారిక కార్యక్రమాలు ప్రారంభం కానుండడంతో మన్యం వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

24తో ముగియనున్న పాలకవర్గం గడువు

ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో కొనసాగుతున్న జడ్పీ పాలకవర్గం గడువు ఈ నెల 24తో ముగియనుంది. దీంతో 25వ తేదీ నుంచి కొత్త జిల్లాల్లో జిల్లా ప్రజా పరిషత్‌ అధికారక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే మన్యం జిల్లాలో జడ్పీ ఏర్పాటుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా ప్రజా పరిషత్‌ పరిధిలో పార్వతీపురం సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాలకు చెందిన 15 మండలాల ఎంపీడీవోలు, కార్యాలయ సిబ్బంది విధులు నిర్వహించాల్సి ఉంది. కాగా స్థానిక ఎన్నికలు జరిగే వరకు జడ్పీలో ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతుంది. దీనిపై ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ సీఈవో లవరాజును వివరణ కోరగా.. ‘ఈ నెల 25 నుంచి పార్వతీపురం మండలం నర్సిపురంలో కొత్తగా జిల్లా ప్రజా పరిషత్‌ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి అధికారుల నియామకం కూడా త్వరలోనే పూర్తవుతుంది. తాత్కాలికంగా డీఎల్‌పీవో కార్యాలయంలో జడ్పీని ఏర్పాటు చేస్తున్నాం. ’ అని తెలిపారు.

Updated Date - Sep 20 , 2026 | 12:07 AM