Zilla Parishad in Manyam మన్యంలో జిల్లా పరిషత్
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:35 AM
Zilla Parishad in Manyam పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో జడ్పీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ , డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టును మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పోస్టులు మంజూరు చేస్తూ ఆదేశాలు
పార్వతీపురం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పాలనా వికేంద్రీకరణలో భాగంగా పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లా ప్రజా పరిషత్‌లను పునర్‌వ్యవస్థీకరించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో జడ్పీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ , డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పోస్టును మంజూరు చేస్తూ శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల పరిధిలోని 15 మండలాలతో కొత్తగా జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటు కానుంది. 2022లో జిల్లాల విభజన జరిగినా జడ్పీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచు కొస్తున్న తరుణంలో జడ్పీ విభజనపై ప్రభుత్వం దృష్టిసారించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా ప్రజా పరిషత్ ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది.
మన్యం జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు అవుతున్నా.. ఒక్కసారి కూడా జిల్లాకేంద్రంలో జడ్పీ సమావేశం నిర్వహించలేదు. దీనిపై అప్పట్లో ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిసోయాయి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా విజయనగరం జడ్పీ కార్యాలయంలోనే సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు , జడ్పీటీసీలు వెళ్లేవారు. కాగా జిల్లా ప్రజా పరిషత్ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. 25 నుంచి ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో జడ్పీ పాలన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.