కొలువుదీరిన జడ్పీ పాలకవర్గం
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:07 AM
జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది.
-సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అధికారులు
- చైర్‌పర్సన్‌గా నీలిమ
- వైస్ చైర్మన్‌గా వీరేష్‌చంద్రదేవ్
-నూతన పాలకవర్గాన్ని అభినందించిన మంత్రి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు
పార్వతీపురం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ నూతన పాలకవర్గం కొలువుదీరింది. జిల్లా ఏర్పడిన తర్వాత ఏర్పాటైన మొట్టమొదటి జడ్పీ పాలకవర్గం సభ్యులతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్, ఇన్‌చార్జి జేసీ వైశాలి ఆధ్వర్యంలో జడ్పీ సీఈవో సుధాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం సందడిగా జరిగింది. 15 మంది సభ్యులు పూర్తిస్థాయిలో హాజరయ్యారు. ఇద్దరు మినహా మిగిలిన సభ్యులు వారికి వారే ప్రమాణ స్వీకార పత్రాన్ని చదివి ప్రమాణం చేశారు. వీరేష్ చంద్రదేవ్ ఇంగ్లీష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభించారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా భామిని నుంచి జనసేన జడ్పీటీసీ సభ్యురాలుగా ఎన్నికైన నిమ్మల నీలిమ పేరును కురుపాం జడ్పీటీసీ వీరేష్‌చంద్రేవ్ ప్రతిపాదించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బలిజిపేట జనసేన జడ్పీటీసీ పి.చాందిని బలపరిచారు. నీలిమకు ఆమెతో పాటు పది మంది సభ్యులు మద్దతు పలుకుతూ చేతులెత్తారు. దీంతో ఆమె జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి వైశాలి ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. వీరేష్‌చంద్రదేవ్ పేరును వీరఘట్టం జడ్పీటీసీ ఉదయ్‌భాస్కర్ ప్రతిపాదిం చగా జియ్యమ్మవలస జడ్పీటీసీ దత్తి కామేశ్వరి బలపరిచారు. ఆయనతో పాటు పది మంది సభ్యులు వీరేష్‌చంద్రదేవ్‌కు మద్దతు పలుకుతూ చేతులెత్తారు. దీంతో వీరేష్‌చంద్రదేవ్ జడ్పీ వైస్ చైర్మన్‌గా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం నీలిమతో పాటు వీరేష్‌చంద్రదేవ్‌కు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. నూతన పాలకవర్గ సభ్యులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, ఎమ్మెల్సీ గ్రీష్మ, అధికారులు తదితరులు అభినందించారు.
అన్ని విధాలా అభివృద్ధి చేస్తా..
ప్రతి ఒక్కరీ సహకారంతో జిల్లానఅన్ని విధాలా అభివృద్ధి చేస్తానని కొత్తగా ఎన్నికైన జడ్పీ చైర్‌పర్సన్ నీలిమ తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆశీస్సులతో చైర్‌పర్సన్ స్థానం లభించిందన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎంతో కీలక బాధ్యతలను అప్పగించారని, దానికి న్యాయం చేస్తానని తెలిపారు.
మహిళా సమాఖ్య నుంచి జడ్పీ చైర్‌పర్సన్‌గా..
జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన నిమ్మల నీలిమ స్వగ్రామం కురుపాం మండలంలోని మారుమూల గిరిజన గ్రామం అధ్వానంగూడ. ఆమె భర్త మాజీ జడ్పీటీసీ నిమ్మల నిబ్బరం. ఈయన స్వగ్రామం భామిని మండలం మనుమకొండ. భర్తతో కలిసి నీలిమ మనుమకొండలో నివాసం ఉంటుంది. నీలిమ భామిని మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా ఉంటూ నేడు జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. భర్త నిబ్బరం 1995లో మనుమకొండ సర్పంచ్‌గా, 2004లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్యేగా స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల తన భార్య నీలిమను భామిని జడ్పీటీసీగా పోటీ చేయించి విజయం సాధించారు. నీలిమ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మారుమూల గిరిజన గ్రామంలో జన్మించి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆమెకు గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు మైదాన ప్రాంతాల అభివృద్ధికి ఒక అవకాశం లభించిందని అని చెప్పవచ్చు.
వీరేష్‌కు వరించిన వైస్ చైర్మన్ పదవి..
పొత్తుల కారణంగా వీరేష్ చంద్రదేవ్‌కు జడ్పీ పీఠాన్ని అధిష్ఠానం కేటాయించలేకపోయింది. కానీ, వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పించి ఆయనపై పార్టీకి ఉన్న గౌరవాన్ని స్పష్టం చేసింది. వైస్ చైర్మన్ పదవిని ఎంతో మంది ఆశించారు. అయినప్పటికీ వీరేశ్‌కు వరించింది. గతంలో ఈయన పెద్దనాన్న కిషోర్ చంద్రదేవ్ కేంద్ర మంత్రిగా, తండ్రి ప్రదీప్‌దేవ్ పార్లమెంట్ సభ్యునిగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించారు. తర్వాత కొంతకాలం రాజకీయంగా వైరిచర్ల కుటుంబంలో స్తబ్దత నెలకొంది. ఇలాంటి సమయంలో వైరిచర్ల రాజకీయ వారసుడిగా వీరేష్‌చంద్రదేవ్ వచ్చారు. తొలిసారే జడ్పీటీసీగా గెలిచి వైస్ చైర్మ్‌న్‌గా ఎన్నికయ్యారు.
నీలిమ కన్నవారి గ్రామంలో సంబరాలు
కురుపాం రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా నిమ్మల నీలిమ ప్రమాణ స్వీకారం చేయడంతో ఆమె కన్నవారి గ్రామం అధ్వాన్నంగూడలో సంతోషాలు వెల్లివిరిశాయి. గ్రామస్థులు సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామానికి చెందిన బిడ్డిక వెంకన్న, అప్పన్నిలకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా నీలిమ 4వ సంతానం. నీలిమ అన్నయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా టిక్కబాయి పాఠశాలలో పనిచేస్తున్నారు. మిగతా తోబుట్టువులు అయిన సుగన్న, సొంబర, శ్రీదేవి, జైసుధ వ్యవసాయం చేస్తున్నారు. నీలిమ తండ్రి వెంకన్న, అన్న సొంబర గతంలో మొండెంఖల్ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా పదవులు అలంకరించారు. సాధారణ గిరిజన కుటుంబంలో జన్మించిన తమ బిడ్డ ఉన్నత పదవి అలంకరించడం తమ గ్రామానికి, తమ సవర తెగకు ఎంతో సంతోషదాయకమని నీలిమ తల్లి అప్పన్ని గ్రామస్థులు సొంబర, మాస, మిన్నారావు అన్నారు.