Share News

Zilla Parishad Elections పరిషత్‌ పోరుకు మోగిన నగారా

ABN , Publish Date - Oct 19 , 2026 | 11:46 PM

Zilla Parishad Elections: The Battle Begins పరిషత్‌ పోరుకు రంగం సిద్ధమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లాలోని 15 మండలాల్లో 451 పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ నెల 21 నుంచి 23 వరకు మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

Zilla Parishad Elections  పరిషత్‌ పోరుకు మోగిన నగారా
జడ్పీ కార్యాలయం

  • నవంబరు 3న పోలింగ్‌.. 5న ఫలితాల వెల్లడి

పార్వతీపురం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): పరిషత్‌ పోరుకు రంగం సిద్ధమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జిల్లాలోని 15 మండలాల్లో 451 పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో 226 ఎంపీటీసీ, 15 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం.. ఈ నెల 21 నుంచి 23 వరకు మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న వాటిని పరిశీలిస్తారు. 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌ చేసుకోవచ్చు. 26న ఎన్నికల అధికారి నామినేషన్ల తిరస్కరణపై తుది నిర్ణయం తీసుకుంటారు. 27న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు. వచ్చే నెల 3న జిల్లాలోని 15 మండలాల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబరు నాలుగో తేదీన అవసరమైన చోట ఎన్నికల అధికారి అనుమతితో రీపోలింగ్‌ చేపడతారు. 5న ఓట్లు లెక్కించి.. వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. గెలిచిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు. ఆ తర్వాత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎంపీపీ, జడ్పీ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తారు.

ఓటర్లు ఇలా..

జిల్లాలోని 15 మండలాల్లో 6,43,874 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,14,899 మంది పురుషులు, 3,28,910 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 65 మంది వరకు ఉన్నారు. అత్యధిక ఓటర్లు (51,891 మంది) ఉన్న మండలంగా వీరఘట్టం , అతి తక్కువ ఓటర్లు ( 35,037 మంది) ఉన్న మండలంగా గుమ్మలక్ష్మీపురం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా పరిషత్‌ ఎన్నిల్లో 6,43,874 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

రిజర్వేషన్లు ఇలా..

జడ్పీటీసీలకు సంబంధించి.. కొమరాడ, భామిని స్థానాలను ఎస్టీ మహిళకు , గుమ్మలక్ష్మీపురం, మక్కువ, సీతంపేట ఎస్టీ జనరల్‌కు, సాలూరు, బలిజిపేట, గరుగుబిల్లి, పాచిపెంట, సీతానగరం స్థానాలను జనరల్‌ మహిళకు కేటాయించారు. పాలకొండ ఎస్సీ, కురుపాం, వీరఘట్టం, పార్వతీపురం, జియ్యమ్మవలస స్థానాలను జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. ఎంపీపీలకు సంబంధించి కొమరాడ, భామిని స్థానాలను ఎస్టీ జనరల్‌కు, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట స్థానాలను ఎస్టీ మహిళకు, సీతానగరం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. బలిజిపేట, మక్కువ స్థానాలను జనరల్‌ మహిళకు కేటాయించారు. పార్వతీపురం, పాచిపెంట, గరుగుబిల్లి, సాలూరు ఎంపీపీ స్థానాలు జనరల్‌కు రిజర్వ్‌ చేశారు. వీరఘట్టం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ చేశారు. జియమ్మవలస మండలం అన్‌రిజర్వ్‌డ్‌ మహిళగా నిర్ణయించారు.

ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారి...

పరిషత్‌ ఎన్నికల నిర్వహణ కోసం ఎంపీడీవోతో పాటు ప్రతి మండలానికి ఒక ఎన్నికల ప్రత్యేకాధికారిని నియమించారు. 15 మండలాలకు 15 మంది ప్రత్యేకాధికారులు, జిల్లా స్థాయి అధికారులను నియమించారు. నామినేషన్‌ ప్రక్రియ మొదలు.. పోలింగ్‌ ముగిసే వరకు వారంతా ఎన్నికల్లో విఽధుల్లోనే ఉండనున్నారు. దీనిపై జడ్పీ సీఈవో సుధాకరరావు మాట్లాడుతూ.. పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 21 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు సహకరించాలని కోరారు.

Updated Date - Oct 19 , 2026 | 11:46 PM