Share News

Zilla Parishad Division! జడ్పీ విభజన!

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:38 AM

Zilla Parishad Division! జిల్లా పరిషత్‌ విభజనపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదికగానే.. అంటే గతంలో 13 జిల్లా పరిషత్‌లు ఉండగా పెరిగిన జిల్లాలకు అనుగుణంగా 28 జడ్పీలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది.

Zilla Parishad Division! జడ్పీ విభజన!

జడ్పీ విభజన!

ఏ జిల్లాకు ఆ జిల్లాగానే జిల్లా పరిషత్‌

మన జడ్పీలో నుంచి మూడు నియోజకవర్గాలు అవుట్‌

మెంటాడ మండలం యథాతథం

కొత్తగా రాజాం నియోజకవర్గం చేరిక

ఈ నెల 24తో ముగియనున్న పాలకవర్గాలు

ఆ మరుసటి రోజు నుంచి కొత్త జిల్లా పరిషత్‌లు ఆవిర్భావం

విజయనగరం, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ విభజనపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదికగానే.. అంటే గతంలో 13 జిల్లా పరిషత్‌లు ఉండగా పెరిగిన జిల్లాలకు అనుగుణంగా 28 జడ్పీలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏ జిల్లాకు ఆ జిల్లా జడ్పీగా కొనసాగనుంది. ఈ నెల 24 వరకూ జడ్పీ పాలకవర్గాల పదవీకాలం ఉంది. ముగిసిన మరుక్షణం కొత్త జడ్పీలు సైతం అమల్లోకి వస్తాయి.

విజయనగరం జిల్లా పరిషత్‌ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్‌ ఏర్పాటుకానుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు విజయనగరం జిల్లా పరిషత్‌లో చేరనున్నాయి. ఇప్పటివరకూ విజయనగరంలో కొనసాగిన పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లోని 11 మండలాలు మన్యం జడ్పీ పరిధిలో చేరనున్నాయి. సాలూరు పరిధిలోని మెంటాడ మాత్రం మన జడ్పీలోనే కొనసాగనుంది. 27 మండలాలతో విజయనగరం జడ్పీ అవతరించనుంది.

అప్పట్లో నిర్లక్ష్యం..

జిల్లాల విభజన చేసిన వైసీపీ ప్రభుత్వం జడ్పీల ఏర్పాటులో నిర్లక్ష్యం చేసింది. 2022 ఉగాది నాడు వైసీపీ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. విజయనగరంలో ఉన్న పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళంలో ఉన్న పాలకొండను తెచ్చి మన్యం పార్వతీపురం జిల్లాను ఏర్పాటుచేశారు. విజయనగరం జిల్లాలోకి కొత్తగా శ్రీకాకుళం నుంచి రాజాం వచ్చి చేరింది. అయితే ఇప్పటివరకూ రాజాం, పాలకొండ నియోజకవర్గాలు ఉమ్మడి శ్రీకాకుళం జడ్పీ పరిధిలోనే ఉండేవి. రాజాం విజయనగరం జడ్పీలో, పాలకొండ పార్వతీపురం మన్యం జడ్పీలో చేరనుంది. ఉద్యోగుల విభజన, జిల్లా పరిషత్‌ భవనాల గుర్తింపు వంటి వాటిపై పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

---------

Updated Date - Sep 06 , 2026 | 12:39 AM