Share News

Zilla Parishad Division!జడ్పీ విభజన!

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:15 AM

Zilla Parishad Division! జిల్లా పరిషత్‌ విభజనపై స్పష్టత వచ్చింది. 2022లో జిల్లాల విభజన జరిగినా జడ్పీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జడ్పీ విభజనపై ప్రభుత్వం దృష్టిసారించింది. కొత్త జిల్లాల ప్రాతిపాదికనే జడ్పీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంది.

Zilla Parishad Division!జడ్పీ విభజన!

జడ్పీ విభజన!

రాష్ట్ర మంత్రివర్గంలో నిర్ణయం

ఇప్పటివరకూ ఉమ్మడి విజయనగరం జడ్పీగానే..

కొత్త జిల్లాల ప్రాతిపాదికన జిల్లా పరిషత్‌ ఏర్పాటుకు అవకాశం

పార్వతీపురం మన్యం జడ్పీలోకి మూడు నియోజకవర్గాలు

శ్రీకాకుళం నుంచి రాజాం విజయనగరంలోకి..

పాలకొండను పార్వతీపురం మన్యంలో చేర్చనున్న ప్రభుత్వం

జిల్లా పరిషత్‌ విభజనపై స్పష్టత వచ్చింది. 2022లో జిల్లాల విభజన జరిగినా జడ్పీ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జడ్పీ విభజనపై ప్రభుత్వం దృష్టిసారించింది. కొత్త జిల్లాల ప్రాతిపాదికనే జడ్పీలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో ఇప్పటివరకూ ఉన్న కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లోని మండలాలు కొత్తగా ఏర్పాటు కాబోయే పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్‌లో కలవనున్నాయి. అలాగే రాజాం నియోజక వర్గంలోని నాలుగు మండలాలు జిల్లాలో కొత్తగా కలవనున్నాయి.

విజయనగరం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి):

2022 ఉగాది నాడు వైసీపీ హయాంలో కొత్త జిల్లాల ప్రకటన విడుదలైంది. విజయనగరంలో ఉన్న పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గంతో పాటు శ్రీకాకుళంలో ఉన్న పాలకొండను తెచ్చి మన్యం పార్వతీపురం జిల్లాను ఏర్పాటుచేశారు. విజయనగరం జిల్లాలోకి కొత్తగా శ్రీకాకుళం నుంచి రాజాం వచ్చి చేరింది. అయితే ఇప్పటివరకూ రాజాం, పాలకొండ నియోజకవర్గాలు ఉమ్మడి శ్రీకాకుళం జడ్పీ పరిధిలోనే ఉండేవి. రాజాం విజయనగరం జడ్పీలో, పాలకొండ పార్వతీపురం మన్యం జడ్పీలో చేరనుంది. ఉద్యోగుల విభజన, జిల్లా పరిషత్‌ భవనాల గుర్తింపు వంటి వాటిపై ప్రభుత్వం దృష్టిసారించే అవకాశం ఉంది.

వైసీపీ హయాంలో నిర్వీర్యం..

ఐదేళ్ల వైసీపీ పాలనలో పల్లెపాలన పూర్తిగా పడకేసింది. నిధులు లేక..విధులు లేక జిల్లా పరిషత్‌ పాలకవర్గం ఉత్సవ విగ్రహంలా మారింది. రాష్ట్రంలోనే రాజకీయ వేదికగా మారిన ఏకైక జిల్లా పరిషత్‌ విజయనగరం అని ముద్ర పడింది. వైసీపీ హయాంలో జడ్పీని నిర్వీర్యం చేశారన్న విమర్శలున్నాయి. జిల్లాల విభజన జరిగినా.. జిల్లా పరిషత్‌ మాత్రం ఉమ్మడిగానే సాగుతూ వచ్చింది. విజయనగరం జిల్లాలో 776, మన్యం జిల్లాలో 451 పంచాయతీలున్నాయి. వీటిలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఆర్థిక సంఘం నిధులతోనే వేయాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ నిధులన్నింటినీ దారి మళ్లించింది. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.29.27 కోట్లు విడుదలైతే పూర్తిగా పక్కదారి పట్టించేశారు. రెండో విడత నిధులు సైతం వివిధ పద్దుల కింద సర్దుబాటు చేసేశారు. ప్రజలకు అందించే తాగునీటికి పరీక్షలు చేయడం, క్లోరినేషన్‌ వంటి చర్యలు పూర్తిగా లోపించాయి. రెండు జిల్లాల పరిధిలో 10 ప్రయోగ శాలలు ఉండేవి. వాటి పరిధిలో మండలాల్లో ఏడాదికోసారి కెమికల్‌, రెండుసార్లు బ్యాక్టీరియా పరీక్షలు నిర్వహించాలి. ఇవి కాకుండా అత్యవసర సమయాల్లో సైతం పరీక్షలు చేపట్టాలి. పంచాయతీలకు ఫీల్డ్‌ టెస్ట్‌ కిట్లు అందించాలి. ఇవన్నీ ఆర్థిక సంఘ నిధులతోనే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

తాగునీటికి కష్టం..

ఉమ్మడి జిల్లాలో 33 సీపీడబ్ల్యూఎస్‌ పథకాలున్నాయి. వీటి ద్వారా సుమారు 10 లక్షల మంది జనాభాకు తాగునీరు అందిస్తున్నారు. వీటి నిర్వహణకు ఆర్థిక సంఘం నిధులనే కేటాయించేవారు. ఏటా రూ.40 కోట్లు ఉంటే కానీ వీటి నిర్వహణ సాధ్యం కాదు. కానీ జిల్లా పరిషత్‌ ద్వారా కేవలం రూ.16 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాటిని బకాయిగా పెడుతుండడంతో సంబంధిత నిర్వాహకులకు పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహణకుగాను రూ.168.కోట్ల వ్యయం కాగా..జడ్పీకి ఆర్థిక సంఘం నిధులు రూ.52.20 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన రూ.116.63 కోట్లు అందించాలి. కానీ వైసీపీ ప్రభుత్వం మొండిచేయి చూపింది. ఇలా గత ఐదేళ్లలో జడ్పీ పాత్ర నామమాత్రమే.

ఆదాయం లేకుండానే..

రిజిస్ర్టేషన్‌ సర్‌చార్జీలు, నీటి తీరువా పన్నుల్లో కొంత మొత్తం ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయం వచ్చేది. ఎకరాకు నీటి తీరువా రూ.200 వసూలు చేస్తే అందులో 5 నుంచి 10 శాతం పంచాయతీలకు జమ అయ్యేది. పంచాయతీ పరిధిలో ఎవరైనా భూములు విక్రయించి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్టయితే రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి సర్‌ చార్జీల రూపంలో కొంత మొత్తం పంచాయతీలకు వచ్చేది. కానీ కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అటు ఆదాయం లేక ఎమ్మెల్యేలు, ఎంపీల నిధులపై ఆధారపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేల నిధుల అంతంతమాత్రమే. దీంతో నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు నిధులు సర్దుబాటు చేయలేక ఎమ్మెల్యేలు చేతులెత్తేశారు. కొన్ని మండలాల్లో అయితే ఎంపీపీలు, జడ్పీటీసీలు కూర్చునేందుకు కనీసం చాంబర్లు లేవు. పాత భవనాల్లో అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణకే కష్టంగా ఉంది. ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం గాడిన పెట్టే ప్రయత్నం చేస్తోంది. జడ్పీ విభజనతోనైనా కష్టాలు తీరుతాయో.. లేదో చూడాలి.

-------------------

Updated Date - Aug 20 , 2026 | 12:15 AM