Share News

Zilla Parishad Division! జడ్పీ విభజన!

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:26 AM

Zilla Parishad Division! జిల్లా పరిషత్‌ విభజనకు కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. జిల్లాల విభజన జరిగినా జిల్లా పరిషత్‌ మాత్రం ఉమ్మడిగానే సాగుతోంది. 2022లో జిల్లాల విభజన జరిగింది. 27 మండలాలతో విజయనగరం, 15 మండలాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటైంది.

Zilla Parishad Division! జడ్పీ విభజన!

జడ్పీ విభజన!

కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం

ఉద్యోగుల విభజన దిశగా అడుగులు

సెప్టెంబరుతో ముగియనున్న పాలకవర్గ పదవీకాలం

రెండు జిల్లాలకు వేర్వేరుగా ఎన్నికలు

అప్పుడే సందడి ప్రారంభం

విజయనగరం, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి):

జిల్లా పరిషత్‌ విభజనకు కసరత్తు ప్రారంభమైనట్టు తెలుస్తోంది. జిల్లాల విభజన జరిగినా జిల్లా పరిషత్‌ మాత్రం ఉమ్మడిగానే సాగుతోంది. 2022లో జిల్లాల విభజన జరిగింది. 27 మండలాలతో విజయనగరం, 15 మండలాలతో పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పాటైంది. విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న కురుపాం, సాలూరు, పార్వతీపురం నియోజకవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంతో కలిపి పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పాటుచేశారు. విజయనగరం జిల్లాలో కొత్తగా శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం నియోజకవర్గాన్ని చేర్చారు. అయితే జిల్లా పరిషత్‌ విభజన మాత్రం చేయలేకపోయారు. కాగా పాలకవర్గాలు ఈ సెప్టెంబరుతో ముగియనుండడంతో జిల్లా పరిషత్‌ను వేరుచేసి ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. ముందుగా ఉద్యోగుల జాబితాలను రూపొందిస్తున్నారు. ఆపై ఉద్యోగుల సీనియార్టీ, ఇతర ప్రాధాన్యతలను గుర్తించి అందుకు అనుగుణంగా కేటాయించనున్నారు. మరోవైపు పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా పరిషత్‌ కార్యాలయ భవనాన్ని గుర్తించే పనిలో ఉన్నారు.

పల్లె పాలనలో జడ్పీదే అగ్రస్థానం..

పల్లె పాలనలో జిల్లా పరిషత్‌ది అగ్రస్థానం. 32 శాఖలతో జడ్పీ గట్టి ప్రభావమే చూపుతూ ఉంటుంది. కానీ వైసీపీ హయాంలో జిల్లా పరిషత్‌ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో పల్లెపాలన పూర్తిగా పడకేసింది. నిధులు లేక..విధులు లేక జిల్లా పరిషత్‌ పాలకవర్గం ఉత్సవ విగ్రహంలా మారింది. ఆర్థిక సంఘం నిధులన్నీంటినీ లాగేశారు. పారిశుధ్య పనులు నిలిచిపోయాయి.

జిల్లాల విభజన జరిగినా..

జిల్లాల విభజన జరిగినా.. జిల్లా పరిషత్‌ మాత్రం ఉమ్మడిగానే సాగుతోంది. విజయనగరం జిల్లాలో 777, మన్యం జిల్లాలో 451 పంచాయతీలున్నాయి. వీటిలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఆర్థిక సంఘం నిధులతోనే వేయాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ నిధులన్నింటినీ దారి మళ్లించింది. జడ్పీ పరిధిలో ఉమ్మడి జిల్లాలో 33 సీపీడబ్ల్యూఎస్‌ పథకాలున్నాయి. వీటి ద్వారా సుమారు 10 లక్షల మంది జనాభాకు తాగునీరు అందిస్తున్నారు. వీటి నిర్వహణకు ఆర్థిక సంఘం నిధులనే కేటాయించేవారు. ఏటా రూ.40 కోట్లు ఉంటే కానీ వీటి నిర్వహణ సాధ్యం కాదు. కానీ జిల్లా పరిషత్‌ ద్వారా కేవలం రూ.16 కోట్లు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారు. జడ్పీ విభజిస్తే ఇటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా? లేదా? అన్నది చూడాలి.

అభివృద్ధి చేయని పాలకవర్గం

వైసీపీ హయాంలో విజయనగరం జిల్లా పరిషత్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పట్లో కొన్ని జడ్పీటీసీలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందన్న విమర్శలున్నాయి. ప్రతిపక్షాలకు జిల్లా పరిషత్‌లో కనీస ప్రాతినిధ్యం లేదు. పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాని విధంగా భయపెట్టారు. పోనీ పాలకవర్గం ఏమైనా జిల్లాపై ప్రభావం చూపిందంటే అదీ లేదు. జడ్పీ పాలకవర్గానికి కేవలం కొన్ని నెలల పదవీకాలం మాత్రమే ఉంది. గడిచిన ఐదేళ్లలో జిల్లా పరిషత్‌ జిల్లా అభివృద్ధిలో ఎటువంటి ముద్ర చూపలేకపోయింది. మండల పరిషత్‌ల్లోనూ ఆశించిన స్థాయిలో నిధులు లేవు. కొన్ని మండలాల్లో అయితే బ్యాంక్‌ అకౌంట్లలో నిల్‌ బ్యాలెన్స్‌ చూపిస్తోంది. రిజిస్ర్టేషన్‌ సర్‌చార్జీలు, నీటి తీరువా పన్నుల్లో కొంత మొత్తం స్థానిక సంస్థలకు ఆదాయం రూపంలో వచ్చేది. ఎకరాకు నీటి తీరువా సుమారు రూ.200 వసూలు చేస్తే అందులో 5 నుంచి 10 శాతం పంచాయతీలకు జమ అయ్యేది. పంచాయతీ పరిధిలో ఎవరైనా భూములు విక్రయించి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్టయితే రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి సర్‌చార్జీల రూపంలో కొంత మొత్తం పంచాయతీలకు వచ్చేది. కానీ కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. అటు ఆదాయం లేక ఎమ్మెల్యేలు, ఎంపీల నిధులపై ఆధారపడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జిల్లా పరిషత్‌ కొత్త జవసత్వాలు పొందనుంది. జడ్పీ విభజనతో రెండు జిల్లాలకు వేర్వేరుగా జిల్లా పరిషత్‌ చైర్మన్లు వస్తారు. నేతలకూ అవకాశాలు రానున్నాయి.

--------------------

Updated Date - Jun 23 , 2026 | 12:26 AM