YSRCP Loses ఆ మూడు చోట్ల వైసీపీ ఓటమి
ABN , Publish Date - Nov 10 , 2026 | 12:01 AM
YSRCP Loses in All Three Places పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోలుకోలేని అపజయం ఎదురైంది. టీడీపీ కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. 15 జడ్పీటీసీలకుగాను 10 చోట్ల కూటమి విజయం సాధించింది. వైసీపీ ఐదు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీకి ఏడు స్థానాలు వచ్చాయి. జనసేన మరో మూడు చోట్ల గెలుపొందింది. సాలూరు మినహాయిస్తే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల సొంత మండలాల్లోనూ ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది.
సాలూరు మినహా మిగతా ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థుల పరాజయం
పరిషత్ పోరులో ఐదు స్థానాలకే వైసీపీ పరిమితం
15 జడ్పీటీసీ స్థానాల్లో పది కూటమి సొంతం
పార్వతీపురం, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోలుకోలేని అపజయం ఎదురైంది. టీడీపీ కూటమి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. 15 జడ్పీటీసీలకుగాను 10 చోట్ల కూటమి విజయం సాధించింది. వైసీపీ ఐదు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీకి ఏడు స్థానాలు వచ్చాయి. జనసేన మరో మూడు చోట్ల గెలుపొందింది. సాలూరు మినహాయిస్తే.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేల సొంత మండలాల్లోనూ ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది. గతంలో పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజ కవర్గాల్లో జడ్పీటీసీ స్థానాలతో అత్యధిక ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని వైసీపీ ఎంపీపీ స్థానాలను సాధించింది. అయితే ఇప్పుడు సీన్ మారింది. తాజాగా స్థానిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేల సొంత మండలాల్లోనే వైసీపీ పూర్తిగా ఉనికిని కోల్పోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పార్వతీపురం నియోజకవర్గంలో...
పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సొంత మండలం బలిజిపేట మండలంలో జడ్పీటీసీ స్థానంతో పాటు అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కోల్పోయారు. బలిజిపేట మండలంలో కూటమి తరపున జనసేన పార్టీ నుంచి జడ్పీటీసీగా పోటీచేసిన పాలూరు చాందిని విజయం సాధించారు. అదేవిధంగా 17 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 స్థానాలను టీడీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మూడు స్థానాలకు మాత్రమే వైసీసీ పరిమితమైంది.
కురుపాంలో...
కురుపాం నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సొంత మండలం జియ్యమ్మవలసలో వైసీపీ ఓటమి పాలైంది. జియ్యమ్మవలస మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో నిలిచిన దత్తి కామేశ్వరి గెలుపొందారు. ఎంపీటీసీ స్థానాల్లో 10 టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీ గెలుచుకున్నాయి. ఒక స్థానానికి వైసీపీ పరిమితమైంది.
పాలకొండలో...
పాలకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కళావతి సొంత మండలం వీరఘట్టంలో వైసీపీ ఓటమి పాలైంది. ఈ మండలంలో జడ్పీటీసీ స్థానాన్ని జనసేన అభ్యర్థి ఉదయ్ భాస్కర్ కైవసం చేసుఉన్నారు. అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కూడా కూటమి పార్టీలు గెలుచుకున్నాయి. మొత్తంగా 19 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 జనసేన, 3 టీడీపీ సాధించాయి. వైసీపీ కేవలం 3 స్థానాలకు పరిమితమైంది.