Share News

యువతా.. మేలుకో.!

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:50 PM

యువతరం రాజకీయాల్లోకి రావాలి. శాసనకర్తలుగా ఎదగాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి సాదిస్తుంది.

 యువతా.. మేలుకో.!

- నేతల ఉచ్చులో పడితే భవిత అంధకారం

- పోలీసుల రికార్డుల్లోకి ఎక్కితే ఇబ్బందులు

- స్థానిక ఎన్నికల వేళ జాగ్రత్తగా ఉండాలంటున్న మేధావులు

గజపతినగరం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): యువతరం రాజకీయాల్లోకి రావాలి. శాసనకర్తలుగా ఎదగాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి సాదిస్తుంది. ఇది చాలామంది మేధావులు చెప్పినమాట. ఈ మాటలు అక్షరసత్యం. అయినా యువత ఈ వాఖ్యలను అర్థం చేసుకొనే విధానంలోనే తేడా కనిపిస్తుంది. శాసనకర్తలుగా ఎదగాల్సిన యువత రాజకీయపార్టీల పక్షాన వీధి పోరాటాలకే పరిమితమవుతుంది. కొందరు యువకులు నాయకుల వద్ద పని చేస్తూ అల్లర్లలో పాల్గొంటూ తమ కుటుంబాలను నవ్వుల పాలుచేసుకుంటున్నారు. భవిష్యత్‌ను తీర్చి దిద్దుకోవాల్సిన వయసులోనే పోలీసుల రికార్డుల్లోకి ఎక్కుతూ తమ తల్లిదండ్రుల ఆశలను చిదిమేస్తున్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, కనీస అవగాహన ఏర్పరచుకోవాలని మేధావులు సూచిస్తున్నారు. రాజకీయం అంటే ప్రజల కోసం పని చేయడం.. వారికిసేవ చేయడం.. సమస్యల పరిష్కారానికి కృషి చేయడం.. సమసమాజ నిర్మాణానికి పాటు పడడం.. శాసనాల నిర్మాణంలో పాలు పంచుకోవడం. అంతేగానీ ఏదోఒక పార్టీ లేదా నాయకులకు అనుకూలంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడమో, వారు రెచ్చగొడితే విధ్వాంసాలకు దిగడమో నాయకత్వ లక్షణాలు కాదని అభిప్రాయపడుతున్నారు. అసలే ఇది స్థానిక సంస్థల ఎన్నికల సమయం. ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేతలందరి చూపు ఇప్పుడు యువతపైనే ఉంది. నాయకుల అవసరాలకు అనుగుణంగా కాకుండా భవిష్యత్‌లో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని యువత నడుచుకోవాలని పెద్దలు చెబుతున్నారు.

కౌన్సిలింగే ప్రాధాన్యం..

పోలీసులు ట్రబుల్‌ మాంగర్స్‌ (కావాలనే లేదా స్వచ్ఛందంగా గొడవలు సృష్టించేవారు)గా అనుమానం ఉన్నవారి విషయంలో తొలి ప్రాధాన్యం కౌన్సిలింగ్‌కే ఇస్తున్నారు. పట్టణ, గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని గ్రామస్థులను కోరుతున్నారు. సస్పెక్ట్‌ షీట్లు తెరవడంలో సమన్వయంతోనే అడుగులు వేస్తున్నారు. గత ఎన్నికల కేసుల్లో ఉన్న పెద్దవాళ్లకు అవగాహన కల్పించడంతో పాటు చదువుకున్న యువతకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఈమేరకు గ్రామాల వారిగా ఎన్నికలకు ముందే సమావేశాలు నిర్వహించి జరగబోయే పరిణామాలను హెచ్చరిస్తున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 11:50 PM