youth should think big ఉన్నతంగా ఆలోచించాలి
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:18 AM
youth should think big.youth should think big. యువతీయువకులు నిరంతరం ఉన్నతమైన ఆలోచనలతో ముందుకెళ్లాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ సూచించారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ-జీవీ) తొలి స్నాతకోత్సవం విశాఖలోని ఏయూ కన్వెన్షన్ హాలులో శనివారం ఘనంగా జరిగింది.
ఉన్నతంగా ఆలోచించాలి
యువతకు గవర్నర్ అబ్దుల్ నజీర్ దిశానిర్దేశం
విశాఖలో ఘనంగా జేఎన్‌టీయూ-జీవీ తొలి స్నాతకోత్సవం
మయూర్ పట్నాలకు గౌరవ డాక్టరేట్ ప్రదానం
పట్టాలు అందుకున్న 34,896 మంది విద్యార్థులు
11 మందికి పీహెచ్‌డీ, 50 మందికి గోల్డ్ మెడల్స్, ఇద్దరికి ఎండోమెంట్ అవార్డు ప్రదానం
విశాఖపట్నం/విజయనగరం రూరల్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): యువతీయువకులు నిరంతరం ఉన్నతమైన ఆలోచనలతో ముందుకెళ్లాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ సూచించారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-గురజాడ, విజయనగరం (జేఎన్‌టీయూ-జీవీ) తొలి స్నాతకోత్సవం విశాఖలోని ఏయూ కన్వెన్షన్ హాలులో శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి చాన్సలర్ అబ్ధుల్ నజీర్ అధ్యక్షత వహించగా ప్రత్యేక అతిథిగా ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎం.మధుమూర్తి, ముఖ్య అతిథిగా నిర్మాణ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు అండ్ గ్లోబల్ సీఈవో మయూర్ పట్నాల హాజరయ్యారు. మయూర్‌కు వర్సిటీ తొలి గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ సైన్స్)ను గవర్నర్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పట్టాలు అందుకున్న విద్యార్థులను ఉద్దేశించి చాన్సలర్/గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ యువతీయువకులు మెదడును ఉన్నతమైన ఆలోచనలతో, అత్యున్నత ఆదర్శాలతో నింపాలని సూచించారు. అటువంటి వారికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. ముఖ్య అతిథి గౌరవ డాక్టరేట్ గ్రహీత మయూర్ పట్నాల మాట్లాడుతూ అత్యధిక జీతాన్ని ఇచ్చే పనిని కాకుండా ఇష్టమైన పని చేయాలని సూచించారు. ఇష్టమైన పనిని నిజాయితీతో, నిబద్ధతతో, సహనంతో కొనసాగించాలన్నారు. తాను విజయనగరం జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఉన్నత చదువులు పూర్తి చేసినట్లు చెప్పారు. 25 మంది పిల్లలతో ప్రారంభమైన తమ ఉద్యమం దేశంలోని 26 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 60 లక్షల మందికిపైగా జీవితాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. ప్రతిభ అందరిలోనూ సమానంగా ఉంటుందని, అవకాశాలు మాత్రం సమానంగా ఉండవన్నారు. అవకాశాలు కల్పించినప్పుడు సాధారణ మనుషులు కూడా అసాధారణ విజయాలను సాధిస్తారని పేర్కొన్నారు. వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ వీవీ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్జన మొదట కష్టంగా ఉన్నప్పటికీ అది అందించే ఫలితాలు మధురంగా ఉంటాయన్నారు.
ఫ తొలి స్నాతకోత్సవంలో 2023, 2024, 2025 విద్యా సంవత్సరాలకు సంబంధించిన 34,896 మంది (ప్రత్యక్షంగా, పరోక్షంగా) పట్టాలు ప్రదానం చేశారు. అలాగే, 11 మందికి పీహెచ్‌డీ పట్టాలు, మరో 60 మందికి గోల్డ్ మెడల్స్, ఇద్దరికి ఎండోమెంట్ అవార్డులు, మరొకరికి గౌరవ డాక్టరేట్‌ను అందించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, వర్సిటీ ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.
అభిప్రాయాలు..
పీహెచ్‌డీ పట్టా తీసుకోవడం గర్వంగా ఉంది
- డాక్టర్ ఎం.కృష్ణ, పీహెచ్‌డీ గ్రహీత
తొలి స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టా తీసుకోవడం గర్వంగా ఉంది. స్పేస్ ప్రస్తుతం రఘు ఇంజనీరింగ్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేస్తున్నాను. పరిశోధనలో వర్సిటీ ఫ్యాకల్టీ ఎంతగానో సహకారాన్ని అందించారు. ఇక్కడి వాతావరణం కూడా అద్భుతంగా ఉంది. ఇది మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుంది. భవిష్యత్తులో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గా చేరాలన్నది నా లక్ష్యం. ఆ దిశగా వేసే అడుగులు వేసేందుకు పీహెచ్‌డీ పట్టా ప్రోత్సాహకంగా నిలుస్తుంది.
వర్సిటీ నైపుణ్యాలను అందించింది
- గొంతిన దీప్తి, గోల్డ్ మెడల్ విజేత
వర్సిటీలో బీటెక్ (ఈసీఈ) 2024లో పూర్తయింది. గోల్డ్ మెడల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం క్యాప్ జెమినీ బెంగళూరులో డెవాప్స్ ఇంజనీర్‌గా చేస్తున్నాను. వర్సిటీ అనేక అనుభవాలను, మంచి జ్ఞాపకాలను, నైపుణ్యాలను అందించింది. వర్సిటీలో నేర్చుకున్న నైపుణ్యాలే ప్రస్తుతం ఉద్యోగ జీవితంలో మెరుగ్గా రాణించేందుకు దోహదం చేస్తున్నాయి.
జీవితంలో మరిచిపోలేని అనుభూతులు
- కొవ్వాడ బేబీ శ్రీనిజ, గోల్డ్ మెడల్ విజేత
బీటెక్ (ఈఈఈ) 2023లో పూర్తయ్యింది. గోల్డ్ మెడల్ అందుకోవడం ఆనందంగా ఉంది. విశ్వవిద్యాలయం జీవితంలో మరిచిపోలేని అనుభూతులను అందించింది. ప్రస్తుతం బెంగళూరులోని ఒక సంస్థలో పనిచేస్తున్నాను. వర్సిటీలో నేర్చుకున్న అనేక అంశాలు వృత్తి జీవితంలో రాణించేందుకు దోహదం చేస్తున్నాయి. చదువుతున్న రోజుల్లో ఫ్యాకల్టీ అందించిన సహకారం, ప్రోత్సాహంతోనే ఉద్యోగాన్ని సాధించగలిగాను.