Share News

యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:57 PM

యువత కేవలం ఉద్యోగాల వేటలోనే ఉండకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అధికారులు వారిలో చైతన్యం నింపాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

 యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి

- కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం కలెక్టరేట్‌, జనవరి 2(ఆంధ్రజ్యోతి): యువత కేవలం ఉద్యోగాల వేటలోనే ఉండకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అధికారులు వారిలో చైతన్యం నింపాలని కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిబంధల మేరకు అత్యంత వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఏదైనా శాఖ వద్ద అనుమతులు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తిస్తే, పరిశ్రమల శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఆయా శాఖలతో సమన్వయం చేసుకొని పరిష్కరించాలని సూచించారు. జిల్లాకు వచ్చే పారిశ్రామికవేత్తలకు యంత్రాంగం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న 8 ప్రధాన పరిశ్రమలపై సమీక్షించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఇన్‌చార్జి జీఎంఎంవీ కరుణాకర్‌, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ మురళీమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

జిల్లాలో భూ రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ చేసే కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయ్యింది. అన్ని మండలాల్లో తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 423 గ్రామాల్లో 1,25,000 పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనెల 9లోగా పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. అదే విధంగా యునిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే వేగంగా నిర్వహించాలని, ఈనెల 12 లోగా పూర్తిచేయాలని అన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:57 PM