You too can show the way. మీరు సైతం ‘వెలుగు’ చూపొచ్చు
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:33 AM
You too can show the way. మనం చనిపోయినా బతికి ఉంచే ఏకైక మార్గం అవయవదానం. అందులోనూ కళ్లు కీలకం. మరొకరి జీవితానికి వెలుగు చూపే అవకాశం ప్రతి ఒక్కరికీ నేత్రదానం ద్వారా మాత్రమే కలుగుతుంది. జిల్లాలో ఇప్పటికే చాలా మంది నేత్రదానం చేశారు. చైతన్యంతో మరింత మంది ముందుకు వస్తున్నారు. అయితే ఏటా రెడ్‌క్రాస్ ద్వారా కార్నియా సేకరణ జరుగుతున్నప్పటికీ ఇంకా ఎంతో మంది అంధులు కార్నియా లభ్యత కోసం ఎదురుచూస్తున్నారు.
మీరు సైతం
‘వెలుగు’ చూపొచ్చు
నేత్రదానంతో అంధులకు కొత్త జీవితం
జిల్లాలో స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న ప్రజలు
నేటి నుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు
మనం చనిపోయినా బతికి ఉంచే ఏకైక మార్గం అవయవదానం. అందులోనూ కళ్లు కీలకం. మరొకరి జీవితానికి వెలుగు చూపే అవకాశం ప్రతి ఒక్కరికీ నేత్రదానం ద్వారా మాత్రమే కలుగుతుంది. జిల్లాలో ఇప్పటికే చాలా మంది నేత్రదానం చేశారు. చైతన్యంతో మరింత మంది ముందుకు వస్తున్నారు. అయితే ఏటా రెడ్‌క్రాస్ ద్వారా కార్నియా సేకరణ జరుగుతున్నప్పటికీ ఇంకా ఎంతో మంది అంధులు కార్నియా లభ్యత కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా నేత్ర దాన అంగీకార పత్రాలపై సంతకాలు చేసి తమ వంతు సామాజిక బాధ్యత తీసుకోవాలని కంటి వైద్యులు, రెక్‌క్రాస్, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. మంగళవారం నుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో నేత్రదానంపై మరింత చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయా సంస్థలు సంకల్పంబూనాయి.
విజయనగరం రింగురోడ్డు/గజపతినగరం, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి):
ఏటా లక్షల మందికి కళ్లు అవసరం ఉండగా వేలల్లో మాత్రమే కార్నియాల సేకరణ సాధ్యమౌతోంది. కార్నియాకు జబ్బుచేసి కంటి చూపు కోల్పోయిన వారు దేశంలో లక్షకు పైగా వున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇతర కారణాలతోనూ చూపు కోల్పోయిన వారుంటున్నారు. వీరికి కార్నియా మార్పిడి చేస్తే అందమైన లోకాన్ని చూసే అదృష్టం కలుగుతుంది. కొత్త జీవితాన్ని ఆరంభించే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ చేయాల్సిందల్లా మనచుట్టూ వున్న వారిలో ఎవరైనా మరణిస్తే, నేత్రదానం చేయవచ్చునని చెప్పాలి. అందుకే జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను పురస్కరించుకుని ఏటా అంధత్వం లేని సమాజమే లక్ష్యంగా జిల్లా ఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు సమగ్ర అవగాహనకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ ఏడాది కూడా ఆగస్టు 25న ప్రారంభించి సెప్టెంబరు 8 వరకూ కొనసాగించనున్నాయి.
నేత్రదానం చేసిన భారతి
నగరానికి చెందిన పి.భారతి అనారోగ్య సమస్యతో ఈ నెల 11న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విశ్రాంత ఉపాధ్యాయుడైన ఆమె భర్త నరసింహామూర్తి తన భార్య కోరిక మేరకు రెండు కార్నియాలను డాక్టరు ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రికి అప్పగించారు. ఆమె నేత్రాల దానంతో మరో ఇద్దరు అందమైన లోకాన్ని చూడగలగడానికి సాధ్యమైంది.
ఇలా దానం చేయవచ్చు
ఎవరైనా కళ్లను దానం చేయవచ్చు. కళ్లద్దాలు వాడే వారు మధుమేహం, బీపీ వున్న వారు కూడా స్వచ్ఛందంగా నేత్రాలు దానం చేయవచ్చు. చనిపోయిన తర్వాత నాలుగు గంటల నుంచి 6 గంటల లోపు కార్నియాను సేకరించాల్సి వుంటుంది. ఎవరైనా వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన కళ్లను స్వచ్ఛందంగా దానం చేయాలనుకుంటే రెడ్‌క్రాస్ లేదా ఐ బ్యాంకులను సంప్రదించవచ్చు. రెడ్‌క్రాస్‌కు అయితే ఫోన్ నంబర్ 89192 64993, మోషిన్ ఐ బ్యాంకు అయితే 92466 24000, 94408 21919లలో వారిని సంప్రదించండి. వారు వచ్చి కార్నియాను సేకరిస్తారు. జిల్లాలో ఇప్పటివరకు నేత్రాదాన హామీ పత్రం ఇచ్చిన వారు 89 వేల మంది వున్నారు. అలాగే 2,320 కార్నియాలు సేకరించారు. 4,409 మంది నేత్రదానం ద్వారా కంటి చూపును పొందగలిగారు.
పక్షోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించిన కలెక్టర్
ఈనెల 25 నుంచి సెప్టెంబరు 8 వరకూ 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. పక్షోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సోమవారం రాత్రి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. 15 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. జిల్లా వైద్యాధికారి జీవనరాణి, డిసిహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి తదితరులు పాల్గొన్నారు.
అపోహలు వీడాలి
డాక్టరు త్రినాథరావు, జిల్లా అంధత్వ నివారణాధికారి, విజయనగరం
మనిషి మరణించిన తరువాత లోకాన్ని చూసేందుకు నేత్రదానం ఒక్కటే మార్గం. నేత్రదానం చేస్తే ముఖ రూపం దెబ్బ తింటుందన్నది కేవలం అపోహ మాత్రమే. కంటిలోని పైపొర అయిన కార్నియాను మాత్రమే వైద్యులు జాగ్రత్తగా సేకరిస్తారు. ఇటీవల భారతి కుటుంబాలను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరు ముందుకు రావాలి. ఎవరైనా దానంచేయాల్సిన వారు సంబంధిత అధికారులను సంప్రదించాలి. కార్నియాల ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ ద్వారా తిరిగి కంటిచూపును ప్రసాదించవచ్చు.
రెడ్‌క్రాస్ ద్వారా కార్నియాల సేకరణ
కంది వెంకటరమణ, చైర్మన్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, విజయనగరం
ఏటా రెడ్‌క్రాస్ ద్వారా కార్నియా సేకరణ జరుగుతున్నప్పటికీ ఇంకా ఎంతో మంది అంధులు కార్నియా లభ్యత కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా నేత్ర దాన అంగీకార పత్రాలపై సంతకాలు చేసి తమ వంతు సామాజిక బాధ్యత తీసుకోవాలి. కార్నియా దానం చేసేవారు 89192 64993కి సమాచారం అందించాలి.
అవగాహన పెరగాలి
గద్దె చిరంజీవి, అధ్యక్షుడు అఖిలభారత శరీర అవయవదాతల సంఘం ప్రతినిధి, విజయనగరం
నేత్రదానంపై నేటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అనేక అపోహలు వున్నాయి. ఈ నేపథ్యంలో నేత్రదానంపై అవగాహన కల్పిస్తున్నాం. కుటుంబంలో ఎవరైనా మరణించినప్పుడు ఆ బాధలోనూ నేత్రదానానికి ముందుకు రావడం గొప్ప విషయం. సమాజంలో ఈ సంస్కృతి మరింత పెరగాలి. యువత, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములై నేత్ర దాన ప్రతిజ్ఞా పత్రాలు నింపేలా ప్రజలను ప్రోత్సహించినప్పుడే అంధత్వం లేని సమాజం సాకారం అవుతుంది.
---------------