Share News

ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సిందే!

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:32 PM

బ్యాంకులు అంటే ప్రజలకు భద్రత, నమ్మకానికి ప్రతీక. అయితే, ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకులు ఇన్సూరెన్స్‌ పాలసీల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుని ఖాతాదారులపై ఒత్తిడి తెస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

    ఇన్సూరెన్స్‌ తీసుకోవాల్సిందే!

- బలవంతంగా అంటగడుతున్న కొన్ని బ్యాంకులు

- లక్ష్యాల కోసం ఖాతాదారులపై ఒత్తిడి

- లోన్‌, ఎఫ్‌డీలతో పాలసీలు లింక్‌

- ‘మిస్‌-సెల్లింగ్‌’పై ఆర్‌బీఐ కొరడా

- ఇన్సూరెన్స్‌ తప్పనిసరి కాదని స్పష్టం

విజయనగరం రింగురోడ్డు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులు అంటే ప్రజలకు భద్రత, నమ్మకానికి ప్రతీక. అయితే, ఇటీవల కాలంలో కొన్ని బ్యాంకులు ఇన్సూరెన్స్‌ పాలసీల విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుని ఖాతాదారులపై ఒత్తిడి తెస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. రుణాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, కొత్త ఖాతాల పేరుతో అవసరం లేకపోయినా కస్టమర్లకు బీమా పాలసీలు అంటగడుతున్నాయి. ఇలాంటి ‘మిస్‌-సెల్లింగ్‌’ వ్యవహారాలపై రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఖాతాదారుల సమ్మతి లేకుండా తప్పుడు సమాచారం ఇచ్చి ఇన్సూరెన్స్‌ పాలసీలు విక్రయించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. బ్యాంకు సేవలు పొందాలంటే తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ తీసుకోవాలన్న నిబంధన ఎక్కడ లేదని తేల్చి చెప్పింది.


జిల్లాలో 277 పైగా బ్యాంకు శాఖలు

జిల్లాలో వివిధ బ్యాంకులకు సంబంధించి 277 పైగా శాఖలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాంతీయ, గ్రామీణ, సహకార బ్యాంకులు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించాయి. ఇవి లక్షలాది మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకుల సిబ్బంది ఇన్సూరెన్స్‌ పాలసీల విక్రయాలకు అఽధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా రుణాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఇతర బ్యాంకింగ్‌ సేవల పేరుతో బీమా పాలసీలను అంటగట్టే ‘మిస్‌-సెల్లింగ్‌’ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రుణాలు, డిపాజిట్లతో పాటు థర్డ్‌ పార్టీ ఉత్పత్తులు, ఇన్సూరెన్స్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర విక్రయాలకు భారీ లక్ష్యాలు నిర్దేశిస్తున్నట్టు బ్యాంకింగ్‌ వర్గాలే చెబుతున్నాయి. ఈ టార్గెట్‌తో బ్యాంకు సిబ్బంది కస్టమర్లపై మానసిక ఒత్తిడిని తీసుకువస్తూ వారితో పాలసీలు కొనుగోలు చేయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు, పెన్షనర్లు, నిరక్ష్యరాస్యులు, బ్యాంకింగ్‌పై అవగాహన తక్కువగా ఉన్నవారినే బ్యాంకు సిబ్బంది టార్గెట్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎఫ్‌డీ కంటే ఎక్కువ లాభాలు వస్తాయంటూ దీర్ఘకాలిక ప్రీమియం చెల్లించాల్సిన ఇన్సూరెన్స్‌ పాలసీలను వారికి విక్రయిస్తున్నారు. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు ఇన్సూరెన్స్‌ తీసుకుంటేనే లోన్‌ మంజూరు అని చెప్పి బలవంతంగా పాలసీలు కొనుగోలు చేయిస్తున్నారు. పాలసీ కాలపరిమితి, రిస్క్‌లు, సరెండర్‌ నిబంధనలు, ప్రీమియం వివరాలు పూర్తిగా చెప్పకుండా సంతకాలు తీసుకుంటున్నారు. పెట్టుబడిపై హామీ లాభాలు వస్తాయని చెప్పి ఇన్సూరెన్స్‌ని పెట్టుబడి పథకంలా ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.


ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే..

-ఇన్యూరెన్స్‌ పాలసీల కోసం కస్టమర్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకు రాకూడదు.

- బ్యాంకు విక్రయించే ప్రతి ఉత్పత్తి గురించి పూర్తి వివరాలు, చార్జీలు, రిస్క్‌లు స్పష్టంగా తెలియజేయాలి.

-ఖాతాదారుడి స్పష్టమైన సమ్మతి లేకుండా ఎలాంటి ఉత్పత్తిని విక్రయించకూడదు.

- రుణ మంజూరును ఇన్సూరెన్స్‌ లేదా ఇతర థర్డ్‌ పార్టీ ఉత్పత్తులతో ముడిపెట్టకూడదు.

- వినియోగదారుడు తనకు కావల్సిన సేవను స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే హక్కు కలిగి ఉంటాడు.

- ఒత్తిడితో లేదా పూర్తి సమాచారం లేకుండా ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నా, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

- ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం పాలసీ పత్రాలు అందిన తరువాత 15 రోజుల నుంచి 30 రోజుల వరకూ ఉండే ఫ్రీ- లుక్‌ పిరియడ్‌లో పాలసీని రద్దు చేసే హక్కు ఉంటుంది. నిబంధనల ప్రకారం వర్తించే మినహాయింపులు తీసేసి మిగిలిన మొత్తాన్ని సంస్థ తిరిగి చెల్లించాలి.


మోసపోతే, ఏమి చేయాలి?

- ముందుగా సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ మేనేజరు లేదా బ్యాంకు నోడల్‌ అధికారికి రాత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి.

-30 రోజుల్లో పరిష్కారం లభించకపోతే, ఆర్‌బీఐ కంప్లైట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (సీఎంఎస్‌) ద్వారా ఫిర్యాదు చేయవచ్చును.

- అవసరమైతే, టోల్‌ ఫ్రీ నెంబరు 14448 కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చును.

ఖాతాదారుడు గుర్తుంచుకోవలసినవి..

- లోన్‌ తీసుకోవాలంటే ఇన్సూరెన్స్‌ తప్పనిసరి కాదు.

-ఎఫ్‌డీ చేయాలంటే పాలసీ కొనాల్సిన అవసరం లేదు.

-పాలసీ బాండ్‌, ప్రీమియం, నిబంధనలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించాలి.

-సందేహం ఉంటే వెంటే లిఖిత పూర్వక వివరణ కోరాలి.

కస్టమర్స్‌ సమ్మతే ప్రధానం..

బ్యాంకు సేవలు పొందేందుకు ఇన్సూరెన్స్‌ పాలసీలు తీసుకోవడం తప్పనిసరి కాదు. ప్రతి బీమా పాలసీని పూర్తిగా ఖాతాదారుడి స్వచ్ఛంధ నిర్ణయంతో విక్రయించాలి. పాలసీ నిబంధనలు, ప్రీమియం, రిస్క్‌లు, ప్రయోజనాలను పూర్తిగా వివరించిన తరువాతే సమ్మతి తీసుకోవాలి. రుణాలను లేదా ఇతర బ్యాంకింగ్‌ సేవలను ఇన్సూరెన్స్‌ కొనుగోలుతో ముడిపెట్టడం ఆర్‌బీఐ మార్గదర్శకాలకు విరుద్ధం. ఖాతాదారులు ఏ పత్రంపైనా సంతకం చేసేముందు పూర్తిగాచదవాలి. ఏమైనా అభ్యంతరాలు, బలవంతంపు విక్రయాలు ఎదురైతే, వెంటనే సంబంధిత బ్రాంచ్‌ మేనేజరు లేదా బ్యాంకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి. అవసరమైతే, ఆర్‌బీఐ ఫిర్యాదు వ్యవస్థను కూడా వినియోగించుకోవచ్చును.

-రమణమూర్తి, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, విజయనగరం

Updated Date - Jul 03 , 2026 | 11:32 PM