Share News

You have to give extra అదనంగా ఇచ్చుకోవాల్సిందే

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:39 PM

You have to give extra గ్యాస్‌ సరఫరాలో డోర్‌ డెలివరీ పేరిట వసూళ్లు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతోంది. అధికారులకు ఆధారాలతో తెలిసినప్పుడు మందలిస్తున్నారు. ఆ తర్వాత మామూలే. అన్నిచోట్లా రూ.50కు అటుఇటుగా తీసుకుంటున్నారు.

You have to give extra అదనంగా ఇచ్చుకోవాల్సిందే

అదనంగా ఇచ్చుకోవాల్సిందే

గ్యాస్‌ సరఫరాలో డోర్‌ డెలివరీ పేరిట వసూళ్లు

రూ.50 వసూలు చేస్తున్న వైనం

ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌లో అసంతృప్తి వ్యక్తం చేసిన వినియోగదారులు

- విజయనగరం పట్టణంలోని దాసన్నపేట చెందిన ఓ వినియోగదారుడుకి గ్యాస్‌ సరఫరా చేసిన వ్యక్తి సిలిండర్‌ ధర కంటే రూ.40 అదనంగా తీసుకున్నారు. ఎందుకు అని అడిగితే కింది నుంచి పైఫ్లోర్‌లో ఉన్న ఇంట్లోకి తీసుకువచ్చామని బదులిచ్చారు.

- గంట్యాడకు చెందిన ఓ వినియోగదారుడుకి గ్యాస్‌ సరఫరా చేసిన బాయ్‌ సిలిండర్‌ ధర కంటే రూ.50 అదనంగా తీసుకున్నాడు. వినియోగదారుడు ప్రశ్నించగా గ్యాస్‌ను గోదాం నుంచి తీసుకు వచ్చినందుకు రవాణా ఖర్చు రూ.50 తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.

విజయనగరం కలెక్టరేట్‌, జనవరి 13(ఆంధ్రజ్యోతి):

గ్యాస్‌ సరఫరాలో డోర్‌ డెలివరీ పేరిట వసూళ్లు ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలుగా ఈ తంతు జరుగుతోంది. అధికారులకు ఆధారాలతో తెలిసినప్పుడు మందలిస్తున్నారు. ఆ తర్వాత మామూలే. అన్నిచోట్లా రూ.50కు అటుఇటుగా తీసుకుంటున్నారు. వినియోగదారులు ప్రశ్నించినా తగ్గడం లేదు. కొందరు గ్యాస్‌ లేకుంటే ఇబ్బంది కదా అని వారితో వాదనకు స్వస్తి చెప్పి మామూలును వారి చేతిలో పెడుతున్నారు. గ్యాస్‌ సరఫరా చేస్తున్న గోదాం నుంచి వినియోగదారుడి ఇంటి వరకూ మధ్య దూరం ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే సిలిండర్‌ను ఉచితంగా సరఫరా చేయాలని 2019 ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇది క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. ప్రాంతాలను బట్టి, దూరాన్ని బట్టి అదనపు వసూళ్లు ఉంటున్నాయి.

పేదకుటుంబాలకు ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న గ్యాస్‌ సరఫరాపై ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ద్వారా ప్రభుత్వం సమాచారం సేకరించింది. ఇందులో జిల్లాలోని చాలా మంది వినియోగదారులు ఇంటికి గ్యాస్‌ సిలిడర్లు తీసుకువస్తున్న బాయ్స్‌ డోర్‌ డెలివరీ పేరిట అదనంగా డబ్బులు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే ఈ సమస్య చాలా చోట్ల ఉంది. గతంలో గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేసినప్పుడు సిలిండర్‌ ధర ఎంత? గ్యాస్‌ తీసుకువస్తున్న బాయ్స్‌ ఎంత తీసుకుంటున్నారు? అనేది తెలిసేది కాదు. గత ఏడాది మార్చి నుంచి నిరుపేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. గ్యాస్‌ తీసుకుంటున్న వినియోగదారుడు ముందుగా డబ్బులు చెల్లించి సిలిండరు విడిపించుకోవాలి. తరువాత ఆ వినియోగదారుడు బ్యాంకు ఖాతాకు సిలిండరు ఖరీదు డబ్బులను జమ చేస్తుంది. దీంతో సిలిండర్‌ అసలు ధర ఎంత అనేది స్పష్టంగా తెలుస్తోంది. గ్యాస్‌ బాయ్స్‌ ఎంత అదనంగా తీసుకుంటున్నారో ప్రతి వినియోగదారుడుకు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలో ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి సిలిండర్ల ధర మారుతోంది. ఈ నేపథ్యంలో గ్యాస్‌ సరఫరా చేస్తున్న బాయ్స్‌ డోర్‌ డెలివరీ పేరిట అదనపు వసూళ్లు చేయడం వల్ల వినియోగదారుడుపై భారం పడుతోంది.

గ్యాస్‌ సరఫరా చేస్తున్న గిడ్డంగి నుంచి వినియోగదారుడి వరకూ ఐదు కిలోమీటర్ల లోపు ఉంటే సిలిండర్‌ను ఉచితంగా సరఫరా చేయాలని 2019 ఫిబ్రవరి నెలలో ప్రభుత్వం జీవో ఇచ్చింది. అలాగే గోదాం నుంచి వినియోగదారుడి ఇల్లుకు మధ్య 5 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటే డోర్‌ డెలివరీ చార్జీ రూ.20 తీసుకోవాలి. 15 కిలోమీటర్లు దాటితే రూ.30 చార్జీ తీసుకోవాల్సి ఉంది. కానీ ఇంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండగ నేపథ్యంలో గ్యాస్‌ బాయ్స్‌ పండగ మాముళ్లను కూడా వసూలు చేస్తున్నారని తెలిసింది. జిల్లాలో 7 ,00,000 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిల్లో 5,34,000 కనెక్షన్లకు ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తుంది. అదనపు వసూళ్ల గురించి జిల్లా ఇన్‌చార్జి పౌర సరఫరాల అధికారి మురళీధర్‌ వద్ద ప్రస్తావించగా గ్యాస్‌ సరఫరా చేస్తున్న బాయ్స్‌ అదనపు వసూళ్లు చేయకూడదని, అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.

==========

Updated Date - Jan 13 , 2026 | 11:39 PM