Share News

ఆ ఇళ్ల పట్టాలను అమ్ముకోవచ్చు!

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:32 PM

2016 సంవత్సరానికి ముందు ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ అవసరాల నిమిత్తం వాటిని అమ్ముకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

 ఆ ఇళ్ల పట్టాలను అమ్ముకోవచ్చు!
బొబ్బిలిలో ఇందిరమ్మకాలనీ

- 2016కి ముందు ఇచ్చిన వాటికి అవకాశం

- ప్రకటించిన ప్రభుత్వం

- బొబ్బిలిలో ఇప్పటికే చేతులు మారిన పట్టాలు

- మెజారిటీ లబ్ధిదారులు ఎప్పుడో అమ్మేశారు

- ఇదో తరహా వ్యాపారంగా మారిన వైనం

బొబ్బిలి, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): 2016 సంవత్సరానికి ముందు ఇంటి పట్టాలు పొందిన లబ్ధిదారులు తమ అవసరాల నిమిత్తం వాటిని అమ్ముకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. లబ్ధిదారులు తమ పట్టాలు, ఇళ్లను అమ్ముకుని రిజిస్ట్రేషన్‌ చేసే హక్కును కల్పించింది. గిఫ్ట్‌ డీడ్‌గానైనా ఎవరికైనా దఖలు పరుచుకోవచ్చని చెప్పింది. అయితే, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఇలాంటి పట్టాలు ఇప్పటికే చేతులు మారిపోయాయి. మెజారిటీ లబ్ధిదారులు తమ పట్టాలను ఎప్పుడో అమ్మేసుకున్నారు.

ఇదీ పరిస్థితి..

రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మందికి 2016కి ముందు పట్టాలను ప్రభుత్వాలు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో 1989 నుంచి 2024 వరకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు పదివేలకు పైగా ఉంటాయని అంచనా. బొబ్బిలి పట్టణంలో ఎన్టీఆర్‌ హయాంలో తారకరామాకాలనీ, కాంగ్రెస్‌ హయాంలో గెస్ట్‌హౌస్‌, ఇందిరమ్మకాలనీలు, టీడీపీ, వైసీపీ హయాంలో టిడ్కో, జగనన్న కాలనీల పేరుతో వేలాది సంఖ్యలో ఇళ్లపట్టాలు ఇచ్చారు. సుమారు 40 సంవత్సరాల కిందట ఏర్పటైన తారక రామాకాలనీ, గెస్ట్‌హౌస్‌కాలనీలో ఇళ్లు పెద్దఎత్తున చేతులు మారిపోయాయి. ఏ ఇంటికెళ్లినా ఒరిజినల్‌ పట్టాదారు ఎవరో తెలుసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సిందే. వైఎస్‌ హయాంలో మంజూరైన ఇందిరమ్మకాలనీలో సుమారు 2,500 ఇళ్లు ఉన్నాయి. అక్కడ జరుగుతున్న ఇళ్ల వ్యాపారం అంతుచిక్కడం లేదు. అదో పెద్ద పాములపుట్ట మాదిరిగా ఉంది. అన్ని పార్టీలకు చెందిన మధ్యవర్తులు, దళారీలు, బ్రోకర్లు తయారై తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను కబ్జా చేసేసి ఒకొక్కటి రూ.లక్ష నుంచి నాలుగైదు లక్షల వరకు అమ్ముతున్నారు. వాస్తవానికి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రతిఏటా ఎన్నోకొన్ని ఇళ్లను మంజూరు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో పెత్తందారులు బినామీల పేరుతో పట్టాలు పొందడం, వాటిని అమ్ముకోవడం చేస్తున్నారు. అధికారులు, నాయకులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

560కి పైగా ఖాళీ స్థలాలు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మకాలనీలోని ఇళ్ల భాగోతంపై సమగ్ర దర్యాప్తు చేపట్టింది. 560కి పైగా ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రెండేళ్ల వ్యవధిలో అందులో రెండువంతులకు పైగా ఇళ్లస్థలాలు హాంఫట్‌ అయినట్లు పెద్దఎత్తున ఆరోపణలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. హెచ్‌టీ విద్యుత్‌ లైన్ల కింద ఎవరికీ ఇళ్లపట్టాలు ఇవ్వరాదని నిబంధనలు ఉన్నప్పటికీ దళారీలకు అదో వరంలా మారింది. అమాయకులకు అక్కడ ఇళ్లపట్టాలను సృష్టించి వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన జగనన్న లేఅవుట్లలో పట్టాలు, ఇళ్లను పెద్దఎత్తున అమ్మేసుకున్నారు. టిడ్కో కాలనీ సమీపంలో ఉన్న జగనన్న కాలనీ పట్టణానికి దూరంగా ఉండడంతో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవడానికి ముందుకు రాలేదు. స్థలాలను రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు అమ్మేశారు. ఇదంతా అనధికారికంగా జరిగినవే. గత ప్రభుత్వం ఓటీఎస్‌ (వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ స్కీం) పెట్టి రూ. 10వేలు చెల్లిస్తే వారికి తమ ఇళ్లపై పూర్తి హక్కులు కల్పిస్తూ ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయించే వెసులుబాటు కల్పించింది. ఆ తరువాత హక్కులు పొందిన వారు వాటిపై రుణాల కోసం బ్యాంకులకు వెళితే ఏ ఒక్క బ్యాంకు కూడా ఇవ్వలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2016కి ముందు మంజూరైన ఇళ్లకు ఎటువంటి రుసుం చెల్లించకుండానే రిజిస్ట్రేషన్‌ చేయడం లేదా గిఫ్ట్‌డీడ్‌గా ఇచ్చేలా అవకాశం కల్పించింది.

మార్గదర్శకాలు రావాల్సి ఉంది

2016 కి ముందు మంజూరైన ఇళ్లపట్టాలను లబ్ధిదారులు అమ్ముకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనిపై నియోజకవర్గ పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి? అన్నదానిపై కసరత్తు చేస్తున్నాం. పూర్తిస్థాయి మార్గదర్శకాలు రావాల్సిఉంది. 2019-24 మధ్య బొబ్బిలి అర్బన్‌, రూరల్‌ బాడంగి, రామభద్రపురం, తెర్లాం మండలాల్లోని 88 లే అవుట్లలో 5,580 ప్లాట్లను కేటాయించి 3,648 ఇళ్లను మంజూరు చేశారు. వీటిలో 1627 ఇళ్లు పూర్తయ్యాయి. అంతకుమునుపు మంజూరైన ఇళ్ల వివరాలను సేకరిస్తున్నాం.

-రెడ్డి వేణుగోపాలనాయుడు, హౌసింగ్‌ డీఈఈ, బొబ్బిలి

Updated Date - Apr 11 , 2026 | 11:32 PM