దారి తప్పుతున్నార్ సార్!
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:53 PM
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెరలేపిన వారిని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారికి అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే దారి తప్పుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
- అక్రమాలకు పాల్పడుతున్న కొందరు సిబ్బంది
- నిషేధిత ఆటలకు ప్రోత్సాహం
- ఇసుకాసురులతో కుమ్మక్కు
- పోలీసుశాఖ ప్రతిష్ఠను దెబ్బతీసున్న వైనం
- ఈ నెల 29న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు రూ.20 కోట్ల అక్రమాస్తులతో ఏసీబీకి పట్టుబడ్డాడు. విజయనగరం ఏసీబీ కార్యాలయంలో పదేళ్లుగా పనిచేస్తున్న ఆయన జీతం కేవలం రూ.24 లోపు మాత్రమే. కానీ, ఏకంగా రూ.20 కోట్ల అక్రమాస్తులతో పట్టుబడడం సంచలనంగా మారింది. అవినీతి అధికారులకు ఎప్పటికప్పుడు ఏసీబీ దాడుల సమాచారం అందించి వారినుంచి నజరానాలు అందుకున్నట్టు విచారణలో తేలింది.
- కొద్దిరోజుల కిందట గంజాయి ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. గంజాయిని తరలించే ప్రయత్నంలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో పోలీస్ కానిస్టేబుల్ కుమారుడు ఉండడం సంచలనంగా మారింది.
విజయనగరం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తెరలేపిన వారిని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారికి అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే దారి తప్పుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అక్రమార్కులతో చేతులు కలుపుతూ దోచుకుతింటున్నారనే విమర్శలు ఉన్నాయి. పోలీస్‌స్టేషన్లలో దందాలు చేస్తున్నారని, ఫిర్యాదు చేసేందుకు వచ్చినవారిపై సైతం నోరు పారేసుకుంటున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి ఎప్పటి నుంచో ఉన్నా సంబంధిత పోలీస్ ఉన్నతాధికారులు గుర్తించడం లేదా? లేకుంటే నిర్లక్ష్యమా? వైఫల్యమా? లేకుంటే వారికి సైతం ఇందులో భాగం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సిబ్బంది తీరుతో పోలీస్ శాఖ ప్రతిష్ఠ దెబ్బతింటుంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. 14 సర్కిళ్ల పరిధిలో 32 పోలీస్‌స్టేషన్లు కొనసాగుతున్నాయి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్, మహిళా, ట్రాఫిక్ విభాగాలకు సంబంధించి పోలీస్‌స్టేషన్లు కొనసాగుతున్నాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకానున్న నేపథ్యంలో మరికొన్ని పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. సాధారణంగా పోలీసులు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా చూడాలి. అందుకు భిన్నంగా కొందరు పేకాట శిబిరాలు, దాబాల నిర్వాహకుల నుంచి నెలవారి మామ్మూళ్లు తీసుకుని వారిని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పండుగల సమయంలో మామ్మూళ్ల మత్తులో పడి నిషేధిత ఆటలను ప్రోత్సహించిన వారూ ఉన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా చేసే వారితో కుమ్మక్కై లక్షలు దోచుకుంటున్నట్టు కూడా జిల్లా వ్యాప్తంగా ఫిర్యాదులు ఉన్నాయి.
- జిల్లాలో శాఖా పరమైన లోపాలు ఉన్నతాధికారులకు కనిపించడం లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగే కార్యక్రమాలు, ఇతర వ్యవహారాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఉంటుంది. కానీ, బాధితులే నేరుగా జిల్లా కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులకు తెలియని పరిస్థితి జిల్లాలో నెలకొంది. పర్యవేక్షణ లేకపోవడం, అడిగేవారు లేకపోవడంతో కొందరు పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.