Share News

ఏళ్ల నాటి సమస్య.. పరిష్కారమయ్యేనా?

ABN , Publish Date - May 06 , 2026 | 11:40 PM

చింతలబెలగాం డీ పట్టా భూముల విషయంలో కదలిక వచ్చింది. దళితులకు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సీతారాం, డీవీఎంసీ మెంబరు పరిశీలించిన మీదట సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌కు స్పష్టమైన ఆదేశాలు అందాయి.

ఏళ్ల నాటి సమస్య.. పరిష్కారమయ్యేనా?
చింతలబెలగాంలో సాగులో ఉన్న దళితుల భూములు

  • ఆక్రమణదారులపై పీవోటీ యాక్ట్‌ ప్రయోగానికి ఆదేశం

  • విచారణలో అధికారులు

జియ్యమ్మవలస, మే6(ఆంధ్రజ్యోతి): చింతలబెలగాం డీ పట్టా భూముల విషయంలో కదలిక వచ్చింది. దళితులకు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సీతారాం, డీవీఎంసీ మెంబరు పరిశీలించిన మీదట సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌కు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ మేరకు చర్యలు తీసుకునే విధంగా అధికారులు పావులు కదుపుతున్నారు. మరి ఏ మేరకు చర్యలు ఉంటాయోనని దళితులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా ఈ పంచాయతీలో ఉన్న దళితులకు తుమ్మలదత్తివలస రెవెన్యూలో 9 సర్వే నంబర్లలో 5.40 ఎకరాలు, చింతలబెలగాం రెవెన్యూలో 12 సర్వే నంబర్ల పరిధిలో 6.66 ఎకరాలను గతంలో అధికారులు ఇచ్చారు. అయితే ఆ గ్రామంలో ఇతర కులాలకు చెందిన 14 మంది తమ భూమిని ఆక్రమించుకుని దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నారని గత కొన్నాళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్న దళితులకు కొంత ఊరట కలిగింది.


దళితులకు ఇచ్చిన భూముల విషయంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. దళితులకు అసైన్‌మెంట్‌ చేసిన డీపట్టా భూముల్లో ఇతర కులస్థులు ఆక్రమించుకుని సాగు చేసుకుం టున్నట్లుగా తొలుత తహసీల్దార్‌ సమగ్ర విచారణ చేయాల్సి ఉంది. ఆతర్వాత అసైన్డ్‌ ల్యాండ్స్‌ చట్టం 1977 (పీవోటీ యాక్ట్‌ ) ప్రకారం.. సదరు భూముల్లో సాగు చేయకూడదని నోటీసు బోర్డులో పెట్టాలి. ఈ చర్యలపై సబ్‌ కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందించాల్సి ఉంది. అయితే ఆయా భూముల్లో కొన్ని సర్వే నెంబర్లకు రిసంప్సన్‌ ఆర్డర్‌ ఇచ్చి నోటీసు బోర్డులో పెట్టినా ఆక్రమణదారులు సాగు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. చింతలబెలగాం, తుమ్మలవలసలో దళితులకు అసైన్డ్‌ చేసిన డీపట్టా భూముల రికార్డులు తహసీల్దార్‌ కార్యాలయంలో లేకపోవడం గమనార్హం. అవి ఏమైపోయాయో రెవెన్యూశాఖకే తెలియాలి. ఇకపోతే రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో మార్పులు చేసిన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నకిలీ పత్రాలు మంజూరు చేసిన అధికారులపై కూడా చర్యలు లేవని వారు ఆరోపిస్తున్నారు.

Updated Date - May 07 , 2026 | 06:59 AM