Share News

But No Solution? ఏళ్లు గడుస్తున్నా.. పరిష్కరించరా?

ABN , Publish Date - Feb 11 , 2026 | 12:00 AM

Years Pass, But No Solution? జిల్లా కేంద్రం పార్వతీపురం మునిసిపాలిటీ వాసులను దీర్ఘకాలంగా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా తాగునీటి సరఫరా, పారి శుధ్యం, వీధి లైట్ల నిర్వహణ మెరుగుపడకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

 But No Solution? ఏళ్లు గడుస్తున్నా..  పరిష్కరించరా?
ట్యాంకర్‌ వద్ద నీటిని పట్టుకుంటున్న 14వ వార్డు వాసులు

  • ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా.. పార్వతీపురంలో మారని పరిస్థితి

  • మునిసిపాలిటీ వాసులకు తీరని కష్టాలు

పార్వతీపురం టౌన్‌, ఫిబ్రవరి10(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పార్వతీపురం మునిసిపాలిటీ వాసులను దీర్ఘకాలంగా అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా తాగునీటి సరఫరా, పారి శుధ్యం, వీధి లైట్ల నిర్వహణ మెరుగుపడకపోవడంతో వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభు త్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నా.. మునిసిపాలిటీలో పరిస్థితి మాత్రం మారడం లేదు. మొత్తంగా 30 వార్డుల్లో ప్రజల కష్టాలు తీరడం లేదు. అధికారులు, పాలకవర్గ సభ్యుల నిర్లక్ష్యం.. వారికి శాపంగా మారింది.

ఇదీ పరిస్థితి..

పార్వతీపురం మునిసిపాలిటీ ఏర్పడి సుమారు 65ఏళ్లు పూర్తయింది. గ్రేడ్‌-1 మునిసి పాలిటీగా ఏర్పడి 24 ఏళ్లవుతుంది. జిల్లా కేంద్రంగా అప్‌గ్రేడ్‌ నాలుగేళ్లు కావస్తున్నా.. పట్టణంలో తాగునీటి సరఫరా సమస్య పరిష్కారం కావడం లేదు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో గరుగుబిల్లి మండలం తోటపల్లి సమీపంలోని నాగావళి నది నుంచి పార్వతీపురం వాసులకు తాగునీటిని అందించాలని సంకల్పించారు. ఈ మేరకు 1960లో తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. అయితే నాటి నుంచి నేటి వరకు పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా అనేది పట్టణ ప్రజలకు కలగానే మిగిలింది. కాలం చెల్లిన తాగునీటి పైప్‌లైన్‌, ఎక్కడ పడితే అక్కడ లీకులు అవుతుండడంతో 30 వార్డుల ప్రజలు అన్నికాలాల్లోనూ నీటి కోసం అల్లాడిపోవాల్సి వస్తోంది. వేసవి కాలంలో ఐదు రోజుల నుంచి వారానికొకసారి మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇక వర్షా కాలం నుంచి శీతాకాలం వరకు బురద నీరు మాత్రమే కుళాయిల నుంచి వస్తుండడంతో మునిసిపాలీటీ వాసులు తరచూ రోగాల బారిన పడుతున్నారు. ఏటా తాగునీటి సరఫరా కోసం రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలక వరకు వెచ్చిస్తున్నట్లు అధికారులు చెబుతున్నా.. ప్రయోజనం మాత్రం ఉండడం లేదు. ఇప్పటికీ జిల్లా కేంద్రంలోని వైకేఎం, సౌందర్య ఽథియేటర్‌ రోడ్డువీధి, జనశక్తి కాలనీ, తదితర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

పారిశుధ్య లోపం

పార్వతీపురం పట్టణ జనాభా 80 వేలు దాటిపోయిందనేది వాస్తవం. అయితే ఆ స్థాయిలో పారిశుధ్య కార్మికులను నియమించలేదు. శాశ్వత, కాంట్రాక్ట్‌ పారిశుధ్య కార్మికులు 130 మంది మాత్రమే ఉండడంతో దీంతో మునిసిపాలిటీలో పారిశుధ్యం నిర్వహణ కష్టతరంగా మారింది. పట్టణ వీధులతో పాటు ప్రధాన రహదారుల్లో ఎక్కడికక్కడే చెత్తచెదారం దర్శనమిస్తుండగా.. కాలువల్లో మురగునీరు రోడ్లపై ప్రవహిస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక వర్షాకాలంలో వారి బాధలు రెట్టింపవుతున్నాయి.

వీధిలైట్ల నిర్వహణ ఇలా..

పట్టణంలో సెంటర్‌ లైటింగ్‌తో పాటు వీధిలైట్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించారు. అయితే మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడిది. దీంతో సెంటర్‌ లైటింగ్‌, వీధి దీపాల నిర్వహణ అధ్వానంగా మారింది. అవి అప్పుడు వెలుగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. సెంటర్‌ లైటింగ్‌, వీధి దీపాల నిర్వహణ చేపడుతున్న ప్రైవేట్‌ సంస్థకు రెండేళ్లుగా మునిసిపాలిటీ ఎటువంటి చెల్లింపులు చేయడం లేదు. సుమారు రూ.20 లక్షల వరకు బకాయి పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా లైటింగ్‌ నిర్వహణ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించక పోవడంతో ప్రధాన రహదారితో పాటు పలు వీధులు అంధకారంలో చిక్కు కున్నాయి. దీనిపై పార్వతీపురం మునిసిపల్‌ కమిషనర్‌ డి.పావనీని వివరణ కోరగా.. ‘ పట్టణంలో నెలకొన్న మూడు మూడు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాం. త్వరలోనే పరిష్కార మార్గాన్ని చూపుతాం.’ అని తెలిపారు.

నాలుగైదు రోజులకొకసారే..

జిల్లాకేంద్రంలో ప్రస్తుతం నాలుగైదు రోజులకొకసారి మాత్రమే కుళాయిల ద్వారా తాగునీటి సరఫరా అవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. శివారు కాలనీవాసుల పరిస్థితి సరేసరి. ఏళ్లు గడుస్తున్నా.. ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. తాగునీటి సరఫరాపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

- పి. సత్యనారాయణ, సౌందర్య థియేటర్‌ వీధి, పార్వతీపురం

===========================

చెత్త తరలింపులో జాప్యం

పార్వతీపురంలో పారిశుధ్య నిర్వహణ రోజురోజుకూ అధ్వానంగా మారుతుంది. వీధుల్లో చెత్తలు, వ్యర్థాలు తరలించడంలో జాప్యం జరుగుతుంది. కాలువల్లో పూడికలు కూడా తీయడం లేదు. దుర్వాసన భరించలేకపోతుఆన్నం. వీధి లైట్ల నిర్వహణ కూడా అధ్వానంగా మారింది.

- జీవీ రమణ, బొగ్గులవీధి, పార్వతీపురం

Updated Date - Feb 11 , 2026 | 12:00 AM