Share News

YCP Turmoil వైసీపీ అలజడి

ABN , Publish Date - Aug 10 , 2026 | 11:34 PM

YCP Turmoil జిల్లాలో వైసీపీ దూకుడు కొనసాగుతూనే ఉంది. పోలీస్‌ శాఖ ఆదేశాలు, ఉత్తర్వులను సైతం పాటించడం లేదు. జిల్లాలో పోలీస్‌ చట్టం-1861లోని సెక్షన్‌ 30 అమల్లో ఉంది. ఆ ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో చేయాలనుకుంటే తప్పనిసరిగా పోలీస్‌ శాఖ అనుమతులు తీసుకోవాలి.

YCP Turmoil వైసీపీ అలజడి
: విజయనగరంలో ర్యాలీలో వైసీపీ నాయకులు

వైసీపీ అలజడి

సెక్షన్‌ 30 అమల్లో ఉన్నా లెక్కచేయని వైనం

డీఎస్సీ 2025లో అక్రమాలంటూ విషం

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు

కొనసాగిన అరెస్టులు

విజయనగరం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో వైసీపీ దూకుడు కొనసాగుతూనే ఉంది. పోలీస్‌ శాఖ ఆదేశాలు, ఉత్తర్వులను సైతం పాటించడం లేదు. జిల్లాలో పోలీస్‌ చట్టం-1861లోని సెక్షన్‌ 30 అమల్లో ఉంది. ఆ ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదు. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో చేయాలనుకుంటే తప్పనిసరిగా పోలీస్‌ శాఖ అనుమతులు తీసుకోవాలి. శాంతిభద్రతల పరిరక్షణ కోసమే సెక్షన్‌ 30ను జిల్లాలో అమలు చేశారు. కానీ వైసీపీ నేతలు బేఖాతరు చేస్తున్నారు. డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయంటూ కొద్దిరోజులుగా వైసీపీ హంగామా చేస్తోంది. అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆందోళన కార్యక్రమాలు జరుపుతోంది. అటువంటిదేమీ లేదని ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు అనుమానాలను నివృత్తి చేసి వివరణ ఇచ్చారు. ఆధారాలు లేకుండా కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. మరోవైపు నిరుద్యోగ యువత కూడా వైసీపీ ఆందోళనను పట్టించుకోలేదు. అయినా సరే రాజకీయ అలజడి రేపేందుకు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ సోమవారం ఆందోళన చేసింది. పోలీసులు మాత్రం సెక్షన్‌ 30 ఉల్లంఘన కింద కేసులు నమోదుచేసి అరెస్టులను కొనసాగించారు.

ఫ చీపురుపల్లిలో మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ, గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, విజయనగరంలో శాసన సభ మాజీ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎస్‌.కోటలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, బొబ్బిలిలో మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, రాజాంలో నియోజకవర్గ సమన్వయ కర్త తలే రాజేష్‌ ఆద్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. అనేక చోట్ల వైసీపీ నిరసన ర్యాలీలను పోలీసులు నిలువరించారు. అతిచేసిన వైసీపీ నేతల తీరును గమనించి వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 11:34 PM