'Wrong' steps ‘తప్పు’టడుగులు
ABN , Publish Date - May 19 , 2026 | 12:02 AM
'Wrong' steps రాజాంకు చెందిన ఓ బాలుడు చెడు మార్గంలో వెళ్లొద్దని చెప్పిన తల్లిని ఏకంగా హతమార్చాడు. కుమారుడు పక్కదారి పడుతుండడాన్ని గమనించిన ఆమె మార్పు కోసం పరితపించింది. తప్పు నాన్న అని సుతిమెత్తగా మందలించింది. ఆ మాట గిట్టని కొడుకు మరో బాలుడితో కలిసి తల్లిని దారుణంగా హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో పరారయ్యాడు.
‘తప్పు’టడుగులు
బాలల్లో పెరుగుతున్న నేర స్వభావం
క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలు
స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం
తల్లిదండ్రులు మేల్కొనాలంటున్న మానసిక వేత్తలు
రాజాంకు చెందిన ఓ బాలుడు చెడు మార్గంలో వెళ్లొద్దని చెప్పిన తల్లిని ఏకంగా హతమార్చాడు. కుమారుడు పక్కదారి పడుతుండడాన్ని గమనించిన ఆమె మార్పు కోసం పరితపించింది. తప్పు నాన్న అని సుతిమెత్తగా మందలించింది. ఆ మాట గిట్టని కొడుకు మరో బాలుడితో కలిసి తల్లిని దారుణంగా హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగదుతో పరారయ్యాడు.
తెర్లాంకు చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని తల్లిదండ్రులు సెల్‌ఫోన్ ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆన్‌లైన్ తరగతుల పేరుతో సెల్‌ఫోన్ ఇవ్వాలని కోరింది. చదువుకు ఇబ్బంది కలుగుతుందని భావించిన తల్లిదండ్రులు ఫోన్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. అంతలోనే ఆ బాలిక క్షణికావేశంతో తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
రాజాం, మే 18(ఆంధ్రజ్యోతి):
బాలలు, టీనేజర్లలో నేర స్వభావంతో పాటు సున్నిత మనస్తత్వం పెరుగుతోంది. ఏ విషయానికి ఎంత స్పందించాలో తెలియడం లేదు. ప్రతి చిన్న విషయానికీ అతిగా స్పందించడం.. లేకుంటే చలనం లేకుండా ఉండిపోవడం చాలా మంది పిల్లల్లో గుర్తిస్తున్నట్లు మానసిక వేత్తలు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబాలు చీలిపోవడం.. పిల్లలతో గడిపేందుకు తల్లిదండ్రులు సమయం కేటాయించకపోవడం.. పెద్దల సలహాలు తీసుకునే పరిస్థితి లేకపోవడం.. మితిమీరిన సోషల్ మీడియా వాడకంతో పిల్లలు గాడి తప్పుతున్నారు. ఏకంగా హత్యలు, అఘాయిత్యాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
రాజాంలో ఇటీవల చోటుచేసుకున్న ఓ ఘటన రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. తప్పుదారి పడుతున్న కుమారుడ్ని గాడిలో పెట్టాలనుకోవడం ఓ తల్లి తప్పయ్యింది. మంచి చెప్పిన తల్లిని అడ్డు తొలగించుకోవాలన్న దురాలోచనకు రావడం అందరినీ నిర్ఘాంతపరిచింది. బాల్యంలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వారిలో విష బీజాలు నాటుకుంటున్నాయని తెలిసి మిగతా తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన బాలలు, భవిష్యత్‌కు బంగారుబాటలు వేసుకోవాల్సిన టీనేజర్లు నేరాల రొంపిలో దిగుతుండడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. స్మార్ట్‌ఫోన్, సోషల్‌మీడియా వినియోగం పెరగడం, గంటల తరబడి అందులో లీనం కావడంతో ఫోన్‌కు బానిసలుగా మారిపోతున్నారు. బాలల్లో విపరీత ఆలోచనలు, పెడపోకడలకు ఇదే కారణమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ తరగతుల పేరుతో..
ఆన్‌లైన్ తరగతుల పేరుతో చిన్నారులు రోజుకు ఐదు గంటల వరకు మునిగి తేలుతున్నారని వివిధ అధ్యయనాలు తేల్చాయి. 15-16 సంవత్సరాల వారు ఎక్కువగా ఇంటర్నెట్‌కు బానిసలవుతున్నట్టు ఎయిమ్స్ అధ్యయనంలో తేలింది. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వంటి వాటిలో సోషల్ మీడియాకు బానిసలైన చిన్నారుల్లో 70 శాతం మంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. పిల్లల్లో పెరుగుతున్న దూకుడు స్వభావం, మానసిక రుగ్మతలు వారిని హింసాత్మక ఘటనలకు పురిగొల్పుతున్నాయి. నేరస్థులుగా మార్చేస్తున్నాయి. గడిచిన పదేళ్లలో దేశవ్యాప్తంగా టీనేజర్లు, బాలురుపై 5 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
తల్లిదండ్రులదే బాధ్యత..
పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సింది తల్లిదండ్రులే. అఘాయిత్యాలకు పాల్పడుతున్న పిల్లల దృక్పథాన్ని మార్చగల శక్తి ఒక్క తల్లిదండ్రులకే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఇతర ఎలక్ర్టానిక్ వస్తువులను ఇంట్లో హద్దుకు మించి వాడకుండా కట్టడి చేయాలి. ఒకవేళ ఆన్‌లైన్‌లో బోధన పేరుతో స్మార్ట్‌ఫోన్ ఇచ్చినా వారిని గమనిస్తుండాలి. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయాలి. హింసాత్మక ఘటనలు చూడకుండా.. ఆన్‌లైన్ గేమ్స్ ఆడకుండా స్మార్ట్‌ఫోన్లలో పూర్తిగా సెట్టింగ్స్ మార్చితే చాలా మంచిది. వాటిని అధికంగా వినియోగించడం వల్ల కలిగే అనర్థాలను పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు టీవీలు, ఫోన్లకు అతుక్కుపోకూడదదని మానసిక వేత్తలు చెబుతున్నారు. ఖాళీ సమయాల్లో వారికి నీతి కథలు చెప్పాలని, పుస్తకాలు చదివించాలని, తోటి స్నేహితులతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.
బాల్యం కీలకం
జీవితంలో బాల్యం అత్యంత కీలకం. మొత్తం జీవితంపైనే ప్రభావం చూపుతుంది. అందుకే పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు, తరగతి గదిలో ఉపాధ్యాయుడు చాలా బాధ్యతతో వ్యవహరించాలి. సోషల్ మీడియా వచ్చాక సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. అందుకే ఫోన్లను వినియోగించే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి నడవడికపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలి. ప్రాథమిక స్థాయి నుంచే నీతికథలు నేర్పిస్తే చాలా మంచింది.
కరణం హరిబాబు, మానసిక వైద్య నిపుణుడు, రాజాం
----------------------