Share News

ఆక్రమిస్తామంటే వద్దంటామా?

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:30 AM

జిల్లాలో అక్కడా..ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతి మండలంలోనూ ఆక్రమణలు వెలుగుచూస్తున్నాయి.

ఆక్రమిస్తామంటే వద్దంటామా?
చీపురుపల్లి మండలం కర్లాం రెవెన్యూ

- మాకు మాత్రం ‘రెవెన్యూ’ ఉండాలి

- సహకరిస్తున్న కొందరు అధికారులు

- వీఆర్వోలు, సర్వేయర్లు కీలకపాత్ర

- ప్రతి పనికీ ఒక రేటు

- జిల్లాలో పెరుగుతున్న భూ కబ్జాలు

- డెంకాడ మండలం మోపాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 203-1లో 5.85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అదే ప్రాంతంలో సుమారు 60 ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ వేశారు. దీంతో ఆ ప్రభుత్వ భూమిలో కొంత మొత్తాన్ని కలిపేసుకొని ప్లాట్లు వేశారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సాయంతో కాలువకు అడ్డంగా పైపులేసి లేఅవుట్‌కు వెళ్లేందుకు రోడ్డు కూడా వేసేశారని అంటున్నారు. దీనికోసం లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

- చీపురుపల్లి మండలం కర్లాం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 408లో 87 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో కొంత భూమిని విశాఖ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆక్రమించేసి ఏకంగా ఫామ్‌ హౌస్‌తో పాటు షెడ్‌ నిర్మాణం చేపట్టాడు. అక్కడితే ఆగకుండా ప్రహరీ నిర్మించేశాడు. అవతలి వైపు ఉన్న పొలాలకు రైతులు వెళ్లకుండా నిర్బంధించేశాడు. ఇదంతా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లో జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

- గరివిడి మండలంలో ఇటీవల భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వెదుళ్లవలస, బాగువలస గ్రామంలో వైసీపీ మాజీ సర్పంచ్‌ తమ్మినాయుడు ఏకంగా 24.09 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు స్కెచ్‌ వేశాడు. రెవెన్యూ అధికారుల సాయంతో కొత్త ఖాతాలు సృష్టించి మరీ తన కుటుంబ సభ్యుల పేరుతో రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

విజయనగరం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అక్కడా..ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతి మండలంలోనూ ఆక్రమణలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలు, కాలువలు ఇలా ప్రతిదీ కబ్జాకు గురవుతున్నాయి. ఆక్రమణదారులకు కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికీ ఒక రేటు పెట్టి వసూలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. లంచం ఇస్తే అది ప్రభుత్వ భూమా?.. ఇతరుల స్థలమా అని ఆలోచించకుండా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో కొంతమంది వీఆర్వోలు, సర్వేయర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వసూలు చేసిన సొమ్మును కింది స్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకూ వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

భోగాపురం ఎయిర్‌పోర్టుతో..

జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన తరువాత నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వెలిశాయి. భోగాపురం విమానాశ్రయానికి కూతవేటు దూరంలో వెంచర్లు ఉన్నాయంటూ వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. అయితే, చాలా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో కనీస నిబంధనలు పాటించడం లేదు. వ్యవసాయ భూములను సైతం ప్లాట్లుగా విభజించి విక్రయించేస్తున్నారు. మరికొన్నిచోట్ల చెరువులు, కాలువలను కబ్జా చేస్తున్నారు. కాలువలను కప్పేసి రహదారులు నిర్మించి వెంచర్లకు దారి చూపుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రెవెన్యూ శాఖ అధికారులది కీలక పాత్ర అనే ఆరోపణలు ఉన్నాయి.

సిబ్బంది లీలలు..

సాధారణంగా వెబ్‌ల్యాండ్‌ లాగిన్‌ కీ తహసీల్దార్ల ఆధీనంలో ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో భూముల రికార్డుల్లో మార్పులు, చేర్పుల్లో కొంతమంది వీఆర్వోలు, సర్వేయర్లే కీలక పాత్ర పోషిస్తూ అక్రమాల పర్వానికి తెరలేపుతున్నారు. తహసీల్దార్లకు వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధించి క్షేత్రస్థాయిలో విచారణకు వీఆర్వోలు, సర్వేయర్లను పంపుతుంటారు. ఈక్రమంలో దరఖాస్తుదారులు, ఫిర్యాదుదారులతో వారు బేరాలు కుదుర్చుకుంటున్నారు. లంచంగా అందుకున్న సొమ్మును ఉన్నతాధికారులకు సైతం పంపించి ఎంచక్కా పనులు కానిచ్చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని భూములకు సంబంధించి రెండువర్గాల మధ్య సమస్యలుంటే వీఆర్వోలు, సర్వేయర్లు జోక్యం చేసుకుంటున్నారు. అవి ప్రభుత్వ భూములైతే దగ్గరుండి తెరవెనుక ఫిర్యాదులకు పురమాయిస్తుంటారు. ఈ క్రమంలో ఆక్రమణదారుడి నుంచి భారీగా డబ్బును రాబడుతుంటారు. వీరే ఫిర్యాదుదారుడికి సెటిల్‌ చేయించి అందులో కొంత మొత్తాన్ని నొక్కేస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jun 13 , 2026 | 12:30 AM