Works Stalled పనులు సాగవు.. అందుబాటులోకిరావు!
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:26 AM
Works Stalled, Facilities Remain Out of Reach! జిల్లాలో మల్టీ పర్పస్ ఫెసిలిటి సెంటర్ల (ఎంపీఎఫ్‌సీ) పనులు ముందుకు సాగడం లేదు. పలు కారణాలతో ఐదు చోట్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇంకా ఐదు చోట్ల కదలని పనులు
నిర్మాణాలు పూర్తయిన వాటిల్లో కొన్ని వినియోగానికి నోచని వైనం
గోడౌన్ల కోసం ఆశతో ఎదురుచూస్తున్న రైతులు
చొరవచూపని అధికారులు
జియ్యమ్మవలస, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మల్టీ పర్పస్ ఫెసిలిటి సెంటర్ల (ఎంపీఎఫ్‌సీ) పనులు ముందుకు సాగడం లేదు. పలు కారణాలతో ఐదు చోట్ల నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది రూపాయలతో నిర్మించే ఈ గోడౌన్లు అందుబాటులోకి వస్తే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదు.
ఇదీ పరిస్థితి..
-జిల్లాలోని 15 మండలాల్లో 42 పీఏసీఎస్‌లు ఉన్నాయి. వాటి పరిధిలో 49,118 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. వారిలో 40,562 మంది రైతులు ఇప్పటికే కేవైసీ చేయించుకున్నారు. అయితే రెండు పీఏసీఎస్‌ల పరిధిలో ఒక మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ (ఎంపీఎఫ్‌సీ)లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు 2023లో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.40 లక్షల చొప్పున మొత్తంగా 21 ఎంపీఎఫ్‌సీలు మంజూరయ్యాయి. కాగా భామిని మండలం బత్తిలి సమీపంలో నులకజోడు వద్ద నిర్మించిన ఎంపీఎఫ్‌సీకి మాత్రం రూ. 75 లక్షలు మంజూరయ్యాయి.
- బలిజిపేట, సీతానగరం, భామిని, పాలకొండ, పార్వతీపురం , వీరఘట్టం, మక్కువ , గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల్లో వాటి నిర్మాణ బాధ్యతలను అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించారు. అయితే ఇప్పటివరకు 15 ఎంపీఎఫ్‌సీ భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటిని పీఏసీఎస్‌లకు అప్పగించారు. అయితే వాటిల్లో ఆరు గోడౌన్లు ఇంకా వినియోగంలోకి రాలేదు.రహదారి సౌకర్యం లేకపోవడం, పీఏసీఎస్‌లకు దూరంగా అవి ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా పలు మండలాల్లో బేస్‌మెంట్ లెవెల్‌లో , సూపర్ స్ట్రక్చర్ దశల్లోనే మరికొన్ని ఎంపీఎఫ్‌సీలు ఉన్నాయి. గ్రామస్థుల అభ్యంతరం తెలపడంతో సీతానగరం మండలం బగ్గందొరవలస వద్ద ఎంపీఎఫ్‌సీ నిర్మాణం ప్రారంభం కాలేదు.
-మొత్తంగా జిల్లాలో ఐదు చోట్ల నిర్మాణాలు నిలిచిపోవడానికి కాంట్రాక్టర్లు, సబ్ కాంట్రాక్టర్లకు మధ్య విభేదాలు, వ్యవసాయ మార్కెటింగ్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.
ఇవీ ప్రయోజనాలు
పీఏసీఎస్‌లలో సభ్యులుగా ఉన్న వారే కాదు.. ఏ రైతులైనా తమ పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేంతవరకు ఈ ఎంపీఎఫ్‌సీలలో నిల్వ ఉంచుకోవచ్చు. ఒకవేళ తడిసిపోయినా పక్కనే ఉన్న ప్లాట్‌ఫారంపై పంటను ఆరబెట్టుకొని .. తిరిగి ఎంపీఎఫ్‌సీలలో నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఎంపీఎఫ్‌సీ గోడౌన్లు లీజుకు గాని, అద్దెకు గాని ప్రభుత్వం ఇస్తోంది. అయితే నిబంధనల ప్రకారం కొంత మొత్తం చెల్లించి.. పీఏసీఎస్ సీఈవోను సంప్రదించాల్సి ఉంది.
నిర్మాణాల పూర్తికి చర్యలు
జిల్లాలో ఐదు చోట్ల నిర్మాణాలు ప్రారంభమై ఆగిపోవడం వాస్తవమే. దీనిపై వ్యవసాయ మార్కెటింగ్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడతాను. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాను.
- వాణిశైలజ, డీసీవో, జిల్లా కోఆపరేటివ్ సొసైటీ, పార్వతీపురం మన్యం