Available Funds నిధులున్నా.. సాగని పనులు
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:19 AM
Works Stalled Despite Available Funds సీతంపేట ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం ముందుకు సాగడం లేదు. నిధులున్నా.. వివిధ కారణాలతో పనులు ప్రారంభం కావడం లేదు. దీంతో గిరిపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధి హామీ పథకంలో మంజూరు..
ఈ నెలాఖరుతో ఎన్‌ఆర్‌ఈజీఎస్ రద్దు
వచ్చేనెల నుంచి కొత్త చట్టం(వీబీజీ రామ్‌జీ) అమలు..
బిల్లుల చెల్లింపుల్లో కొరవడిన స్పష్టత.. సమీపిస్తున్న గడువు
ముందుకురాని కాంట్రాక్టర్లు
గిరిపుత్రులకు తప్పని ఇబ్బందులు
సీతంపేట రూరల్, మార్చి18(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణం ముందుకు సాగడం లేదు. నిధులున్నా.. వివిధ కారణాలతో పనులు ప్రారంభం కావడం లేదు. దీంతో గిరిపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్త వంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్(నేషన్‌ల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం)పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరుతో రద్దు చేయనుంది. దాని స్థానంలో వీబీజీ రామ్‌జీ చట్టం అమలులోకి రానుండగా.. బిల్లుల చెల్లింపుపై స్పష్టత కొరవడింది. దీంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. మొత్తంగా ఏజెన్సీలో ఇంతవరకు ప్రారంభంకాని రహదారుల నిర్మాణాలపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇదీ పరిస్థితి..
- ఉపాధిహామీ పథకం కింద ఈఏడాది జనవరిలో సీతంపేట మన్యానికి ఐదు రహదారులను మంజూరు చేశారు. అయితే ఇప్పటికే రూ.60లక్షలతో నౌగూడ -చింతమానుగూడ వరకు 600 మీటర్ల బీటీ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా రూ.1.10కోట్లతో చిన్నబగ్గ జంక్షన్ నుంచి వయా బొండి మీదుగా సంకిలిగూడ వరకు 1.5కిలోమీటర్ల పొడవున నాలుగు రీచ్‌ల బీటీ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు.
- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాసుగుమ్మడ -అంబలిగండి రహదారి పనులు చేపట్టినా.. రోడ్డుపై వెట్‌మిక్స్ వేసి బిల్లులు స్వాహా చేశారనే అభియోగాలపై విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దీనిపై ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. అయితే అదే రహదారి నిర్మాణానికి గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ శాఖాధికారులు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు. ఐదు కిలోమీటర్ల రహదారిని ఆరు రీచ్‌లుగా విడదీసి బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.40కోట్లను మంజూరు చేసింది.
- కోడిశ నుంచి వజ్జాయిగూడ గ్రామం వరకు ఉన్న 3.2కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి రూ.2కోట్లు, పాతపనుకువలస నుంచి గాంధీగూడ మీదుగా బొంగుడుగూడ వరకు 1.5కిలోమీటర్లకు గాను రెండు రీచ్‌లకు కలిపి రూ.80లక్షలు మంజూరయ్యాయి. అయితే కొత్తగా మంజూరైన ఐదు రహదారుల్లో ఇంకా మూడు రహదారుల నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. దీంతో వాటి నిర్మాణాలపై సందిగ్ధత నెలకొంది.
ఆసక్తి చూపని కాంట్రాక్టర్లు..
ఎన్‌ఆర్‌ఈజీఎస్ మెటీరియల్ కాంపొనెంట్ కింద నిర్మిస్తున్న రహదారులకు సంబంధించిన బిల్లులను ఈనెల 15లోగా అప్‌లోడ్ చేయాల్సి ఉంది. దీంతో గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనులకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 90శాతం నిధులను సమకూర్చగా రాష్ట్ర ప్రభుత్వం 10శాతం వాటా నిధులు మాత్రమే భరించేది. అయితే వచ్చేనెల నుంచి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న వీబీజీ రామ్‌జీ చట్టం ద్వారా 60శాతం వాటా మాత్రమే చెల్లించనుంది. మిగిలిన 40శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. కాగా కొత్త చట్టంలో కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలు, విధి విధానాలపై సంబంధిత శాఖాధికారులకు స్పష్టం లేకపోవడంతో పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా గత ఏడాది ఉపాధిహామీ పథకం మెటీరియల్ కాంపొనెంట్ కింద నిర్మించిన బీటీ, సీసీ రహదారులు, డ్రైనేజీలకు సంబంధించిన బిల్లులు చెల్లింపులు కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం రద్దు, రహదారుల పనులు పూర్తికి సమయం లేకపోవడం, బీటీ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన జీఎస్‌బీ, వెట్‌మిక్స్, తారు వంటి ముడిసరుకులకు ఈనెలలో అమాంతం డిమాండ్ పెరిగిపోవడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.
పనులు చేపట్టాలని వినతి..
మండలంలో నూతనంగా మంజూరైన దాసుగుమ్మడ-అంబలిగండి, పాతపనుకువలస - బొంగుడుగూడ, కోడిశ-వజ్జాయిగూడ రహదారుల నిర్మాణాలు చేపట్టాలని ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు కోరుతున్నారు. తమ గ్రామాలకు సరైన రహదారి లేక ఎన్నో ఏళ్లుగా తాము అవస్థలు పడుతున్నామని బొంగుడుగూడ గ్రామానికి చెందిన సవరప్రసాద్, రవికుమార్, అర్జున్, బాలరాజు, రాజేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్ శాఖ డీఈఈకి ఇటీవల వినతిపత్రం ఇచ్చారు.
డీఈ ఏమన్నారంటే..
‘సీతంపేట మండలంలో ఈఏడాది జనవరిలో కొత్తగా మంజూరైన మంజూరైన ఐదు రహదా రులకు గాను రెండు రోడ్లు పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన మూడు రోడ్ల పనులు పూర్తిచేసేందుకు సమయం లేని కారణంగా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. అయినప్పటికీ వాటి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.’ గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ డీఈఈ నాగభూషణం తెలిపారు.