How Will Water Be Supplied? పనులు పూర్తికాలే.. నీరెలా ఇస్తారు?
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:05 AM
Works Remain Incomplete – How Will Water Be Supplied? జంఝావతి ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్‌లోనైనా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జూలై14 నుంచి ఖరీఫ్ పంటలకు సాగునీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటిం చగా.. ఇప్పటివరకు మిగులు పనులేవీ పూర్తికాలేదు. కాలువలు కూడా అధ్వానంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
అధ్వానంగా కాలువలు
అడారుగెడ్డ, వరహాలగెడ్డ రిజర్వాయర్ల పరిస్థితీ ఇంతే..
పూర్తిస్థాయిలో సాగునీటి సరఫరాపై సందేహాలు
ఏటాలానే సారి కూడా ఇక్కట్లు తప్పవా?
ఆందోళనలో రైతన్నలు.. కూటమి ప్రభుత్వంపై ఆశలు
గరుగుబిల్లి/పార్వతీపురం రూరల్, జూన్22(ఆంధ్రజ్యోతి): జంఝావతి ప్రాజెక్టు నుంచి ఈ ఖరీఫ్‌లోనైనా ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. జూలై14 నుంచి ఖరీఫ్ పంటలకు సాగునీరు విడుదల చేస్తామని అధికారులు ప్రకటిం చగా.. ఇప్పటివరకు మిగులు పనులేవీ పూర్తికాలేదు. కాలువలు కూడా అధ్వానంగా మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్ల క్ష్యంగా వ్యవహరించింది. జంఝావతి నిర్వహణకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయలేదు. దీంతో కొన్నాళ్లుగా ఐదు మండలాల పరిధిలో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. సాగునీరు అంతంత మాత్రంగానే సరఫరా కావడంతో ఏటా అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. సాగునీరు లభ్యం కాక పంట పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం సాగుకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో జంఝావతి ప్రాజెక్టు ఆధునికీకరణకు మోక్షం కల్పించి.. పూర్తిస్థాయిలో సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
జంఝావతి ప్రాజెక్టు నుంచి కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం, మక్కువ మండలాలకు చెందిన సుమారు 24,640 ఎకరాలకు పైగా సాగునీరు అందాల్సి ఉంది. అయితే గత కొన్నాళ్లుగా మక్కువ మండలానికి పూర్తిస్థాయిలో నీరందడం లేదు. మిగిలిన 4 మండ లాలకు సంబంధించి 9వేల ఎకరాలకు అరకొరగానే సాగునీరందుతుంది. నిధులు సమస్య కారణంగా కాలువల నిర్వహణ అటకెక్కింది. దీంతో పిచ్చిమొక్కలు, పూడికలతో ప్రస్తుతం ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువలు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. కొన్నిచోట్ల వాటికి గండ్లు పడ్డాయి. ఈ ప్రాంతంలోని జంఝావతి, తోటపల్లి పాత రెగ్యులేటర్లపై అధికారులు కన్నెత్తి చూడడంలేదు. ప్రాజెక్టు పరిధిలో లోలెవెల్ కెనాల్‌కు సంబంధించి ఏడు డిస్ట్రిబ్యూటర్లు, హైలెవెల్‌కు సంబంధించి ఐదు డిస్ట్రిబ్యూటర్లు అధ్వానంగా మారాయి. దీంతో దిగువ ప్రాంతాలకు సాగునీరు సరఫరా కావడం లేదు. కాగా సాగునీరందని ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తామన్న నేతల మాటలు ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయి.
రూ. కోట్లు ఖర్చుపెట్టినా..
అడారు ప్రాంతంలో 600 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.రెండు కోట్లతో నిర్మాణాలు ప్రారంభించిన అడారుగెడ్డ రిజర్వాయర్ నిర్మాణానికి మోక్షం లభించడం లేదు. అంచనా వ్యయం పెరుగుతుంది తప్ప ఆ రిజర్వాయర్ నేటికీ పూర్తికావడం లేదు. సుమారు 80శాతం పనులు పూర్తవగా.. మిగిలిన 20 శాతం నిర్మాణం పూర్తికి అధికారులు, పాలకులు చొరవ చూప డం లేదు. మొత్తంగా రూ.ఐదు కోట్ల వరకు ఖర్చవగా.. పనులు మాత్రం మధ్యలోనే నిలిచి పోయాయి. ఇటీవల డీఆర్‌సీ సమావేశంలో రిజర్వాయర్ నిర్మాణం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాం తంలోనే అడారుగెడ్డ రిజర్వాయర్‌తో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తే డీకేపట్నం, తాళ్లబురిడి, అడారు తదితర గ్రామాల్లో మరో 200 ఎకరాలకు కూడా నీరు అందుతుంది.
వరహాలగెడ్డ పరిస్థితి ఇదీ..
వరహాలగెడ్డ రిజర్వాయర్ ఆధునికీకరణ కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మండ లంలో సుమారు 800 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. కానీ కనీసం 200 ఎకరాలకు కూడా నీరందడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారిస్తే.. కృష్ణాపల్లి, పెద్దమరికితో పాటు కొమరాడ మండలంలోని డంగభద్ర తదితర గ్రామాలకు సాగు భూములు సస్యశ్యామలమవుతాయి.
ప్రతిపాదనలు పంపించాం..
జంఝావతి ప్రాజెక్టు పరిధిలోని మిగులు పనులకు రూ.56 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. అదేవిధంగా రిమార్కులను సరిచేసి పంపించాం. నిధులు మంజూరైన వెంటనే కాలువలు అభివృద్ధి, పూడికతీత తదితర పనులు చేపడతాం. గతంలో ఆయా పనులకు రూ. 32 కోట్లు మంజూరు కాగా రూ. 6 కోట్లు విడుదలయ్యాయి. జూలై 14 నాటికి సాగునీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం.
- పి.పవన్‌కుమార్, ఏఈఈ, జంఝావతి ప్రాజెక్టు