Share News

Workers in despair నిరాశలో కార్మికులు

ABN , Publish Date - Sep 20 , 2026 | 11:34 PM

Workers in despair ఎంతో ఘన చరిత్ర కలిగిన నెల్లిమర్ల జూట్‌ మిల్లు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఘనమైన జీవితాలు గడిపిన కార్మికులు మిల్లు యాజమాన్యం విధానాలతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

Workers in despair నిరాశలో కార్మికులు
నెల్లిమర్ల జూట్‌మిల్లు

నిరాశలో కార్మికులు

జూట్‌మిల్లులో నిలిచిపోయిన గ్రాడ్యూటీ చెల్లింపులు

2016 నుంచి ఇదే పరిస్థితి

నాలుగేళ్లుగా చెల్లించని కార్మికుల పీఎఫ్‌ మొత్తాలు

ప్రభుత్వాలు మారినా పరిష్కారం కాని సమస్యలు

ఎంతో ఘన చరిత్ర కలిగిన నెల్లిమర్ల జూట్‌ మిల్లు కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఘనమైన జీవితాలు గడిపిన కార్మికులు మిల్లు యాజమాన్యం విధానాలతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల క్రితం నుంచి రిటైరైన కార్మికులకు యాజమాన్యం గ్రాడ్యూటీ చెల్లించలేదు. నాలుగేళ్ల నుంచి చెల్లించాల్సిన ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) మొత్తాలను కూడా చెల్లించడంలేదు. గతంలో కార్మికుల నుంచి అప్పుగా తీసుకున్న నగదును కూడా ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. దీంతో వేలాది మంది కార్మికులు ఆవేదనతో నెట్టుకొస్తున్నారు.

నెల్లిమర్ల, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలోనే అతిపెద్ద జూట్‌ పరిశ్రమగా పేరుగాంచిన నెల్లిమర్ల జూట్‌ మిల్లును పశ్చిమ బెంగాల్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు 1910వ సంవత్సరంలో స్థాపించారు. సుమారు వెయ్యి మంది కార్మికులతో ప్రారంభమైన ఈ పరిశ్రమ ఏటా ఉత్పత్తి సామర్థ్యం పెంచుతూ అనతి కాలంలోనే ఏడు వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. నాలుగు దశాబ్దాల క్రితం వరకూ ప్రభుత్వ ఉద్యోగాలను సైతం వదిలేసి ఈ పరిశ్రమలో కార్మికులుగా చేరిన పరిస్థితి ఉండేదని చెప్పుకునేవారు. నెల్లిమర్ల, గుర్ల, విజయనగరం, బొండపల్లి, గజపతినగరం, డెంకాడ, పూసపాటిరేగ మండలాలకు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేసేవారు. ప్రతి నెలా పదో తేదీన యాజమాన్యం కార్మికులకు జీతాలు చెల్లించేది. ఆ రోజు నెల్లిమర్ల పట్టణంలో కార్మిక కుటుంబాలతోనూ, వ్యాపారస్తులతోనూ కళకళలాడేది. అయితే గత రెండు దశాబ్దాలుగా యాజమాన్యం ఉత్పత్తి తగ్గించడంతో కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం రెగ్యులర్‌ వెయ్యి మంది, కాంట్రాక్టు పద్ధతిలో మరో వెయ్యి మంది మాత్రమే పనిచేస్తున్నారు.

- రెండు దశాబ్దాలుగా జూట్‌ మిల్లు పరిస్థితి దయనీయంగా మారింది. యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలే దీనికి కారణమనేది కార్మికుల ఆరోపణ. ఎప్పటికప్పుడు యాజమాన్యం మిల్లును మూసివేయడం, కార్మికులకు అందించాల్సిన ప్రయోజనాలను సక్రమంగా అందించక పోవడం ఈ దుస్థితికి కారణాలుగా చెబుతున్నారు. 2016 నుంచి రిటైరైన కార్మికులకు గ్రాడ్యూటీ చెల్లించలేదు. గతంలో యాజమాన్యం ప్రతి నెలా కొంతమంది కార్మికులకు చెక్కుల రూపంలో గ్రాడ్యూటీ చెల్లించేది. అయితే పదేళ్లుగా ఆ చెల్లింపులు నిలిచిపోయాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. కొంతమందికి ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్‌ అయ్యాయని చెబుతున్నారు. దీంతో ఆ డబ్బులు ఎప్పుడు అందుతాయా? పిల్లల పెళ్లిళ్లు ఎప్పుడు చేద్దామా? అని రిటైర్డ్‌ కార్మికులు నిరీక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే 2022 నుంచి ప్రావిడెంట్‌ ఫండ్‌ మొత్తాలను కూడా చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం చెల్లించాల్సిన మొత్తంతోపాటు కార్మికుల జీతాల నుంచి మినహాయించే మొత్తం కూడా పీఎఫ్‌ కార్యాలయానికి చెల్లించడంలేదని చెబుతున్నారు.

Updated Date - Sep 20 , 2026 | 11:34 PM