Share News

Without Supervision? పర్యవేక్షణ లేకుండా పనులా?

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:49 PM

Work Without Supervision? గిరిశిఖర గ్రామాల్లో చేపడుతున్న సీసీ రహదారుల నిర్మాణాల్లో నాణ్యతాలోపం కనిపిస్తోంది. ఈనెల 30వ తేదీ నుంచి ఉపాధి హామీ పథకం వీబీ జీ రామ్‌జీగా (వీబీ జీ రామ్‌జీ-వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌ ) మారనుండడంతో కాంట్రాక్టర్లు ఆదరాబాదరాగా పనులు చేపడుతున్నారు. పనులు సగంలో ఉండగానే బిల్లులు రికార్డింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

  Without Supervision?  పర్యవేక్షణ లేకుండా పనులా?
జోరుమానుగూడ రక్షణగోడ పనులు జరిగే ప్రదేశంలో కనిపించని ఇంజనీరింగ్‌ శాఖ సిబ్బంది

  • గిరిశిఖర గ్రామాల్లోని రోడ్డు నిర్మాణాల్లో నాణ్యతా లోపం

  • పెదవి విరుస్తున్న గిరిజనులు

సీతంపేట రూరల్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామాల్లో చేపడుతున్న సీసీ రహదారుల నిర్మాణాల్లో నాణ్యతాలోపం కనిపిస్తోంది. ఈనెల 30వ తేదీ నుంచి ఉపాధి హామీ పథకం వీబీ జీ రామ్‌జీగా (వీబీ జీ రామ్‌జీ-వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌, ఆజీవిక మిషన్‌ ) మారనుండడంతో కాంట్రాక్టర్లు ఆదరాబాదరాగా పనులు చేపడుతున్నారు. పనులు సగంలో ఉండగానే బిల్లులు రికార్డింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సమయం లేకపోవడం, కొత్త పథకం(వీబీజీ రాంజీ)లో నిబంధనలు మారిపోతుండడంతో గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు పనులు చక్కబెట్టేందుకు యత్నిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీతంపేటకు కూత వేటు దూరంలో ఉన్న పాతపనుకువలస నుంచి బొంగుడుగూడ వయా గాంధీగూడ వరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.80లక్షలతో సీసీ రహదారి నిర్మాణం చేపడు తున్నారు. అయితే టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌శాఖ సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో నాణ్యత లోపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న సుమారు 12వరకు సీసీ రహదారుల పనులపై కూడా ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. రక్షణగోడ పనుల కూడా ఇదే విధంగా కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఓ గిరిశిఖర గ్రామానికి రూ.40లక్షలతో నిర్మించిన సీసీ రహదారి పనుల్లో నాణ్యత లేదని ఆరోపిస్తూ.. ఆయా గ్రామాల గిరిజనులు సీతంపేట ఐటీడీఏ పీవోకు నేరుగా ఫిర్యాదు చేశారు.

గత వైసీపీ సర్కారు హయాంలో గిరిజనసంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారి పనులపై అనేక ఆరోపణలు వినిపించాయి. విజిలెన్స్‌ విభాగానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. అయినప్పటికీ ఆశాఖ పనితీరులో ఎటువంటి మార్పు రావడం లేదు. రెండేళ్ల పాటు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన విజిలెన్స్‌ విభాగం అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొన్న రోడ్లపై విజిలెన్స్‌ క్లియరెన్స్‌ వస్తే కానీ ఆయా పనులు పునఃప్రారంభించేందుకు వీలుపడని పరిస్థితి నెలకొంది.

టీడబ్ల్యూ ఇంజనీరింగ్‌ ఈఈ ఏమన్నారంటే..

‘గిరిజన గ్రామాల్లో చేపడుతున్న రహదారి పనులను మా సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నాణ్యతలో రాజీపడే ప్రసక్తి లేదు. పనులు పూర్తికాకుండా బిల్లు రికార్డింగ్‌ చేసే ఆలోచనే లేదు.’ అని గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ ఈఈ పి.రమాదేవి తెలిపారు.

Updated Date - Jun 29 , 2026 | 11:49 PM