గడువులోగా పనులు పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 04 , 2026 | 11:31 PM
జిల్లాలో నీతి అయోగ్ అస్పిరేషనల్ జిల్లా ప్రోగ్రాం, అస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కింద చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నీతి అయోగ్ అస్పిరేషనల్ జిల్లా ప్రోగ్రాం, అస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కింద చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులన్నీ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనుల స్థితిగతులు, సాధించిన ప్రగతిపై ఆరా తీశారు. నీతిఅయోగ్ నిర్దేశించిన వివిధ సామాజిక, ఆర్థిక అభిృవృద్ధి సూచికల్లో జిల్లాను దేశంలోనే ముందంజలో నిలిపేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని పనులను నిర్దేశిత గవువులోగా ఎక్కడా నాణ్యతలో రాజీపడకుండా పూర్తి చేయాలన్నారు. అస్పిరేషనల్‌బ్లాక్స్ ప్రోగ్రాం పరిధిలోకి వచ్చే భామిని మండలానికి సంబంధించిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశించారు. తాగునీరు, సాగునీరు, రహదారులు, విద్య, వైద్య పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన సమస్యలపై ఆరా తీశారు. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ఆర్.వైశాలి, పవర్‌స్వప్నిల్ జగన్నాథ్, పంచాయతీరాజ్, డీఆర్‌డీఏ, విద్యాశాఖ, వ్యవసాయశాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
బస్సు షెల్టర్లు పూర్తి కావాలి
ఎంపీ ల్యాడ్స్ నిధులతో జిల్లాలో చేపడుతున్న బస్సు షెల్టర్ల పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపడుతున్న బస్ షెల్టర్లు, సామాజిక భవనాలు, రచ్చబండ, గ్రావెల్ రోడ్ల నిర్మాణంలో జాప్యం జరగడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ అధికారులు పనులు నిర్వహణను భారంగా భావించకుండా స్మార్ట్‌గా ఆలోచించాలని, అధునాతన సాంకేతి పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెల 10న సమీక్షా సమావేశం ఉంటుందని, ఈలోగా పెండింగ్ పనులన్నీ పూర్తి కావాలని తేల్చిచెప్పారు.