Share News

Payments? పనులు సరే.. చెల్లింపులేవీ?

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:06 AM

Work Done, But Where Are the Payments? ప్రాజెక్టుల పరిధిలోని కాలువల్లో పిచ్చి మొక్కలు, పూడికలు తొలగించి.. శివారు భూములకు నీరందించడమే నీటి సంఘాల కర్తవ్యం. ఇందు కోసం ప్రభుత్వం ఏటా ఆపరేషన్స్‌ అండ్‌ మెంటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) నిధులు విడుదల చేస్తోంది. అయితే గతేడాది చేసిన పనులకు ఇంతవరకూ బిల్లులు మంజూరు కాకపోవడంతో నీటి సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.

  Payments?  పనులు సరే..  చెల్లింపులేవీ?
వట్టిగెడ్డ రిజర్వాయర్‌ పరిధిలో కాలువల లైనింగ్‌ పనులు చేస్తున్న దృశ్యం

  • విడుదల కాని ఓఅండ్‌ఎం నిధులు.. నీటి సంఘాల గగ్గోలు

  • మరి ఈ ఏడాదిలో పనులకు ఎప్పుడు చెల్లిస్తారో?

జియ్యమ్మవలస, జూలై5(ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల పరిధిలోని కాలువల్లో పిచ్చి మొక్కలు, పూడికలు తొలగించి.. శివారు భూములకు నీరందించడమే నీటి సంఘాల కర్తవ్యం. ఇందు కోసం ప్రభుత్వం ఏటా ఆపరేషన్స్‌ అండ్‌ మెంటైనెన్స్‌ (ఓఅండ్‌ఎం) నిధులు విడుదల చేస్తోంది. అయితే గతేడాది చేసిన పనులకు ఇంతవరకూ బిల్లులు మంజూరు కాకపోవడంతో నీటి సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి.

గత (2025-26) ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ప్రధాన మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కాలువలు లైనింగ్‌ శుభ్రపర్చడానికి 66 పనులు గుర్తించారు. ఇందుకోసం రూ. 1.82 కోట్లు మంజూరు చేశారు. దీంతో నీటి సంఘాల నాయకులు దగ్గరుండి కాలువ లైనింగ్‌, పూడికతీత పనులు చకచకా పూర్తిచేసి శివారు భూములకు నీరందించేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. కానీ ఏడాది పూర్తయినా కనీసం ఒక్క రూపాయి బిల్లు కాకపో వడం వల్ల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక మీడియం ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన తోటపల్లి కాలువల లైనింగ్‌ కోసం ఓఅండ్‌ఆర్‌ నిధులు రూ. 10లక్షలతో పనులు చేసినా నేటికీ బిల్లులు మంజూరు కాలేదు.

నీటి పారుదలశాఖ పర్యవేక్షణలో ఈ ఏడాది కూడా కాలువల లైనింగ్‌ శుభ్రపరిచే పనులు చకచకా జరుగుతున్నాయి. జిల్లాలో 155 పనులకు గాను ఓఅండ్‌ఆర్‌ నిధులు రూ.5.40 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు వట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెదంకలాం, వెంగళరాయసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలో కాలువలు శుభ్రం చేసే పనులు జరుగు తున్నాయి. కాగా గతేడాది బిల్లులు అందకపోయినప్పటికీ సవ్యంగా సాగునీరందకపోతే రైతులు నిలదీస్తారనే కారణంతో ప్రస్తుతం చురుగ్గా పనులు చేపడుతున్నారు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గతేడాదితో పాటు ఈ ఏడాది చేసిన పనులకు సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని నీటి సంఘాలు కోరుతున్నాయి.

నీటి తీరువా వసూలు ఇలా...

సాగునీటి ప్రాజెక్టుల్లో తాత్కాలికంగా ఎటువంటి పనులు చేయాలన్నా ప్రధాన ఆదాయ వనరు నీటి తీరువే. అయితే జిల్లాలో నీటి తీరువా బకాయిలు రూ. 10కోట్లుపైనే ఉన్నట్లు సమాచారం. ఒక్క జియ్యమ్మవలస మండలంలోనే ఈ బకాయి రూ.2 కోట్లకు పైబడి ఉన్నట్లు తెలిసింది. కాగా ఇప్పటి వరకు 20 శాతం కూడా బకాయిలు వసూళ్లు కాకపోవడంతో తాత్కాలిక పనులు చేయడం కష్టమవుతోంది.

నివేదిక పంపించాం

గతేడాది నీటి సంఘాలు చేసిన పనులకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపించాం. సర్కారు ఆదేశాలకు ఎదురు చూస్తున్నాం. ఈ ఏడాది కూడా పనులు సక్రమంగానే జరుగు తున్నాయి. బిల్లుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాం.

- బి.శంకరరావు, ఏఈ, నీటి పారుదలశాఖ, జియ్యమ్మవలస

Updated Date - Jul 07 , 2026 | 12:06 AM