హెచ్చరించినా మేల్కొనరా?
ABN , Publish Date - Aug 28 , 2026 | 11:53 PM
జిల్లాలో వాయు కాలుష్యం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
- వాయుకాలుష్య నగరాల జాబితాలో విజయనగరం
- గత ఏడాది జూలైలో ప్రకటించిన కేంద్రం
- నియంత్రణ చర్యలపై దృష్టిపెట్టని యంత్రాంగం
- కానరాని అవగాహన కార్యక్రమాలు
- భవిష్యత్‌లో ముప్పు తప్పదంటున్న నిపుణులు
విజయనగరం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వాయు కాలుష్యం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం రోజుకు మైక్రోగ్రామ్స్ ఫర్ క్యూబిక్ మీటర్ దాటకూడదు. ఏడాదిలో సరాసరి 60 కంటే తక్కువగా ఉండాలి. కానీ, జిల్లాలో అన్నిచోట్ల 75 నుంచి 77 శాతం ఉండడం కలవరపెడుతోంది. గత ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నేషనల్ క్లీయర్ ఎయిర్ కార్యక్రమం నిర్వహించి వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న 122 నగరాలను గుర్తించింది. అందులో విజయనగరం కూడా ఉన్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఏడాది కాలంలో కాలుష్య నియంత్రణకు ఏం చర్యలు చేపట్టారో యంత్రాంగానికే తెలియాలి. ప్రధానంగా వాయు కాలుష్యానికి కారణం వాహన వినియోగం. ఆపై పరిశ్రమలు, హోటళ్లు వెదజల్లే వాయు వులు. కానీ, జిల్లాలో వాటి నియంత్రణకు ఎటువంటి చర్యలు లేవు. అవగాహన కార్యక్రమాలు నిర్వహించకుండా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులు..
కాలుష్యం గురించి తెలుసుకునేందుకు పరిశ్రమలు ఎక్కువగా ఉన్న వీటి అగ్రహారం, జనాభా అధికంగా ఉన్న కస్పా ప్రాంతం, బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లను గుర్తించారు. అక్కడ ప్రతినెలా తొమ్మిది రోజుల పాటు గాలిలో వాయు కాలుష్యాన్ని పరిశీలిస్తారు. అయితే, ఈ ప్రాంతాలతో పాటు జిల్లాలో అన్నిచోట్లా వాయుకాలుష్యం ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల జిల్లాలో శ్వాసకోశ వ్యాధులు సైతం పెరుగుతున్నాయి. వాతావరణంలో ఉండే సూక్ష్మ ధూళి కణాలు, నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్, శబ్దకాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా జిల్లాలో అస్తమా, బ్లడ్ ప్లెజర్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తులు పనిచేయకపోవడం, లంగ్ కేన్సర్ వ్యాధులు క్రమేపీ పెరుగుతున్నాయి. పరిరక్షణ చర్యలు చేపట్టకపోతే మాత్రం భవిష్యత్‌లో మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై పీసీబీ అధికార యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. కానీ, ఏడాదిలో ఒకటి రెండుసార్లు హడావుడి చేస్తుందనే అపవాదు ఉంది. అసలు ఆ శాఖ నగరంలో ఎక్కడుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని పరిశ్రమల నిర్వాహకులతో ఆ శాఖ అధికారులు కొంతమంది అంటకాగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వాహన వినియోగంతో..
జిల్లాలో వాహనాల వినియోగం ఎక్కువకావడంతో వాయుకాలుష్యం మరింత పెరిగింది. జిల్లాలో 15 లక్షల నుంచి 18 లక్షల వరకూ వాహనాలు ఉన్నాయి. అందులో ఐదు లక్షల వరకూ కాలం చెల్లినవే. వీటిని రహదారులపై తిప్పుతుండడంతో వాయు కాలుష్యం వెదుజల్లుతున్నాయి. ఈ వాహనాల విషయంలో పోలీస్, రవాణా శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఇటీవల గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఎలక్ర్టిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ శ్రేణి వాహనాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచడం చాలా ఉత్తమం.
నియంత్రించే మార్గాలివే..
కాలుష్య నియంత్రణకు ప్రధానంగా మొక్కల పెంపకం, చెట్లను సంరక్షించడం ఉత్తమం. జిల్లాలో ఏటా ఉపాధి హామీ పథకంలో మొక్కలు నాటుతున్నారు. వాటి సంరక్షణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ, అవేవీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వడం లేదు. యంత్రాంగం బాధ్యతగా దీనిని చేపట్టడం లేదు. ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటి సంరక్షిస్తే కాలుష్యాన్ని నియంత్రణలోకి తీసుకురావవచ్చు. గ్రీన్ ఎనర్జీ వెహికల్స్‌ను మాత్రమే వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. కాలం చెల్లిన వాహనాలను నిర్వీర్యం చేయాలి. ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేయాలి. మునిసిపాల్టీలు, పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణను సరిగ్గా చేయాలి. విద్యుత్‌తో పాటు ఇతర శక్తి వనరులు పొదుపు చేయాలి. ఎల్‌ఈడీ లైట్లను మాత్రమే వినియోగించాలి. ఎనర్జీ ఎఫిషియంట్ ఉపకరణాలను మాత్రమే వాడాలి. నీటిని పొదుపుగా వాడాలి. జల కాలుష్యాన్ని తగ్గించాలి. అన్నిటికంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.