Won't you even spare the footpath? ఫుట్‌పాత్‌నూ వదలరా?
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:54 PM
Won't you even spare the footpath? రోడ్డుపై నడిచేవారి భద్రత కోసం రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్ (నడకదారి) ఏర్పాటు చేస్తే దానిని కూడా ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. విజయనగరంలో చాలా వరకు ఇదే పరిస్థితి. తాజాగా నిర్మించిన రోడ్ల వద్ద కూడా ఇదే తీరు కనిపిస్తోంది.
ఫుట్‌పాత్‌నూ వదలరా?
ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారం
నెల కాకముందే ముందుకు విస్తరణ
పాదచారులు ఎక్కడ నడాలి?
పట్టని ప్రణాళికా విభాగం అధికారులు
రోడ్డుపై నడిచేవారి భద్రత కోసం రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్ (నడకదారి) ఏర్పాటు చేస్తే దానిని కూడా ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. విజయనగరంలో చాలా వరకు ఇదే పరిస్థితి. తాజాగా నిర్మించిన రోడ్ల వద్ద కూడా ఇదే తీరు కనిపిస్తోంది. చేసేదిలేక పాదచారులు సాధారణ రహదారిపైనే నడిచివెళ్తున్నారు. ఈ క్రమంలో అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు. ట్రాఫిక్ జాం అయ్యే సమయంలో నడకదారి లేకుంటే పాదచారులకు అవస్థలతో పాటు ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. ఈ కీలక అంశాన్ని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు విస్మరిస్తున్నారు. కనీసం తనిఖీలకు వెళ్లకుండా.. తెలిసినా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.
విజయనగరం టౌన్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్రంలో రహదారులు వెడల్పు చేయడంతో పాటు పాదచారులు నడిచేందుకు వీలుగా నిర్మాణం చేపట్టిన ఫుట్‌పాత్‌లు చాలాచోట్ల కనిపించడం లేదు. రూ.లక్షల ప్రజాధనం వెచ్చించి పాదచారులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని రంగురంగుల పలకలను వేసి నడకదారి నిర్మాణం చేపట్టారు. నెలరోజులు కూడా కాలేదు. అప్పుడే ఆక్రమించేశారు. పాదచారులు రహదారిపై నడవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకవైపు వేగంగా వెళ్తున్న వాహనాలను, పక్క నుంచి వెళ్తున్న భారీ వాహనాలను చూసి భయపడుతూ నడక సాగిస్తున్నామని పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయ్యాక అధికారులు నిఘా పెట్టలేదు. ఇదే అదనుగా తీసుకుని వ్యాపారులు ఎవరికి వారు ముందుకు వచ్చేశారు. సింహాచలం మేడ నుంచి ఐస్ ఫ్యాక్టరీ కూడలి వరకూ, ధర్మపురి కూడలి నుంచి రింగురోడ్డు కొత్తపేట నీళ్లట్యాంకు వరకూ, పాత మహారాజా ఆసుపత్రి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ, ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సీఎంఆర్ వరకూ ఇదే దుస్థితి. అలాగే బాలాజీ కూడలి నుంచి ఐస్‌ఫ్యాక్టరీ కూడలి వరకూ ఆక్రమించేశారు. వ్యాపారులే కాదు ఆసుపత్రి భవన యజమానులు సైతం ఇదే విధంగా వ్యహరిస్తున్నారు. ఆక్రమణలతో విశాలంగా ఉండాల్సిన రోడ్లు ఇరుగ్గా మారి ప్రమాదాలకు నిలయంగా తయారవుతున్నాయి. కార్పొరేషన్ ప్రణాళికా విభాగం అధికారులు ఏం చేస్తున్నారని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని కమిషనర్ బాలస్వామి వద్ద ప్రస్తావించగా ఫుట్‌పాత్ ఆక్రమణలు వాస్తవమేనని, దృష్టి సారించాలని ప్రణాళికా విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని చెప్పారు.