Won’t Cross 30% 30 శాతం మించలే!
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:32 PM
Won’t Cross 30% ఖరీఫ్ సీజన్ సమీపిస్తోంది. అయితే ఇంతవరకు భూసార పరీక్షల ఫలితాలు మాత్రం అందలేదు. దీంతో సాగు పనులు ఎలా చేపట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.
పూర్తిస్థాయిలో భూసార పరీక్షల ఫలితాలు వచ్చేదెప్పుడో
సమీపిస్తున్న ఖరీఫ్ సీజన్
ఆశగా ఎదురుచూస్తున్న రైతులు
అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
పాలకొండ, జూన్ 8(ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ సమీపిస్తోంది. అయితే ఇంతవరకు భూసార పరీక్షల ఫలితాలు మాత్రం అందలేదు. దీంతో సాగు పనులు ఎలా చేపట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2,400 వరకు శ్యాంపిల్స్ సేకరించి భూసార పరీక్షలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో మండలానికి 150 నుంచి 160 వరకు మట్టి నమూనాలను సేకరించి ఫలితాలు అందించాలని నిర్ణయించారు. అయితే ఖరీఫ్‌కాలం ముంచుకొస్తున్నా ఇప్పటివరకు 30 శాతం మేర కూడా మట్టి నమూనాలు సేకరించిన దాఖలాలు లేవు. అసలు మట్టి నమూనాలు సేకరించిన తర్వాత నెల రోజులకు గాని ఫలితాలు అందించలేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ పనులు సమయానికి భూసార ఫలితాలు ఏ విధంగా అందించగలరో అధికారులకే ఎరుక.
వ్యవసాయ దిగుబడులు పెరగాలంటే ఏ భూమి ఏ పంట సాగుకు అనుకూలమో ప్రాథ మికంగా అవగాహన ఉండాలి. అదేవిధంగా ఎంత మోతాదులో ఎరువులు వినియోగించాలి.. భూమిలో ఏయే రకాల పోషక లోపలున్నాయో తెలియాల్సి ఉంది. అయితే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులను అవలంబించాలంటే భూసార పరీక్ష ఫలితాలు ఎంతో కీలకం. కానీ జిల్లాలో సకాలంలో భూసార పరీక్షలు జరగడం లేదు. ఫలితాలు ఆలస్యం కాడంతో రైతులు మూస పద్ధతిలోనే సాగు చేపట్టాల్సి వస్తోంది. అవగాహన లేక చాలామంది అధిక మొత్తం రసా యన ఎరువులు వినియోగించి నష్టాలను చవిచూడడంతో పాటు భూసారాన్ని కోల్పోతున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నారు. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు కూరగాయలను అత్యధికంగా పండిస్తున్నారు. రెండు లక్షల 14 వేల ఎకరాల్లో సాధారణ సాగు చేపడుతుండగా 70 వేల ఎకరాల్లో ప్రకృతి సాగు చేస్తున్నట్టు అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. అయితే సాగులో అవలంబిస్తున్న కొత్త విధానాలు, వాతావరణంలోని మార్పులు కారణంగా నేలలో అనేక మార్పులు చోటు చేసుకంటున్నాయి. భూమిలోని మూలకాల విలువల్లో హెచ్చు తగ్గులు ఏర్పడి దిగుబడులు, నాణ్యత, చీడపీడల సమస్యలు రైతులను వేధిస్తున్నాయి. వాటిని అధిగమించేందుకు వ్యవసాయ భూముల్లోని మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయడం ఎంతైనా అవసరం. వ్యవసాయశాఖ యంత్రాంగం లక్ష్యాల మేరకు ఏటా మట్టి నమూనాలను సేకరించి సకాలంలో ఫలితాల కార్డులను అందించాల్సి ఉంది. అయితే సకాలంలో నమూనాలు సేకరించి.. ఫలితాలు అందించడం లేదు.
- వైసీపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా భూసార పరీక్షలను విస్మరించారు. అయితే గత ఏడాది జిల్లా కేంద్రంలో భూసార పరీక్షా కేంద్రాన్ని కూటమి ప్రభుత్వం అందులో అందుబాటులోకి తెచ్చింది. విజయనగరం, అనకాపల్లి ల్యాబ్‌లతో పాటు పార్వతీపురం ల్యాబ్‌ల్లో 17 వేల భూసార పరీక్షలు చేపట్టారు. ఈ ఏడాది రబీలో సేంద్రియ సాగు చేపట్టిన రైతుల భూములు నుంచి 25 వేల నమూనాలు సేకరించారు. అయితే ఇప్పటివరకు జిల్లాలో సగం మందికి కూడా ఫలితాల కార్డులు అందించలేదు. మట్టి నమూనాలు సేకరించిన తర్వాత ఉచితంగానే జింక్, జిస్పమ్, బోరాన్ తదితర పోషకాలను రైతులకు అందించాల్సి ఉన్నా.. యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టలేదు.
- ప్రస్తుతం జిల్లాలో విరివిగా వానలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు దక్కులు పూర్తి చేసేశారు. మరికొద్దిరోజుల్లో వరి నారు వేయనున్నారు. ఈ నేపథ్యంలో భూసారం తెలిస్తే ఇప్పటి నుంచే ఓ ప్రణాళికతో సాగుకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. అనువైన విత్తనాలను, ఎరువును ఎంపిక చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.