Share News

Wonderful, wonderful!భలే భలే

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:58 PM

Wonderful, wonderful! భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్టు బహుబాగుందని కితాబిస్తున్నారు. వందకు వందశాతం సూపర్‌ అంటున్నారు. పర్యాటక ప్రాంతంలా ఉందని చెబుతున్నారు. తెలుగు సంస్కృతిని చాటే చిత్రాలు, ఏటికొప్పాక బొమ్మలు, పచ్చని ప్రకృతి, సముద్రతీరం వీక్షించి ముగ్ధులవుతున్నారు.

Wonderful, wonderful!భలే భలే
ఎయిర్‌పోర్టు బయట ఏటికొప్పాక బొమ్మల వద్ద సెల్ఫీలు తీసుకొంటున్న ప్రయాణికులు

భలే భలే

భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల కితాబు

పర్యాటక ప్రాంతంలా ఉందంటున్న వైనం

ధరలు, సౌకర్యాలపై అసంతృప్తి

ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటున్న ఎయిర్‌పోర్టు శ్రామికులు

భోగాపురం, ఆగస్టు18(ఆంధ్రజ్యోతి):

భోగాపురం(అల్లూరి సీతారామరాజు) అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్టు బహుబాగుందని కితాబిస్తున్నారు. వందకు వందశాతం సూపర్‌ అంటున్నారు. పర్యాటక ప్రాంతంలా ఉందని చెబుతున్నారు. తెలుగు సంస్కృతిని చాటే చిత్రాలు, ఏటికొప్పాక బొమ్మలు, పచ్చని ప్రకృతి, సముద్రతీరం వీక్షించి ముగ్ధులవుతున్నారు. భోగాపురం విమానాశ్రయంలో రెండో రోజు మంగళవారం కూడా ప్రయాణికులతో సందడిగా కనిపించింది. వాణిజ్యపరమైన విమానాల రాకపోకలు జరుగుతుండడంతో ఎయిర్‌పోర్టులో పూర్తిస్థాయి సేవలు ప్రారంభయ్యాయి. భోగాపురానికి ఇతర ప్రాంతాలనుంచి వచ్చే ప్రయాణికులు కొంత సమయం ఎయిర్‌పోర్టులో గడిపి పరిసరాలను తిలకిస్తూ.. ఫొటోలు దిగుతూ ప్రత్యేక అనుభూతితో వెళ్తున్నారు. వాటర్‌పాండ్‌, బొమ్మల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు.

ఎయిర్‌పోర్టులో మొదటిరోజు 26 విమానాలు రాకపోకలు సాగించగా రెండోరోజు కూడా అదే స్థాయిలో విమానాలు వెళ్లివస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎయిర్‌పోర్టు చాలా బాగుందని చెప్తున్నప్పటికీ అదే ప్రయాణికులు సౌకర్యాలు, ధరాఘాతంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో తాగునీరు లేకపోవడం దారుణంగా ఉందని, మరుగుదొడ్లు వినియోగంలో లేవని, కూర్చోడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదంటున్నారు. బస్సులో వచ్చే ప్రయాణికులు వేచి ఉండే చోట కూర్చోవడానికి కుర్చీలు, తాగేందుకు నీరు అందుబాటులో లేవంటున్నారు. అలాగె ప్రచార బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఎప్పుడు ఏ విమానం వస్తుందో తెలియడం లేదని ప్రయాణికుల కోసం వేచి ఉండే వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అరలీటరు తాగునీటి బోటిల్‌ రూ.70గా ధర ఉండడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులో కారు, ద్విచక్రవాహనం ఉంచాలంటే అధికంగా వసూళ్లు చేస్తున్నారని వాపోతున్నారు. చాలా మంది ట్యాక్సీ డ్రైవర్లు ముందుగా ఎయిర్‌పోర్టులోకి వెళ్తే అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తుందని భావించి ట్రంపెట్‌ సమీపంలో వేచి ఉండి విమానం వచ్చే సమయం ముందు ఎయిర్‌పోర్టుకి వెళ్తున్నారు. అలాగె ఎయిర్‌పోర్టులో పని చేసేవారు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకి రావాలంటే ఎటువంటి ప్రయాణ సౌకర్యంలేదని వచ్చిన జీతంలో రోజుకు రూ.300 వరకు ప్రయాణానికే అవుతోందని అంటున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అన్ని విధాలా చాలా బాగుందని, అయితే సౌకర్యాలు మెరుగుపరచి కారు, బైక్‌ పార్కింగ్‌ చార్జీలు తగ్గించాలని, భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు సాధారణ ఆర్టీసీ బస్సులను తిరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

ఎయిర్‌పోర్టు చాలా బాగుంది:

విశాఖ ఎయిర్‌పోర్టు కన్నా భోగాపురం ఎయిర్‌పోర్టు చాలా బాగుంది. పదేపదే బెంగుళూర్‌కు రాకపోకలు సాగిస్తుంటాను. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం చాలా ఈజీగా ఉంది.

సుష్మిత, శ్రీకాకుళం.

ప్రయాణమే ఇబ్బందికరంగా ఉంది

విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు రావడానికి గంటా 10నిమిషాలు సమయం పట్టింది. తిరుపతి వెళ్లడానికి ఇక్కడికి వచ్చాం. విశాఖ ఎయిర్‌పోర్టుకి అయితే 20 నిమిషాల్లో చేరుకొనేవారిమి. ప్రయాణ సమయం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఎయిర్‌పోర్టు బాగుంది. కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడం ఇబ్బందికరంగా ఉంది.

నాగలక్ష్మి, విశాఖ పట్నం.

ఆర్టీసీ సౌకర్యం కల్పించాలి

ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నాం. ఇక్కడికి రావడానికి ఎటువంటి ప్రయాణ సౌకర్యంలేదు. ఈ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉందామంటే చిన్న గదికి కూడా రూ.10వేలు అడుగుతున్నారు. రాపిడో ఆటో, బైక్‌లను రానివ్వడంలేదు. జీతం అంతా తిరగడానికే చాలడంలేదు. ఎయిర్‌పోర్టు వరకు అయినా సాధారణ ఆర్టీసీ సర్వీసులు తిరిగేలా చూస్తే మాలాంటి వారికి బాగుంటుంది.

ఎన్‌.తర్సి, కారు ట్రావెల్స్‌, విజయనగరం.

ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి

ఆర్టీసీ బస్సుల ద్వారా విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. పాసింజర్లు వేచి ఉండేందుకు కుర్చీలు లేవు. తాగునీరు అందివ్వడం లేదు. మొదటి రోజు 450 మంది ప్రయాణికులు ఆర్టీసీ సర్వీసులను ఉపయోగించుకొన్నారు. రోజుకు 3000 వేల మంది ప్రయాణికులు ఉపయోగించుకొంటారని అనుకొన్నాం. చాలా బస్సుల్లో ఒకరిద్దరే వస్తున్నారు.

పద్మావతి, ఆర్టీసీ చీప్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, విశాఖపట్నం.

Updated Date - Aug 18 , 2026 | 11:58 PM