Share News

ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధవహించాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:26 AM

ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధవహించాలి
హెల్త్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి

సాలూరు, జనవరి3 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యంపై మహిళలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం పట్టణంలోని గుమడాం సమీపంలో రూ.99.94 లక్షల వ్యయంతో నిర్మించిన అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ను జేసీ యశ్వంత్‌ కుమార్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ కుటుంబాన్ని నడిపించే మహిళలు తమ ఆరోగ్యాన్ని తరచూ నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇంటికి మూల స్తంభమైన మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందన్నారు. ఏ చిన్న ఆరోగ్య వచ్చినా వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని హితవు పలికారు. ప్రసవ సమయంలో వచ్చే నొప్పులు భరించలేక చాలా మంది శస్త్రచికిత్సలకు మొగ్గు చూపు తున్నారని, అలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రసవ వేదన భరిస్తే జీవితకాలం ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. తల్లీబిడ్డల క్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు పడుతున్న ఇబ్బందులు చూసి ఈ ప్రాంతానికి ఒక పెద్ద ఆసుపత్రి అవసరమని గుర్తించామన్నారు. స్థానికంగా వంద పడకల ఆసుపత్రి అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరామన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఆసుపత్రి మంజూరు చేశారన్నారు. జేసీ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందన్నారు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న భవనాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో భాస్కరరావు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, ఏఎంసీ చైర్మన్‌ ముఖీ సూర్యనారాయణ, యుగంధర్‌, రాయప్ప, వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:26 AM