ఉన్నతాధికారులుగా మహిళామణులు
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:04 AM
జిల్లాలోని పలు శాఖల్లో మహిళా ఉన్నతాధి కారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ మార్కు చూపుతున్నారు.
ఇన్‌చార్జిలుగా అదనపు బాధ్యతలు
పాలనా వ్యవహారాల్లో ప్రత్యేక మార్కు
పార్వతీపురం, జూలై5(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు శాఖల్లో మహిళా ఉన్నతాధి కారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తూ.. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో తమ మార్కు చూపుతున్నారు. మరోవైపు ఇన్‌చార్జిలుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐటీడీఏ, రెవెన్యూ, ఐసీడీఎస్, పోలీస్, డీఆర్‌డీఏ తదితర శాఖల్లో సమర్థంగా విధులు నిర్వహిస్తూ .. జిల్లా ప్రగతికి తమవంతు కృషి చేస్తున్నారు. ఓ వైపు సమీక్షలు.. మరోవైపు క్షేత్రస్థాయి పర్యటనలతో ముందుకు సాగుతున్నారు.
- పార్వతీపురం ఐటీడీఏ పీవోగా, ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్‌గా వైశాలి విధులు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం సబ్ కలెక్టర్‌గా జిల్లాకు వచ్చిన ఆమె ఐటీడీఏవో పీవోగా నియామకమయ్యారు. అనంతరం జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఆమెకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు.
- జిల్లా రెవెన్యూశాఖ అధికారి హేమలత కొన్నేళ్లుగా జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మూడేళ్ల కిందట ఇక్కడ ఆర్డీవోగా పనిచేసిన ఆమె పదోన్నతిపై డీఆర్వోగా వచ్చారు. కాగా జిల్లాలో ఏ ఉన్నతాధికారి సెలవుపై వెళ్లినా ఆమెకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనిలో భాగంగానే కొద్ది రోజుల కిందట వరకు హేమలత ఇన్‌చార్జి జేసీగా వ్యవహరించారు.
- పార్వతీపురం ఆర్డీవోగా నియామకమైన మాధురి కొద్దిరోజుల కిందటే బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి బదిలీపై ఆమె ఇక్కడకు వచ్చారు. ప్రస్తుతం డివిజన్‌లో విస్తృతంగా పర్యటిస్తూ సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి.. పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.
- డీఆర్‌డీఏ పీడీగా ప్రభావతి, గిరిజన సంక్షేమ శాఖ డీడీగా విజయశాంతి , పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌గా పావని , ఐసీడీఎస్ పీడీగా కనకదుర్గ విధులు నిర్వహిస్తున్నారు.
- పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని డిప్యూటీ డీఎంహెచ్‌వోలుగా పద్మావతి, విజయపార్వతి, ఇక పోలీస్‌శాఖలో ఏఎస్పీగా వి.మనీషారెడ్డి విధులు నిర్వహిస్తున్నారు.