Share News

Women are queens! మహిళలే మహరాణులు!

ABN , Publish Date - Apr 01 , 2026 | 11:33 PM

Women are queens! మహిళలు రాజకీయాల్లో కీలకంగా మారే రోజులు రాబోతున్నాయా.. వారి నిర్ణయమే ప్రభుత్వాలకు అంతిమం కాబోతుందా.. అసెంబ్లీకి, పార్లమెంట్‌కు వారే అధికంగా ఎన్నికవుతారా.. ఈ ప్రశ్నలకు పరిశీలకులు అవుననే చెబుతున్నారు.

Women are queens! మహిళలే మహరాణులు!

మహిళలే మహరాణులు!

మహిళా రిజర్వుడు నియోజకవర్గాలు పెరిగే అవకాశం

జనగణన తరువాత డీలిమిటేషన్‌

కొత్త లెక్కల ప్రకారమే పునర్విభజన

భార్య, కుమార్తెలను సిద్ధం చేసే ఆలోచనలో నేతలు

మహిళలు రాజకీయాల్లో కీలకంగా మారే రోజులు రాబోతున్నాయా.. వారి నిర్ణయమే ప్రభుత్వాలకు అంతిమం కాబోతుందా.. అసెంబ్లీకి, పార్లమెంట్‌కు వారే అధికంగా ఎన్నికవుతారా.. ఈ ప్రశ్నలకు పరిశీలకులు అవుననే చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వస్తోంది. నియోజకవర్గాలను పెంచే యోచనలో ఉంది. జనగణన తరువాత డీలిమిటేషన్‌ ఉంటుందని చెబుతోంది. ఇదే సమయంలో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలు చేయాలనుకుంటోంది. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మహిళలే మహారాణులు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

విజయనగరం, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి విజయనగరం జిల్లాలో 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మరో 4 నుంచి 5 వరకూ పెరుగుతాయనే అంచనా ఉంది. బొబ్బిలి పార్లమెంట్‌ స్థానాన్ని పునరుద్ధరించే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న నియోజకవర్గాలకు అదనంగా 50 శాతం పెరుగుతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే రాబోయే రోజుల్లో ప్రజా ప్రతినిధులుగా ఎక్కువ మంది మహిళలు ఎన్నికయ్యే అవకాశం ఉంది. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు విధిగా ఉండేలా చూస్తారు.

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వుడుగా రాజాం, పార్వతీపురం... ఎస్టీ రిజర్వుడుగా కురుపాం, సాలూరు, పాలకొండ ఉన్నాయి. మరో పార్లమెంట్‌ స్థానం పెరిగితే అందులో ఒకటి విధిగా ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం రానుంది. మరోవైపు ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గాల సంఖ్య 5 వరకూ పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 16 నియోజకవర్గాలకు సంఖ్య పెరిగితే అందులో 6 నియోజకవర్గాలు రిజర్వుడుగా మారడం ఖాయం. మిగిలిన 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలుచేస్తే జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు మహిళలకు కేటాయించడం ఖాయంగా తెలుస్తోంది. జనగణన కొలిక్కి వచ్చిన తరువాత మాత్రమే దీనిపై స్పష్టత రానుంది.

జిల్లాలో ఇప్పటికే మహిళా ఎమ్మెల్యేలు ముగ్గురు ఉన్నారు. శృంగవరపుకోట నుంచి కోళ్ల లలితకుమారి, నెల్లిమర్ల నుంచి లోకం నాగమాధవి, విజయనగరం నుంచి అదితి గజపతిరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గాలు తారుమారు అయినా వీరు మాత్రం ఆశావహులుగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ నుంచి బొత్స కుమార్తె, కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తెలు పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వారు క్రియాశీలకంగా ఉన్నారు. అయితే పునర్విభజనతో మహిళా రిజర్వేషన్లు పక్కాగా అమలుచేస్తే కచ్చితంగా తమ స్థానాలు పోతాయని చాలామంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ప్రత్యామ్నాయంగా వారి భార్య, కుమార్తెలను సిద్ధం చేస్తున్నారు. పార్టీలో వివిధ పదవుల ద్వారా నియోజకవర్గాలకు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండడం వనితలకు అదనపు సానుకూలతగా భావించొచ్చు.

జనగణన అయ్యాకే..

జిల్లాలో జనగణన ప్రారంభమైంది. కొత్త గణన కొలిక్కి వచ్చిన తరువాతే డీలిమిటేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. విజయనగరం కార్పొరేషన్‌ పరిధిని విడదీసి పక్క మండలాలతో కలిసి ఒక నియోజకవర్గం ఏర్పాటు కావొచ్చు. బొబ్బిలి, రాజాం మునిసిపాల్టీలతో పక్క మండలాలను కలిపి మరో రెండు నియోజకవర్గాలు ఏర్పడతాయంటున్నారు. అటు పార్వతీపురం జిల్లాలో ఎస్టీ మండలాలను కలుపుతూ మరో రిజర్వుడ్‌ నియోజకవర్గం ప్రకటిస్తారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 11:33 PM