అవగాహన లేక.. వినియోగించక..
ABN , Publish Date - Mar 25 , 2026 | 11:43 PM
పశ్చిమాసియా యుద్ధం ప్రభావం వంట గ్యాస్‌పై పడుతోంది. గ్యాస్ సిలిండర్ల కొరత అన్ని వర్గాల ప్రజలను వేధిస్తోంది.
- అంగన్‌వాడీ కేంద్రాల్లో వృథాగా ఇండక్షన్ స్టౌవ్‌లు
- గ్యాస్ లేక కట్టెల పొయ్యిపై వంటలు
- కార్యకర్తలకు తప్పని ఇబ్బందులు
- ఇండక్షన్ స్టౌవ్‌లను వినియోగిస్తే మేలు
పాలకొండ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధం ప్రభావం వంట గ్యాస్‌పై పడుతోంది. గ్యాస్ సిలిండర్ల కొరత అన్ని వర్గాల ప్రజలను వేధిస్తోంది. దీంతో చాలామంది కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. ఈ ప్రభావం అంగన్‌వాడీ కేంద్రాలపై కూడా పడింది. జిల్లాలో చాలా కేంద్రాలకు గ్యాస్ సరఫరా లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేసి పిల్లలకు పెడుతున్నారు. అయితే, ప్రభుత్వం గతేడాది అందించిన ఇండక్షన్ స్టౌవ్‌లను వినియోగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ స్టౌవ్‌ల వినియోగంపై అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు అవగాహన లేకపోవడంతో కేంద్రాల్లో అవి వృథాగా పడిఉన్నాయి.
368 స్టౌవ్‌ల పంపిణీ
జిల్లాలో 1,470 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 534 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ముందస్తుగా పాలకొండ, పార్వతీపురం, సాలూరు అర్బన్ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం ఇండక్షన్ స్టౌవ్‌లను పంపిణీ చేసింది. మొత్తం 368 కేంద్రాలకు ఒక్కొక్కటి చొప్పున అందజేసింది. దశల వారీగా అన్ని కేంద్రాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ ఇండక్షన్ స్టౌవ్‌లు విద్యుత్‌తో పని చేస్తాయి. ఎల్‌పీజీ కంటే 30 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటి ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయల గ్యాస్ ఖర్చు ఆదా అవుతుందని, పర్యావరణహితంగా ఉండడమే కాకుండా అంగన్‌వాడీ సిబ్బంది, పిల్లలకు పొగ బాధ తప్పుతుందని ప్రభుత్వం భావించింది. అయితే, జిల్లాలో ఈ స్టౌవ్‌లను పంపిణీ చేసి ఎనిమిది నెలలు అవుతున్నా వినియోగిస్తున్న దాఖలాలు ఏ కేంద్రంలో కూడా మచ్చుకైనా కనిపించడం లేదు. అన్ని కేంద్రాల్లో కూడా వృథాగా పడి ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నారు.
ఫ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇండక్షన్ స్టౌవ్‌లు ఉన్నప్పటికీ అధికారుల అలసత్వం, నిర్వాహకుల అవగాహన లోపంతో వినియోగానికి నోచుకోవడం లేదు. ఇండక్షన్ స్టౌవ్‌లపై వీడియో రూపొందించి ప్రతి కార్యకర్తకూ పంపించామని, ఆ వీడియోను చూసి స్టౌవ్‌ను వినియోగించాలని అధికారులు చెబుతుంటే.. కనీసం అవగాహన, శిక్షణ లేకుండా ఆ స్టౌవ్‌లను ఎలా వినియోగించేదని అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఈ సెంటర్లకు ప్రభుత్వం విద్యుత్ బిల్లులు మంజూరు చేయడం లేదని, ఇండక్షన్ స్టౌవ్‌లను వినియోగిస్తే కరెంట్ బిల్లులు అధికంగా వస్తాయని, అందుకే వాటిని పక్కన పడేశామని కార్యకర్తలు చెబుతున్నారు.
అవగాహన కల్పించాం
పార్వతీపురం, పాలకొండ, సాలూరులో 368 అంగన్‌వాడీ సెంటర్లకు ఇండక్షన్ స్టౌవ్‌లను పంపిణీ చేశాం. వీటి వినియోగంపై ప్రభుత్వం పంపించిన వీడియోను ఐసీడీఎస్ సీడీపీవోల ద్వారా ప్రతి కార్యకర్తకు పంపించాం. ఈ వీడియోను చూసి అవగాహన పొంది ఇండక్షన్ స్టౌవ్ వినియోగించాలని ఆదేశాలు జారీ చేశాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి స్టౌవ్‌లు వినియోగించేలా చర్యలు తీసుకుంటాం.
-కనకదుర్గ, ఐసీడీఎస్ పీడీ, పార్వతీపురం మన్యం
అవగాహన లేదు
పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో ఇండక్షన్ స్టౌవ్‌లను వినియోగించడం లేదు. చిన్నారులను చెంతనే పెట్టుకొని విద్యుత్‌ను వినియోగించి స్టౌవ్‌ను వాడడం ద్వారా ప్రమాదాల బారిన పడతామేమో నని భయంతో వాటి జోలికి వెళ్లడం లేదు. అర్బన్ సెంటర్లు చాలా వరకు ప్రైవేటు భవనాల్లోనే ఉన్నాయి. వీటికి ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. కార్యకర్తలే స్వయంగా చెల్లించుకోవాల్సి వస్తుంది.
-బి.అమరవేణి, అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు, పార్వతీపురం మన్యం