Without Tenders…! టెండర్లు లేకుండానే..!
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:03 AM
Without Tenders…! ఉపాధి హామీ నిధులతో జిల్లాలో పలుచోట్ల చేపడుతున్న అభివృద్ధి పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మా ణాలను నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకుల హవా
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు
గరుగుబిల్లి, మార్చి4(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ నిధులతో జిల్లాలో పలుచోట్ల చేపడుతున్న అభివృద్ధి పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో సీసీ రహదారులు, డ్రైనేజీల నిర్మా ణాలను నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు అంతా తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు అనుమతులు ఇవ్వకుండానే పనులు చేపడుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పంచాయతీల పరిధిలో సచి వాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పర్యవేక్షణ కూడా కొరవడింది. దీంతో పనులను ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో బీటీ, సీసీ రహదారులకు సుమారు రూ.148 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే రూ. 70 కోట్లుకు పైగా వెచ్చించారు. గరుగుబిల్లి మండలంలో 149 పనులు నిర్వహిస్తున్నారు. కాగా గొట్టివలస పంచాయతీ పరిధిలో సీసీ రహదారితో పాటు డ్రైనేజీలకు రూ.4.90 లక్షలు కేటాయిం చారు. అయితే కేవలం సీసీ రహదారి పనులు చేపట్టి.. డ్రైనేజీలను మాత్రం నిర్మించలేదు.
- కురుపాం నియోజకవర్గం పరిధిలో 342 పనులకు జనవరి 31న కోట్లాది రూపాయల ఉపాధి నిధులు మంజూరు చేశారు. అగ్రిమెంట్, టెండర్లు లేకుండానే ఆయా పనులు చేపడు తున్నారు. ఇదే పరిస్థితి పలు పంచాయతీల్లో ఉంది. చాలాచోట్ల డ్రైనేజీలు లేకుండా సీసీ రహదారులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అధికారులు లేకుండానే గ్రామస్థాయిలో ఆయా పనులు చేపడుతున్నారు.
- ఉపాధి హామీ నిధులతో పలు అభివృద్ధి పనులను చేపడుతుండగా... వాటి నిర్వహణకు సంబంధించిన రికార్డింగ్‌ను పంచాయతీరాజ్‌శాఖ అధికారులకు అప్పగించారు.
ఆదరాబాదరగా..
ప్రస్తుతం ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్రం వాటా 10 శాతం, కేంద్రం వాటా 90 శాతంగా ఉంది. కొద్దిరోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిబంధనలు మారనున్నాయి. దీని ప్రకారం.. రాష్ట్రం వాటా 40 శాతం, కేంద్రం వాటా 60 శాతంగా ఉండనుంది. దీంతో జిల్లాలో ఆదరా బాదరాగా ఉపాధి అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఈ నెల 10లోగా పనులు పూర్తి చేసి 15లోగా చెల్లింపులు చేసేందుకు ఎంపీడీవోలు ఆన్‌లైన్‌లో మండలాల వారీగా ఆయా వివరాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంది. కాగా సమయం తక్కువ ఉండడంతో పనులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. అయితే వాటిపై ప్రత్యేక పర్యవేక్షణ లేకుంటే నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది. మొత్తంగా క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించకుండా అధికారులు చెల్లింపులు చేస్తారో, నిబంధనల మేరకు వ్యవహరిస్తారో వేచి చూడాల్సి ఉంది.
పరిశీలిస్తాం
పంచాయతీల పరిధిలో చేపడుతున్న పనులను నిశితంగా పరిశీలిస్తాం. నిబంధనలకు విరు ద్ధంగా పనులు నిర్వహిస్తే చెల్లింపులు నిలుపుదల చేస్తాం. క్వాలిటీ కంట్రోల్ అధికారులు సిఫార సుల మేరకు చర్యలు చేపడతాం. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించని సిబ్బందిపై చర్యలు తీసు కుంటాం.
- వీఎస్ నగేష్‌బాబు, ఈఈ, పంచాయతీరాజ్‌శాఖ, పార్వతీపురం