Without Permissions.. అనుమతుల్లేకుండానే..
ABN , Publish Date - Aug 10 , 2026 | 11:33 PM
Without Permissions.. డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ జిల్లాలో వైసీపీ నేతలు ఎటువంటి అనుమతుల్లేకుండా తలపెట్టిన నిరసనలు, ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రం పార్వతీపురంలో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసనకు అనుమతి లేదని చెప్పినా ఆ పార్టీ శ్రేణులు వినిపించుకోలేదు.
పార్వతీపురం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ జిల్లాలో వైసీపీ నేతలు ఎటువంటి అనుమతుల్లేకుండా తలపెట్టిన నిరసనలు, ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రం పార్వతీపురంలో వైసీపీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసనకు అనుమతి లేదని చెప్పినా ఆ పార్టీ శ్రేణులు వినిపించుకోలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావుతో పాటు పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి సీతానగరం తదితర ప్రాంతాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. సాయంత్రానికి వారిని విడుదల చేశారు. కురుపాంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ర్యాలీ చేపట్టేందుకు తన ఇంటి నుంచి బయటకు రాగా పోలీసులు అడ్డుకున్నారు. సాలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో బోసుబొమ్మ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాలకొండలో ఎమ్మెల్సీ విక్రాంత్‌ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటల తర్వాత తన అనుచరులతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు. ఆయన్ని పోలీసులు నిలువరించారు. డీఎస్సీపై సీబీఐ విచారణ జరగాలని, విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.