Share News

Without mentioning that I am an outsourced employee... ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినని చెప్పకుండా..

ABN , Publish Date - Nov 18 , 2026 | 12:25 AM

Without mentioning that I am an outsourced employee... ఆమె డ్వామాలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని. కానీ ఈ విషయం దాచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి రాగా.. ఆమె నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. రాజాం మునిసిపాలిటీలోని 30వ వార్డులో అభ్యర్థుల అర్హతపై వివాదం నెలకొంది.

Without mentioning that I am an outsourced employee... ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినని చెప్పకుండా..
30వ వార్డులో నామినేషన్ల వివాదంపై కమిషనర్‌తో చర్చిస్తున్న టీడీపీ, వైసీపీ నాయకులు

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగినని చెప్పకుండా..

వైసీపీ తరపున బరిలోకి..

విషయం బహిర్గతం చేసిన టీడీపీ నేతలు

నామినేషన్‌ను తిరస్కరించిన అధికారులు

ఎస్‌ఐపై మాజీ ఎంపీ బెల్లాన చిందులు

రాజాం రూరల్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఆమె డ్వామాలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని. కానీ ఈ విషయం దాచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి రాగా.. ఆమె నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. రాజాం మునిసిపాలిటీలోని 30వ వార్డులో అభ్యర్థుల అర్హతపై వివాదం నెలకొంది. టీడీపీ, వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈ క్రమంలో కమిషనర్‌ చాంబర్‌లోకి వచ్చిన రాజాం టౌన్‌ ఎస్‌ఐ మహమ్మద్‌ సల్మాన్‌ బేగ్‌తో వైసీపీ నేత, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ వాగ్వాదానికి దిగారు. ‘ఇది నీ పోలీస్‌స్టేషన్‌ కాదు‘ అంటూ దురుసుగా వ్యవహరించారు. ఈ వివాదంలో వైసీపీ అభ్యర్థి తామరాపల్లి లావణ్య నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. రాజాం మునిసిపాలిటీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టగా.. చైర్‌పర్సన్‌ పదవికి 14 మంది, కౌన్సిలర్‌ స్థానాలకు 240 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 30వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంపోలు సుగుణ రేషన్‌ డీలర్‌గా పనిచేస్తున్నారని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే వార్డు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తామరాపల్లి లావణ్య డ్వామాలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారని, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నా ఉద్యోగానికి రాజీనామా చేయలేదని టీడీపీ నాయకులు కమిషనర్‌ రామచంద్రరావుకు ఫిర్యాదు చేశారు. నామినేషన్‌ పత్రాల్లో ఆమె తన వృత్తిని గృహిణిగా పేర్కొనడంపైనా అభ్యంతరం తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న కమిషనర్‌.. అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను పరిశీలించారు. లావణ్యను విధుల నుంచి తొలగించలేదని, కేవలం సస్పెండ్‌ చేసి పక్కన పెట్టారని టీడీపీ నాయకులు పేర్కొంటూ సంబంధిత పత్రాలను అందజేశారు. మరోవైపు అంపోలు సుగుణ డీలర్‌ పదవికి రాజీనామా చేసినట్లు ఆధారాలు చూపించాలని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌ సూచించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఎస్‌ఐ మహమ్మద్‌ సల్మాన్‌ బేగ్‌ కమిషనర్‌తో మాట్లాడారు. సమస్య ఏమైనా ఉందా? అని అడగ్గా.. లేదని కమిషనర్‌ సమాధానమిచ్చారు. దీంతో అక్కడున్న వారంతా బయటకు వెళ్లాలని ఎస్‌ఐ సూచించారు. దీంతో బెల్లాన చంద్రశేఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. తాను ఎవరికీ అనుకూలంగా వ్యవహరించడం లేదని, అందరినీ బయటకు వెళ్లాలని మాత్రమే సూచించానని ఎస్‌ఐ వివరించారు.

వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ

30వ వార్డులో టీడీపీ అభ్యర్థి అంపోలు సుగుణ డీలర్‌ పదవికి రాజీనామా చేసినట్లు చీపురుపల్లి ఆర్డీవో జారీ చేసిన పత్రాలను టీడీపీ నాయకులు కమిషనర్‌కు అందజేశారు. వైసీపీ అభ్యర్థి లావణ్య ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగానికి రాజీనామా చేయలేదని అధికారులు నిర్ధారించారు. సస్పెన్షన్‌లో ఉన్నా ఉద్యోగ సంబంధాలు కొనసాగుతున్నందున భవిష్యత్తులో తిరిగి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం పొందే అవకాశం ఉందని పేర్కొంటూ ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ మేరకు రాజాం సహాయ ఎన్నికల అథారిటీ, మునిసిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు మంగళవారం సాయంత్రం ప్రకటించారు.

Updated Date - Nov 18 , 2026 | 12:25 AM