Share News

Without foresight... ముందు‘చూపు’ లేకుంటే..

ABN , Publish Date - Aug 08 , 2026 | 11:25 PM

Without foresight... కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. కేవలం స్మార్ట్‌ ఫోన్ల వినియోగంతోనే ఎక్కువ మంది రుగ్మతల బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Without foresight... ముందు‘చూపు’ లేకుంటే..

ముందు‘చూపు’ లేకుంటే..

పిల్లల్లో పెరుగుతున్న కంటి రుగ్మతలు

అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

స్మార్ట్‌ఫోన్ల అధిక వినియోగంతోనే అనర్థాలు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నేత్ర పరీక్షలు

అవసరమైన వారికి కళ్లద్దాలు

సన్నాహాలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ

- రాజాంకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు సందీప్‌ సెల్‌ఫోన్‌ను విపరీతంగా చూస్తుంటాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడ్డాడు. తలబాధతో సతమతమతమవుతున్నాడు. తల్లిదండ్రులు వెంటనే వైద్యులకు చూపించగా సెల్‌ఫోన్‌ ప్రభావంతోనేనని తేల్చారు. దీంతో క్రమేపీ బాలుడికి సెల్‌ఫోన్‌ను దూరం చేస్తున్నారు.

- రాజాం వస్త్రపురి కాలనీకి చెందిన చిన్నారి ప్రణవ్‌కు ఉదయం లేచింది మొదలు సెల్‌ఫోన్‌ చూడడం అలవాటు. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే సమయంలో కూడా సెల్‌ఫోన్‌ తీసుకొని చూస్తుంటాడు. ఇటీవల బాలుడికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. విపరీతమైన తలనొప్పితో నీరసించిపోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రిలో చూపించగా సెల్‌ఫోన్‌ చూడడమే కారణమని తేల్చారు. చివరకు బాలుడు కళ్లజోడు వాడాల్సి వచ్చింది.

రాజాం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. కేవలం స్మార్ట్‌ ఫోన్ల వినియోగంతోనే ఎక్కువ మంది రుగ్మతల బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అన్నం తినకుండా మారం చేస్తున్నారనో.. అల్లరి ఆపడం కోసం చాలామంది తల్లిదండ్రులు పిల్లల చేతికి సెల్‌ఫోన్‌ ఇస్తుంటారు. ప్రారంభంలో ఇది సరదాగా అనిపించినా..క్రమేపీ అదొక వ్యసనంలా మారిపోతోంది. దీంతో రోజులో ఎక్కువ సమయం వారు సెల్‌ఫోన్‌తో గడుపుతున్నారు. పిల్లల రోజువారీ సెల్‌ఫోన్‌ వినియోగంపై హ్యాపీనెడ్జ్‌ అనే సంస్థ గత ఏడాది సర్వే చేపట్టింది. ఈ సర్వే నివేదిక ప్రకారం 12 సంవత్సరాల్లోపు పిల్లలు 42 శాతం మంది రోజుకు 2 గంటల నుంచి 4 గంటల వరకూ ఫోన్‌ స్ర్కీన్లకు అతుక్కుపోతున్నారు. 12 ఏళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో 47 శాతం పైబడి సెల్‌ఫోన్లు చూస్తున్నారని తేలింది. 74 శాతం మంది పిల్లలు కేవలం యూట్యూబ్‌ చూసేందుకే ఫోన్‌ వాడుతుంటే..మరికొందరు గేమింగ్‌ కోసం ఎక్కువగా సెల్‌ఫోన్‌ వినియో గిస్తున్నట్టు ఆ సంస్థ నిర్ధారించింది. ఇతర విషయాల్లో తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణలో పెడతున్నా.. విద్యావసరాల పేరిట సెల్‌ఫోన్‌ వినియోగాన్ని మాత్రం కంట్రోల్‌ చేయలేక పోతున్నారని తేల్చింది.

ఫ జాతీయ అంధత్వ నివారణ సంస్థ సూచనతో పిల్లల్లో దృష్టిలోప నియంత్రణలో భాగంగా ఆరోగ్య శాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా విద్యార్థులకు నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 15 నుంచి విద్యార్థులకు వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా కళ్లద్దాల పంపిణీ జరగనుంది. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1745 ఉన్నాయి. వాటిలో 89,677 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నేత్ర వైద్య పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు అందించనున్నారు.

ముందే అదుపు చేయాలి

ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు సెల్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గించాలి. ఒక వేళ విద్య, ఇతర అవసరాలకు ఇచ్చినా వారిపై ఒక కన్నేసి ఉంచాలి. వ్యసనంగా మార్చే గేమ్‌లు ఉంటాయి. అశ్లీల దృశ్యాలు చూసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు మానసిక రోగులుగా మారితే వారి భవిత దెబ్బతింటుంది. ఆ ప్రభావం కుటుంబంపై పడుతుంది. తల్లిదండ్రులు ఎక్కువ సమయం పిల్లలతో గడపాలని మానసిక వేత్తలు కోరుతున్నారు. తల్లిదండ్రులు సైతం వీలైనంత వరకూ పిల్లల ముందు సెల్‌ఫోన్‌ వినియోగాన్ని తగ్గించాలంటున్నారు.

ఎన్నో అనర్థాలు..

ఎన్నోరకాల అనర్థాలకు సెల్‌ఫోన్లు కారణమవుతున్నాయి. పిల్లలు సరదా పడుతున్నారని...వారి అల్లరి నుంచి తప్పించేందుకు ఫోన్లు ఇస్తుంటారు. అక్కడే తప్పు చేస్తున్నారు. ఆ తప్పే అనర్థాలకు దారితీస్తోంది. పిల్లలకు నేర్చుకోవాలన్న ధ్యాస తగ్గుతుంది. చివరకు గుణింతాలు, అంకెలు, జవాబుల కోసం సెల్‌ఫోన్లనే వాడుతున్నారు. టీనేజ్‌లో సెల్‌ఫోన్ల వినియోగం కూడా ఎన్నో దుష్పరిణామాలకు దారితీస్తోంది. చిన్నారుల్లో అయితే మానసిక వ్యాధులు, వ్యసనానికి కారణమవుతోంది. అందుకే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.

బి.తిరుపతిరావు, మానసిక వైద్య నిపుణుడు, రాజాం

పిల్లలకు వైద్య పరీక్షలు

పాఠశాలల్లో పిల్లలకు వైద్య పరీక్షలు చేపడతాం. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి విద్యార్థి తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైన వారికి కళ్లద్దాలు అందిస్తాం. విద్యార్థులను వీలైనంత వరకూ సెల్‌ఫోన్లకు దూరంగా ఉండడమే మంచిది.

- వె.ౖదుర్గారావు, ఎంఈవో, రాజాం

-----------------------

Updated Date - Aug 08 , 2026 | 11:25 PM