Within half an hour at the professor's house ప్రొఫెసర్ ఇంట్లో అరగంటలోనే
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:28 PM
Within half an hour at the professor's house రాజాంలోని జీఎంఆర్‌ఐటీ ప్రాంగణంలో రస డాక్టర్స్ క్వార్టర్స్‌తో పాటు లయ ప్లాట్‌లో ఈనెల 1న రాత్రి జరిగిన భారీ చోరీల వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రస బ్లాక్‌లో 20 ప్లాట్లు ఉన్నా కనీసం సీసీ కెమెరాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ప్రొఫెసర్ ఇంట్లో అరగంటలోనే
సీసీ పుటేజీ ఆధారంగా నిర్ధారణ
రస బ్లాక్‌లో సీసీ కెమెరాల్లేవ్
మిస్ అయిన ద్విచక్ర వాహనం
చోరీ చేసి బైక్‌పై ఉడాయించారా..?
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
రాజాం రూరల్, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రాజాంలోని జీఎంఆర్‌ఐటీ ప్రాంగణంలో రస డాక్టర్స్ క్వార్టర్స్‌తో పాటు లయ ప్లాట్‌లో ఈనెల 1న రాత్రి జరిగిన భారీ చోరీల వెనుక ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రస బ్లాక్‌లో 20 ప్లాట్లు ఉన్నా కనీసం సీసీ కెమెరాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఐటీ ప్రాంగణం పరిసరాల్లో ఆదివారం పార్క్ చేసిన రెడ్‌కలర్ పల్సర్ బైక్ సోమవారం ఉదయానికి లేదు. చోరీకి వచ్చిన ముగ్గురు అగంతకులు ఆదివారం రాత్రి 8.20 గంటలకే లయ బ్లాక్‌లోని ప్రొఫెసర్ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి, అక్కడ చోరీ చేసి తిరిగి 8.48 గంటలకు బయటకు వచ్చి సందు ద్వారా రస బ్లాక్‌వైపు వెళ్లినట్లు సీసీ ఫుటేజీలో కనిపిస్తోంది. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా, లేరా అనే సందేహాలు సైతం తెరపైకి వచ్చాయి.
బైక్ మిస్సింగ్
ఆదివారం రాత్రి చోరీ జరిగిన ప్రాంతంలో పార్క్‌చేసి ఉంచిన ఏపీ 35 ఏసీ 7105 నెంబర్ గల రెడ్‌కలర్ పల్సర్ బైక్ మిస్సయినట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం ఉన్న బైక్‌ను సోమవారం ఎవరూ పట్టించుకోలేదు. అయితే అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు బైక్ మిస్సయినట్లు మంగళవారం గుర్తించారు. బైక్‌ను ఎవరైనా చోరీ చేశారా.. చోరీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు చోరీసొత్తుతో బయటపడి దగ్గర్లోని రైల్వేస్టేషన్ చేరుకునేందుకు వినియోగించారా అనేది కూడా తేలాల్సి ఉంది. చోరీచేసిన బైక్‌ను ఆ ముగ్గురే తీసుకువెళ్తే వారు చోరీ ప్రదేశానికి ఎలా వచ్చారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
వైడ్యుడి ఇంట్లోనే మొదట జరిగి ఉంటే..
చోరీ మొత్తం ఎపిసోడ్‌లో క్వార్టర్స్ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు లేవని, ఉన్నచోట్ల కొన్ని పనిచేయడం లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఆదివారం రాత్రి చోరీకి వచ్చిన ముగ్గురు అగంతకులు తొలుత డా.నగేష్ ఇంటికి వెళ్లుంటే.. అక్కడ వారికి లభ్యమైన కిలో వెండి, 1250 గ్రాముల బంగారంతో సంతృప్తి చెందేవారేమో అని స్థానికులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే లయ అపార్ట్‌మెంట్‌లోని కృష్ణారెడ్డి ఇంటివైపు దొంగలు వెళ్లేందుకు ఆసక్తి చూపేవారు కాదు. దొంగల ఆచూకీ కూడా తెలియని దుస్థితి నెలకొనేది. కాని తొలుత కృష్ణారెడ్ది ఇంట్లో చోరీ చేయడం, అక్కడ కేవలం 25 తులాలు బంగారం మాత్రమే లభ్యం కావడంతో సంతృప్తి చెందని దొంగలు డా.నగేష్ ఇంటివైపు అడుగులు వేసి సీసీ పుటేజీల్లో చిక్కుకున్నారు. వెళ్లిపోతూ కొంత ఆధారాన్ని పోలీసులకు వదలిపెట్టారు. కృష్ణారెడ్డి ఇంట్లో జరిగిన చోరీని దొంగలు సుమారు 30 నిమిషాలలో పూర్తిచేశారు. సీసీ పుటేజిల్లో లభ్యమైన ఆధారాల మేరకు ఆదివారం రాత్రి 8.23 గంటలకు లయ బ్లాక్‌లోని కృష్ణారెడ్డి ఇంట్లో ప్రవేశించిన దొంగలు పని ముగించుకుని తిరిగి 8.48 గంటలకు బయటపడ్డారు. అక్కడి నుంచి డా.నగేష్ ఇంట్లోకి వెళ్లి వేకువజాము వరకూ అక్కడే ఉన్నారు.
బైక్ ఆచూకీ తెలిస్తే పారితోషికం
ఉపేంద్రరావు, సీఐ, రాజాం రూరల్
జి.ఎం.ఆర్.ఐ.టి. ప్రాంగణంలో ఈనెల 1న రాత్రి జరిగిన చోరీ సమయంలో ఉన్న పల్సర్ బైక్ (ఏపి 35 ఏసి 7105) సోమవారం నుంచి కనిపించడం లేదు.. ఈ నెంబర్‌ప్లేట్ ఉన్న బైక్ ఎక్కడైనా, ఎవరైనా గుర్తిస్తే పొలీసులకు సమచారం ఇవ్వండి. దర్యాప్తునకు సహకరించండి. రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, తోటలు ఇతరత్రా ప్రదేశాలలో వదిలిపెట్టి వెళ్లే అవకాశాలున్న నేపధ్యంలో బైక్ ఆచూకీ కనిపిస్తే సమాచారం ఇవ్వండి. పారితోషికం ఇస్తాం.