Share News

ఇంటి నుంచి వెళ్లిన గంటలోపే...

ABN , Publish Date - Sep 01 , 2026 | 12:34 AM

జాతీయ రహదారిపై జర్జంగి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్న పేట మండలం బుచ్చిపేట గ్రామానికి చెందిన టాక్టర్‌ డ్రైవర్‌ కొన్న నవీన్‌ (31) మృతి చెందాడు.

 ఇంటి నుంచి వెళ్లిన గంటలోపే...

  • ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

కోటబొమ్మాళి/నరసన్నపేట, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై జర్జంగి గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్న పేట మండలం బుచ్చిపేట గ్రామానికి చెందిన టాక్టర్‌ డ్రైవర్‌ కొన్న నవీన్‌ (31) మృతి చెందాడు. పోలీసుల తెలిపిన సమాచారం మేరకు నవీన్‌ ట్రాక్టర్‌పై ఇసుక లోడును నరసన్నపేట వైపు నుంచి తీసుకు వస్తుండగా జర్జంగి గ్రామ సమీపంలోకి వచ్చేసరికి కోల్‌కతా వైపు వెళుతున్న కంటైనర్‌ వెనుక నుంచి ఢీకొంది. దీంతో ట్రాక్టర్‌ బోల్తాపడడంతో డ్రైవర్‌ నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య అశ్విని, కుమారుడు ధీరజ్‌లు ఉన్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ అసుప్రతికి పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుడి తండ్రి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వి.లక్ష్మణరావు తెలిపారు.

ఫ బుచ్చిపేటలో విషాదచాయలు

కోటబొమ్మాళి మండలం జర్జంగి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కొన్న నవీన్‌ (35) స్వగ్రామం నరసన్నపేట మండలం బుచ్చిపేట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. సోమవారం ఉదయం ఇంటి నుంచి ట్రాక్టర్‌తో ఇసుకను తీసుకువెళ్లిన గంటలోపే తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని సమాచారం రావడంతో తండ్రి ఈశ్వరరావు, తల్లి వెంకాయమ్మ షాక్‌కు గురయ్యారు. అంతవరకు కుటంబంతో సరదాగా గడిపి... తన నాలుగేళ్ల కుమారుడికి ‘బై..’చెప్పివెళ్లిన నవీన్‌ కానరాని లోకాలకు వెళ్లడంతో భార్య అశ్విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబాన్ని పోషించే ఆధారం తెగిపోవడంతో ఆ తల్లిదండ్రులు, భార్య రోదనలు మిన్నంటుతున్నాయి.

Updated Date - Sep 01 , 2026 | 12:34 AM