కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోనే..
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:12 AM
బతుకు తెరువు కోసం కొనుగోలు చేసుకున్న ఆటోను కొన్నిగంటల వ్యవధిలోనే చోరీ చేసిన వైనం మండలంలోని మంగళపాలెం పంచాయతీ రెల్లి కాలనీలో చోటుచేసుకుంది.
కొత్తవలస, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): బతుకు తెరువు కోసం కొనుగోలు చేసుకున్న ఆటోను కొన్నిగంటల వ్యవధిలోనే చోరీ చేసిన వైనం మండలంలోని మంగళపాలెం పంచాయతీ రెల్లి కాలనీలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కొత్తవలస పోలీసులు మంగళవా రం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెల్లి కాలనీకి చెందిన బంగారి అప్పలరాజు గత కొంత కాలంగా అద్దెకు ఆటోను తెచ్చుకుని నడుపుతున్నాడు. తాను సంపాదించిన డబ్బులు అద్దె చెల్లించడానికే వస్తున్నాయని సొంతంగా ఆటోను కొనుగోలు చేసుకోవాలనున్నాడు. ఈ మేరకు ఈనెల 20వ తేదీన రూ.3లక్షల 18వేలతో కొత్త ఆటోను కొనుగోలు చేశాడు. ఈ ఆటోను కొత్తవలస కొండడాబా వ్యాకులమాత ఆలయం వద్దకు తీసుకెళ్లి, పూజలు కూడా చేశాడు. అదేరోజు రాత్రి ఇంటికి ఆటోను తీసుకొచ్చి, ఇంటి ముందు పెట్టాడు. తెల్లారేసరికి ఆటో కనిపించలేదు. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆటో కొనడానికి చేసిన అప్పు ఎలా తీర్చాలంటూ ఆవేదన చెందాడు. దీంతో 23వ తేదీ రాత్రి కొత్తవలస పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని వైపులా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. కొత్తవలస నుంచి పెందుర్తి వైపు వెళ్తున్న పెందుర్తి బ్రిడ్జి కింద నుంచి తెల్లవారుజాము మూడు గంటల సమయంలో ఆటోను తీసుకు వెళ్తున్నట్టు కనిపించింది. ఈ ఆటోను ఎవరు నడుపుతున్నారనే విషయం గుర్తించలేదు. పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.