Share News

విజయమే లక్ష్యంగా..

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:36 PM

స్థానిక ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయమే లక్ష్యంగా పని చేసేందుకు కేడర్‌ను సిద్ధం చేస్తోంది.

విజయమే లక్ష్యంగా..

- స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న టీడీపీ

- నేటి నుంచి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు

- తొలుత సాలూరు నుంచి శ్రీకారం

పార్వతీపురం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయమే లక్ష్యంగా పని చేసేందుకు కేడర్‌ను సిద్ధం చేస్తోంది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో అత్యధిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కూటమి పార్టీలను కలుపుకొని వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు మండలాల వారీగా టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. తొలుత సాలూరు మండలం నుంచి ఈ సమావేశాల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. బుధవారం సాలూరులో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కేడర్‌తో సమావేశం నిర్వహించనున్నారు. 22న పాచిపెంట, 23న మెంటాడ, 24న మక్కువ మండలాల నాయకులు, కార్యకర్తలతో, 25న సాలూరు పురపాలక సంఘ నాయకులతో సమావేశాన్ని నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేశారు.

- పాలకొండ నియోజకవర్గంలో టీడీపీలో రెండు బలమన గ్రూపులు నేటికీ కొనసాగుతున్నాయి. ఇటీవల భామిని పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎటువంటి గ్రూప్‌లు వద్దని, అధిష్ఠానం ఆదేశాలను పాటించాలని దిశానిర్దేశం చేశారు. అయినా కొంతమంది నాయకుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టిసారించి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులంతా కలిసి పని చేసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

- కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలంలో టీడీపీలో రెండు గ్రూపులు ఉండేవి. ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దత్తి లక్ష్మణరావుల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉండేది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల వీరిమధ్య సయోధ్య కుదిరింది. ఒకరు జడ్పీటీసీగా, మరొకరు ఎంపీపీగా పోటీ చేసేందుకు అంగీకారానికి వచ్చారు. కొమరాడ మండలంలో ఉన్న రెండు గ్రూప్‌ల మధ్య సయోధ్య ఏర్పడే విధంగా ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి మరింత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోని నాయకుల మధ్య పెద్దగా బేదాభిప్రాయాలు లేవు.

-పార్వతీపురం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎన్నికల్లో కేడర్‌ అంతా ఐకమత్యంగా పనిచేయాలంటే ప్రతి మండలానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది.

అభివృద్ధి, సంక్షేమంపై ప్రచారమేదీ?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్‌సిక్స్‌ పథకాలను అమలు చేయడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తుంది. అయితే, వీటిని ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్‌ పదే పదే చెబుతున్నా కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు పట్టించుకోవడం లేదు. స్థానిక ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jan 20 , 2026 | 11:36 PM