Share News

గిరిజన అభివృద్ధే లక్ష్యంగా..

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:48 PM

గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం గిరిజన సహకార సంఘాలు (జీసీసీ) ద్వారా చర్యలు తీసుకుంటోంది.

గిరిజన అభివృద్ధే లక్ష్యంగా..
నరమామిడి చెట్టు బెరడు తీయడంపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్న జీసీసీ అధికారులు

- జీసీసీ చర్యలు

- ఇప్పటికే అటవీ ఉత్పత్తులు కొనుగోలు

- తాజాగా నరమామిడి బెరడు సేకరణకు ప్రోత్సాహం

- గిరిజనులకు శిక్షణ

జియ్యమ్మవలస, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం గిరిజన సహకార సంఘాలు (జీసీసీ) ద్వారా చర్యలు తీసుకుంటోంది. దీనికి అనుగుణంగా గిరిజనులు సేకరించిన, పండించిన అటవీ ఉత్పత్తులు దళారుల బారిన పడి మోసపోకుండా నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపడుతుంది. నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్‌ విధానంపై జీసీసీ అధికారులు, సిబ్బంది గిరిజనులకు శిక్షణ ఇస్తున్నారు. మద్దతు ధరకు ఎలా అమ్మాలి, ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల్లో ఏ విధంగా మార్కెటింగ్‌ చేసే అవకాశం ఉంది, తదితర అంశాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా, నరమామిడి బెరడు సేకరణకు వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ మేరకు శిక్షణ ఇస్తున్నారు.

130 టన్నులు లక్ష్యం..

నరమామిడి చెట్టు బెరడు కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం జీసీసీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 2026-27 ఆర్థిక సంవత్సరంలో 130 టన్నుల బెరడు కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించింది. పార్వతీపురం డివిజన్‌లోని జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో నడిమిసిరిపి, పల్లపుసిరిపి, కూటం, పాండ్రసింగి, బీరుపాడు, ఇజ్జకాయ్‌, వడజంగి, ఎండభద్ర, పెదశాఖ, కుంతేసు, గూనగళ్లు, గొర్లెమ్మ, గుమడంగి, టేకలపాడు, ఒప్పంగి, జాకూరు గ్రామ పరిసరాల్లో నరమామిడి చెట్లు ఉన్నట్లు జీసీసీ గుర్తించింది. బెరడు సేకరణపై జీసీసీ బీఎం సాయిశివరావు ఆధ్వర్యంలో సిబ్బంది గిరిజనులకు శిక్షణ ఇచ్చారు. బెరడున సేకరించే విధానం, పాటించాల్సిన నాణ్యతలను పూర్తిగా వివరించి అవగాహన కల్పించారు. కిలో రూ.18కు కొనుగోలు చేస్తామని వారికి తెలియజేశారు. బెరడును నిర్దేశించిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, చెక్కను బాగా ఎండబెట్టిన తరువాతే కొనుగోలు చేస్తామని జీసీసీ అధికారులు తెలియజేశారు. దీంతో గిరిజనులు నరమామిడి చెట్టు బెరడును సేకరించే పనిలో బిజీగా ఉన్నారు.

- గిరిజనులు సేకరించిన పండ్లు, ఔషధ మొక్కలు, చింతపండు, నల్ల జీడి పిక్కలు, రాంబలం, సీతాఫలం, జీడి పిక్కలు, చీపుర్లు, పైనాపిల్‌, బీడీ ఆకులు, తేనె, అడ్డాకులు, ఉసిరి, అశ్వగంధ, తదితర వస్తువులన్నీ జీసీసీ కొనుగోలు చేస్తోంది. వీటిని ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తుంది. జిల్లాకు సమీపంలో భోగాపురం విమానాశ్రయం ఉండడంతో ఎగుమతులకు మరెంతో ఉపయోగపడుతుందని జీసీసీ అధికారులు నమ్ముతున్నారు. ఇప్పటికే సీతంపేట ఏరియాలో పండిన పైనాపిల్‌ను కేరళ రాష్ట్రానికి ఎగుమతి చేస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్నాం

నరమామిడి చెట్టు బెరడు సేకరణపై గిరిజనులకు అవగాహన కల్పిస్తన్నాం. వారు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో అటవీ ఉత్పత్తులన్నీ కొనుగోలు చేస్తున్నాం. వారు దళారులబారిన పడి మోసపోకుండా చర్యలు తీసుకుంటున్నాం.

-ఎం.సాంబశివరావు, బ్రాంచ్‌ మేనేజర్‌, జీసీసీ, పార ్వతీపురం

Updated Date - Aug 18 , 2026 | 11:48 PM