బోధనే పరమావధిగా..
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:30 AM
జిల్లాలోని ఎందరో ఉపాధ్యాయులు తమ జీవితాన్ని విద్యార్థులకు అంకితం చేస్తున్నారు.
- విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు
- కొందరు కాలినడకన పాఠశాలలకు వెళ్తున్న వైనం
- ఆటపాటల ద్వారా పాఠ్యాంశాల బోధన
- పిల్లల కోసం ఆటోలు.. సొంత నిధులూ ఖర్చు
- నేడు ఉపాధ్యాయ దినోత్సవం
బొబ్బిలి/ఎస్.కోట రూరల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఎందరో ఉపాధ్యాయులు తమ జీవితాన్ని విద్యార్థులకు అంకితం చేస్తున్నారు. కొండలు, గుట్టలు దాటి కాలినడకన, సైకిళ్లపై పదుల కిలోమీటర్ల దూరంలోని పాఠశాలలకు వెళ్లి బోధిస్తున్నారు. తమ ఉద్యోగానికి సార్థకత కావాలి..తమ పని పదిమందికి ఆదర్శంగా నిలవాలి.. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రుల్లో తమ పనితీరు ఎప్పటికీ నిలిచిపోవాలని తపన పడుతున్నారు. భావిభారత పౌరులను తయారు చేయాలన్న సంకల్పంతో పనిచేస్తున్నారు. పాఠశాలకు రాలేని గిరిశిఖర గ్రామాల విద్యార్థుల కోసం సొంతంగా ఆటోలు ఏర్పాటు చేస్తున్నారు. వారి వద్ద ఓనమాలు నేర్చుకున్న విద్యార్థుల్లో నేడు ఎందరో ఉన్నత స్థాయిలో ఉన్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొందరు ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.
పిల్లల చదువు కోసం సొంతంగా ఆటో ఏర్పాటు..
ఎస్.కోట మండలం కాపుసోంపురం-2 ప్రభుత్వ పాఠశాలలో వీఎస్ దేముడు, ఎం.కొండలరావు, ఎంవీఎస్ నారాయణ, పి.చిన్నంనాయుడు ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఈ పాఠశాలకు దూరంగా దారపర్తి పంచాయతీ పరిధిలో మూడు గిరిజన గ్రామాలు ఉన్నాయి. పిల్లలు చదువుకోవాలంటే కొండ దిగాలి. చిన్నారులను అంతదూరం ఏం పంపిస్తామని చెప్పి తల్లిదండ్రులు వారిని ఇంటికే పరిమితం చేశారు. దీన్ని గుర్తించిన నలుగురు ఉపాధ్యాయులు ఆ గ్రామానికి వెళ్లారు. చదువుకు దూరమైన 45 మంది పిల్లలను గుర్తించారు. ఇద్దరు ఆటో డ్రైవర్లతో మాట్లాడి పిల్లలను ఉదయం పాఠశాలకు తెచ్చి సాయంత్రం మళ్లీ ఇంటికి తీసుకెళ్లేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికోసం రెండు ఆటోలకు నెలకు రూ.10వేలు చెల్లిస్తున్నారు. ఇలా రెండేళ్లుగా సొంత డబ్బులు డ్రైవర్లకు ఇస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 59 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విషయంపై ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలకు చదువు చెప్పి ప్రయోజకులను చేయాలనే ఆటోలు ఏర్పాటు చేశామని, ఇందులో తమ గొప్పతనం ఏమి లేదని చెబుతున్నారు.

ఉపాధ్యాయులు దేముడు, కొండలరావు, నారాయణ, చిన్నంనాయుడు
ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లి బోధన..
ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ గూనపాడు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయడం చాలాకష్టం. కొండలు, గుట్టలు దాటుకుని పాఠశాలకు చేరుకోవాలి. అంతా కాలినడకనే వెళ్లాలి. పాఠశాల హెచ్‌ఎం చిప్పాడ సూరిబాబు, మరో ఉపాధ్యాయుడు విజ్జపు మహేశ్వరరావు ప్రతిరోజూ ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి గిరిజన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. మైదాన ప్రాంతం బొడ్డవర పంచాయతీ మెట్టపాలెం వరకు ద్విచక్ర వాహనాలపై చేరుకొని, అక్కడ నుంచి కాలినడకన రైలు పట్టాలు దాటి ఈ గ్రామానికి చేరుకుంటున్నారు. మళ్లీ పాఠశాల విడిచిపెట్టిన తరువాత ఏడు కిలోమీటర్ల నడిచి మెట్టపాలెం వస్తుంటారు.

గూనపాడు పాఠశాలకు నడిచివెళ్తున్న ఉపాధ్యాయుడు మహేశ్వరరావు
బోధనలో ప్రత్యేక శైలి..
బొబ్బిలి పట్టణంలోని తారకరామాకాలనీ మున్సిపల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయిని చిట్టిమోజు ఉషారాణి ఆటపాటల ద్వారా పాఠ్యాంశాలను బోధిస్తూ విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. పిల్లలకు సులభతరంగా అర్ధమయ్యేరీతిలో బొమ్మలు, ప్రాజెక్టులు, పాటలు, పెయింటింగ్స్ వంటి వాటితో అర్ధవంతంగా, ఆసక్తి కలిగించేలా చేస్తున్నారు. మై స్మార్ట్ క్లాస్ వెబ్‌సైట్‌ను రూపొందించడంతో విద్యార్థులంతా ట్రయల్ అండ్ ఎర్రర్ మోడ్‌లో అభ్యసనాన్ని వ్యసనంగా మార్చుకుంటున్నారు. మొబైల్ ఫోన్లలో అనవసరమైన వాటి నుంచి పిల్లల దృష్టిని మరల్చడానికి ఆమె ఈ విధానాన్ని ఎన్నుకున్నారు. 2012, 2021 లో ఆమె స్టేట్ రీసోర్స్ పర్సన్‌గా పనిచేసి సైన్స్ పాఠ్యాంశాల తయారీలో పాలుపంచుకున్నారు. అక్షరమాలపై సొంతంగా పాటలు రాశారు. గత ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.20 వేలు నగదుతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్తదుస్తులు కొనుగోలు చేసి పంపిణీ చేశారు.

కృత్యాలతో బోధిస్తున్న ఉపాధ్యాయిని ఉషారాణి
రిటైర్డ్ అయినా చదువులతల్లి సేవలోనే..
బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని మల్లమ్మపేట గ్రామానికి చెందిన 66 ఏళ్ల రిటైర్డ్ టీచర్ పోల సత్యంనాయుడు ఇంకా చదువులతల్లి సేవలో తరిస్తున్నారు. జనవిజ్ఞానవేదిక సంస్థ ద్వారా ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్‌ను విరివిగా నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి ఏటా సుమారు నాలుగువేల మంది విద్యార్థులను సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులకు అమూల్యమైన పుస్తకాలను బహుమానంగా అందజేస్తున్నారు. ఈయన దగ్గర చదువుకున్న వారు వందలాది మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. అలజంగి హైస్కూల్‌లో పనిచేసినప్పుడు వాకాడ అనూరాధ అనే విద్యార్థినిని దత్తత తీసుకొని ఎంబీఏ వరకు చదివించారు. ఆమె ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నారు. నారసింహునిపేటకు చెందిన శ్రీనివాసరావు అనే పేద విద్యార్థిని సొంతసొమ్ముతో చదివించారు. అతడు రైల్వేలో ఉద్యోగం సాధించాడు. నిత్యం ఏదో ఓ పాఠశాలకు వెళ్లి సైన్స్, ఇతర సామాజిక అంశాలకు సంబంధించి అవగాహన తరగతులు నిర్వహిస్తుంటారు. ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ తప్ప బోధనా విరమణ అనేది లేదని సత్యంనాయుడు చెబుతుంటారు.

విద్యార్థులకు బోధిస్తున్న రిటైర్డ్ టీచరు పోల సత్యంనాయుడు
‘వనమిత్ర’ కృష్ణదాసు..
బొబ్బిలి తారకరామాకాలనీకి చెందిన కె.కృష్ణదాసు మాస్టారుకు వనమిత్ర బిరుదు ఉంది. ఆయన ప్రతిరోజూ సైకిల్‌పై స్కూలుకు వెళ్తుంటారు. ఓ సంచిలో మొక్కలు, బిస్కెట్లు, పుస్తకాలు, బహుమతులు వంటివి వేసుకుని దారి పొడవునా పంచుతుంటారు. ఆధ్యాత్మిక, జాతీయ పర్వదినాల్లో మొక్కవోని దీక్షతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు. పేదలకు బట్టలు, అభాగ్యులకు భోజనాలు, పేద విద్యార్థులకు బహుమతులు అందజేస్తుంటారు. శక్తిమేరకు ఆర్థిక వితరణ కూడా అందిస్తుంటారు.

విద్యార్థులకు ఆల్ ఇన్‌వన్ పుస్తకం అందిస్తున్న కృష్ణదాసు