With population growth declining... జనాభా వృద్ధి తగ్గుతూ..
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:18 AM
With population growth declining... పిల్లల కోసం తల్లిదండ్రులు పరితపించడం సర్వసాధారణం. ప్రభుత్వాలు కూడా అదే కోరుకుంటుండడం కొత్త అంశం. జనాభా వృద్ధి రేటు తగ్గుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.
జనాభా వృద్ధి తగ్గుతూ..
పదేళ్లలో జిల్లాలో మందగించిన పుట్టుకలు
పెరిగిన ఖర్చులతో ఇద్దరితో సరిపెడుతున్న పేదలు
1.71కు పడిపోయిన జిల్లా ఫెర్టిలిటీ రేటు
సంతానం కోసం ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న ఎగువ మధ్యతరగతి జంటలు
అధికంగా పిల్లలు కనండంటున్న ప్రభుత్వం
నేడు ప్రపంచ జనాభా దినోత్సవం
పిల్లల కోసం తల్లిదండ్రులు పరితపించడం సర్వసాధారణం. ప్రభుత్వాలు కూడా అదే కోరుకుంటుండడం కొత్త అంశం. జనాభా వృద్ధి రేటు తగ్గుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ప్రోత్సాహకాలు సైతం ప్రకటిస్తున్నాయి. అయితే రాష్ట్రంతో పాటు జిల్లాలోనూ గతంతో పోల్చితే పిల్లల పుట్టుక శాతం తగ్గింది. కొందరు పేదల్లో ఆర్థిక కారణాలతో ఒకరు లేదా ఇద్దరితో సరిపెడుతున్నారు. ఇంకొందరిలో సంతాన సాఫల్యత తగ్గింది. ఎగువ మధ్య తరగతి, పైతరగతి వారిలో కూడా సంతాన సాఫల్యత కోసం ఆస్పత్రులను ఆశ్రయిస్తుండడం కనిపిస్తోంది. జిల్లాలో 1.71కు పడిపోయిన ఫెర్టిలిటీ రేటు భవిష్యత్‌ను అయోమయంలో పడేస్తోంది.
విజయనగరం కలెక్టరేట్/ రింగురోడ్డు, జూలై 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనాభా వృద్ధి రేటు ఏటా దిగజారుతోంది. పెరిగిన విద్య, వైద్యం ఖర్చులు భరించలేక కొందరు ఇద్దరు పిల్లలతో సరిపెడుతున్నారు. మరోవైపు సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురుచూస్తున్న జంటలూ ఎక్కువగానే ఉన్నాయి. ఫెర్టిలిటీ రేటు చూస్తే జిల్లాలో సగటున 1.71 ఉంది. 2022-23లో 1.72 ఉండగా 2023-24లో 1.72 నమోదైంది. 2024-25లో 1.71గా ఉంది. ఆ తర్వాత ఇదే పరిస్థితి కొనసాగుతోంది. సంతానోత్పత్తిని పెంచాలంటూ సాక్షాత్తూ సీఎం చంద్ర బాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకరు ఇద్దరుతో కాకుండా ముగ్గురు నలుగురును కనాలంటూ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా జనాభా పెరగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో జన సంపద పెరగడం లేదు. ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. జనాభా పెరుగుదల, ప్రభావంపై అవగాహన కల్పించేడమే దీని ముఖ్య ఉద్దేశం. ఒకరు ముద్దు.. ఇద్దరు హద్దు అని ప్రభుత్వాలే చెప్పేవి. అయితే సమాజంలో వస్తున్న మార్పులు, జీవనశైలిలో తీరుతెన్నులు జనాభాపై పెను ప్రభావం చూపుతున్నాయని గ్రహించి ప్రభుత్వాలు కూడా తమ విధానాన్ని మార్చుకున్నాయి. ఎక్కువ మంది పిల్లలను కనడం అవసరమని చెబుతున్నాయి.
ఉమ్మడి కుటుంబాలు లేక..
జిల్లాలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు పెట్టింది పేరు. నేడు దాదాపు ఆ పరిస్థితి లేదు. పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంట్లో నలుగురు నుంచి పది మంది వరకూ పిల్లలను కనేవారు. వారికి తాతయ్యలు, నాన్నామ్మలు, బాబాయిలు, పిన్నిలు ఇలా పెద్ద కుటుంబం అండగా ఉండేది. తద్వారా పిల్లల పెంపకం భారం అయ్యేది కాదు. ఇంటి పనుల్లో ఆడపిల్లలు, పొలం పనుల్లో మగపిల్లలు చిన్నతనం నుంచే సాయం చేసేవారు. విద్యా, వైద్య ఖర్చులు పెద్ద సమస్యలుగా ఉండేవి కావు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.
- భార్యభర్త సంపాదిస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి నెలకొంది. అలాగే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన నేపథ్యంలో పిల్లలను చూసుకునే వారు కరువయ్యారు. ఉద్యోగాలు వదులుకోలేక మహిళలు రెండో సంతానానికి ససేమిరా అంటున్న వారూ ఉన్నారు. ఆర్థిక భారం, మహిళల కెరీర్, వారి ఆశయాలు, పెరుగుతున్న జీవన వ్యయం వంటివి కూడా జననాలరేటు తగ్గడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
పెద్దగా పెరగని జనాభా
జనాభా లెక్కలు ప్రతి పది సంవత్సరాలు ఒకసారి లెక్కించడం సాధారణం. 2001 లెక్కల ప్రకారం 27 మండలాల్లో 18,45,392 మంది ఉండగా 2011కు వచ్చే సరికి ఆ సంఖ్య 19,30,811కు చేరింది. 2021లో కొవిడ్ కారణంగా జనాభా గణన చేపట్టలేదు. ప్రస్తుతం అంచనా ప్రకారం 20,73,282 మంది ఉన్నారు. దీనినిబట్టి జనాభా పెద్దగా పెరిగినట్లు లేదు.
ఆస్పత్రుల చుట్టూ జంటలు
కొన్ని సంవత్సరాలుగా అనేక మంది నవ దంపతులు సంతానం కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పరిస్థితి కరోనా తర్వాత మరింత పెరిగింది. సంవత్సరాలుగా సంతాన సాఫల్యత లేక వైద్యులను సంప్రదిస్తున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మారిన ఆహారపు అలవాట్లు, ఆలస్యంగా వివాహాలు కూడా ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు.
ఐదు సంవత్సరాల్లో జిల్లాలో జననాల రేటు
సంవత్సరం పుట్టిన పిల్లలు జననాల రేటు
2021-22 25,681 10.64
2022-23 31,049 14.99
2023-24 28.071 13.53
2024-25 24,424 12.36
2025-26 22,318 11.29
=============
కాన్పు అంటేనే ఖర్చు
గర్భం దాల్చినప్పటి నుంచి నెలనెలా స్కానింగ్‌లు, మందులకే వేల రూపాయల్లో ఖర్చువుతోంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామంటే నమ్మకం లేదు. ప్రైవేటుకు వెళ్తే రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నారు. బిడ్డ పుడితే అప్పుల పాలవుతున్నాం. ప్రభుత్వం ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తుందన్న భరోసా లేనప్పుడు ఎక్కువమందిని కనే సాహసం ఎలా చేయగలం.
- బి.లక్ష్మి, గృహిణి, గరివిడి
పిల్లలను కనడం మంచిదే కానీ..
డాక్టరు మైనేని కృష్ణకుమారి, గైనకాలజిస్ట్, విజయనగరం
ఎక్కువ మంది పిల్లలను కనడం మంచిదే. కాని వైద్యపరంగా చూస్తే.. ఒక మహిళ శారీరక, మానసిక ఆరోగ్య స్థితిని విస్మరించకూడదు. మారుతున్న జీవనశైలి, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి వల్ల ఇప్పటికే అనేక మంది మహిళల్లో రక్తహీనత, థైరాయిడ్, పీసీఓడీ వంటి సమస్యలు ఉంటున్నాయి. ఒక కాన్పు నుంచి మరొక కాన్పుకు కనీసం మూడేళ్ల వ్యవధి లేకపోతే తల్లి శరీరం తీవ్రంగా దెబ్బతినే అవకాశం వుంది. తల్లి సంపూర్ణ ఆరోగ్యంగా వుండి, ఆర్థిక భరోసా వున్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుంది.
----------------------------