Mutual Cooperation పరస్పర సహకారంతో..
ABN , Publish Date - Mar 09 , 2026 | 12:31 AM
With Mutual Cooperation ఏవోబీలో గంజాయి నిర్మూలనకు ఇకపై ఏపీ, ఒడిశా పోలీసులు సంయుక్త కార్యచరణతో ముందుకు వెళ్లనున్నారు. ఇటీవల ఇరు రాష్ట్రాల పోలీస్ ఉన్న తాధికారులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏవోబీలో ఒడిశాలోకి ఏపీ పోలీస్ వెళ్లే అవకాశం
ఒడిశా పోలీసులు ఏపీలోకి వచ్చేలా వెసులుబాటు
నిర్ణయించిన ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు
సాలూరు రూరల్, మార్చి8(ఆంధ్రజ్యోతి): ఏవోబీలో గంజాయి నిర్మూలనకు ఇకపై ఏపీ, ఒడిశా పోలీసులు సంయుక్త కార్యచరణతో ముందుకు వెళ్లనున్నారు. ఇటీవల ఇరు రాష్ట్రాల పోలీస్ ఉన్న తాధికారులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. గంజాయి నియంత్రణ విషయంలో ఏపీ పోలీసులకు ఒడిశా పోలీసులు పూర్తిగా సహకరించనున్నారు. గతంలో మావోయిస్టుల కట్టడికి ఏపీ పోలీసులు సరిహద్దు దాటి ఒడిశాలోకి వెళ్లినట్టే.. ఇకపై గంజాయి సమాచారం తెలిస్తే గీత దాటనున్నారు. ఒడిశా పోలీసులు సైతం వచ్చి ఏపీలోకి వచ్చి చర్యలు తీసుకునే వెసులుబాటు కలిగింది.
ఆ నివేదిక ప్రకారం చూస్తే..
- వాస్తవంగా ఏవోబీలోనే అత్యధికంగా గంజాయి సాగవుతుండగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలావరకు కట్టడి చేసింది. అయితే 2020 నుంచి నవంబరు 2025 వరకు దేశంలో 38.29 లక్షల కిలోల గంజాయి పట్టుబడగా.. అందులో 40 శాతం ఒడిశా, ఏపీలో స్వాఽఽధీనం చేసుకున్నట్లు ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వశాఖ పార్లమెంట్‌కు అందించిన నివేదిక ప్రకారం తెలుస్తోంది. మొత్తంగా గంజాయి విషయంలో ఒడిశా, ఏపీ రాష్ర్టాలు ప్రథమ, ద్వితీయ స్థానంలో ఉన్నాయి.
- గతేడాది ఒడిశాలో గంజాయి కేసులు అధికంగా నమోదయ్యాయి. ఏపీలో మాత్రం సీసీ కెమెరాలు వినియోగించడం, డ్రోన్లుతో పరిశీలన, చెక్‌పోస్టులు, ఈగల్ టీంలు ఏర్పాటుతో దాదాపు తగ్గుముఖం పట్టాయని కేంద్రహోంమంత్రిత్వశాఖ తన నివేదికలో వెల్లడించింది.
- ఒడిశాలో ఇప్పటికీ మల్కనగిరి, కోరాపుట్, రాయగడ తదితర జిల్లాలో శీలావతి, రాజహంస, తాళపత్ర రకాలు వంటి నాణ్యమైన గంజాయి సాగవుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. మారుమూల అడవుల్లో ఇది సాగవుతుండడంతో పాటు ఏపీ మీదుగా హరియాణ, పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఏపీలో గంజాయి సాగు నియంత్రించినా ఒడిశా నుంచి రవాణా తలనొప్పి వ్యవహరంగా మారింది.
ఒడిశాలోనే అధికం..
ఏవోబీలో ఒడిశా రాష్ట్రం పాడువా పరిధి జోలాపుట్ రిజర్వాయర్‌లోని ఓ ద్వీపంపై ఇటీవల ఒడిశా పోలీసులు దాడి చేసి రూ.200 కోట్ల విలువైన ద్రవ గంజాయి ( హ్యాషిష్ ఆయిల్), మరో రూ. 5 కోట్ల ముడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఒడిశాలో సాగు అధికంగా ఉండడంతో గంజాయి నిర్మూలనకు ఒడిశా పోలీసులు సైతం ఏపీ సహకారం కోరారు. దీంతో సమాచార మార్పిడి, ప్రస్తుత పరిస్థితులు, ఉమ్మడి ఆపరేషన్లకు సంయుక్త కార్యాచరణ చేయనున్నారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కేసులు ఇలా..
ఉత్తరాంధ్ర ఐదు జిల్లాల్లో 1423 కేసులు నమోదు చేసి 762 మందిని అరెస్ట్ చేసి 3,515 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో హోం మంత్రి అనిత చెప్పారు. ఇందులో పార్వతీపురం మన్యం జిల్లాలో 19 కేసులు, విజయనగరం జిల్లాలో 87 వరకు గంజాయి కేసులు నమోదయ్యాయి.
కట్టడికి పటిష్ఠ చర్యలు
గంజాయి నియంత్రణకు ఉమ్మడి జిల్లాలో ఈగల్ టీంలను బలోపేతం చేశారు. పి.కోనవలస, కొట్టక్కి, కొమరాడ, ఎల్విన్‌పేట, బత్తిలి, మెంటాడ, గ్రీన్‌ఫీల్డ్ హై వే, బొడ్డవరలో చెక్‌పోస్టులు, డ్రోన్లతో నిఘా పెంచారు. డాగ్‌స్క్వాడ్లతో రైళ్లలో మెరుపు తనిఖీలు చేస్తున్నారు. ఇకపై ఒడిశా పోలీసుల సహకారమందించనుండడంతో ఏవోబీని గంజాయి రహిత ప్రాంతంగా తీరదిద్దడానికి ఏపీ పోలీసులు కార్యాచరణ చేశారు. సాలూరు సర్కిల్‌లో అధికంగా ఒడిశా సరిహద్దు ప్రాంతం ఉండడంతో గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు సాలూరు రూరల్ సర్కిల్ సీఐ పి. రామకృష్ణ తెలిపారు.